వోట్లెలా వస్తాయి? వచ్చిన వోట్లు సీట్లెలా అవుతాయి? ఈ రహస్యం తెలిసినట్టే వుంటుంది కానీ, తెలియదు.ఈ విద్య పట్టుపడినట్లే వుంటుంది కానీ, పట్టుపడడు.ఈ ఆట చిక్కినట్లే వుంటుంది కానీ, చిక్కదు.
స్వతంత్ర భారతంలో ఎందరో రాజకీయ దురంధరులు ఈ వాస్తవాన్ని నిరూపించారు. తన చతురతకు తిరుగులేదనుకున్న ఇందిరా గాంధీ, ఎమర్జన్సీ తెచ్చి వోటమి చవి చూశారు. పశ్చిమ బెంగాల్‌ను కమ్యూనిస్టుల కంచుకోటగా మార్చిన జ్యోతిబసు, అంతిమంగా తృణమూల్ కాంగ్రెస్‌కు దారివ్వక తప్పలేదు. మరాఠీ మంత్రం జపించి ముంబయిని గడగడలాడిరచిన ‘పెద్దపులి’ బాల థాకరే, మధ్యలో మహారాష్ట్ర ‘బుల్’ శరద్ పవార్ ఎదురయితే తోకముడవక తప్పలేదు. అంతెందుకు? ద్రావిడ రాజకీయాల మీద ‘పేటెంటు’ పొందినట్టుగా మాట్లాడే కరుణానిధి కూడా, ‘పురచ్చితలై’ జయలలితకు మధ్య మధ్య దారి ఇస్తూనే వున్నారు. ‘మండల్’ మహర్షి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, ‘మందిర్’ వ్యూహకర్త లాల్ కృష్ణ అద్వానీలు సైతం ఒక్కొక్కసారే తమ పాచికల్ని విజయవంతంగా వేయగలిగారు.
ఇప్పుడు కొత్తగా రాజకీయ మాంత్రికుడు దిగాడు. ఆయన దిగితే రాజకీయాలు తారుమారయిపోతాయంటున్నారు. ప్రత్యర్థులు మూటా ముల్లే సర్దుకోవాలంటున్నారు. ‘బాండ్ పేపర్’ మీద విజయం రాసిచ్చినట్లే అంటున్నారు.
అతడే అమిత్ షా. ఉత్తరప్రదేశ్ లో పాతాళంలో వున్న బీజేపీని ఆకాశంలో నిలబెట్టిన వాడు. ( 2009లో వున్న 10 పార్లమెంటు సీట్లను 2014లో 71కు పెంచిన వాడు). నరేంద్రమోడీకి అనుంగు సహచరుడు. గుజరాత్లో బీజేపీని పునాదులనుంచి పునర్మించినవాడు. ఇప్పటి బీజేపీ అధ్యక్షుడు. ఈ వ్యూహకర్త ఇప్పుడు ఇదే ఆట దక్షిణాదిన అడతానంటున్నారు. అందుకు తెలంగాణను ‘వ్యూహ కేంద్రం’ గా చేసుకుంటున్నారు. ఈ ఆటకు హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికలే డ్రస్ రిహార్సల్స్ కానున్నాయి. నగర తెలంగాణ తర్వాత గ్రామీణ తెలంగాణ మీద దృష్టి పెడుతున్నారు. 2019 ఎన్నికలలో తెలంగాణ సర్కారు మీద కాషాయ పతాకాన్ని ఎగురవేస్తానంటున్నారు. తెలంగాణతో పాటు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలపై కూడా అమిత్ కన్ను వేసినట్టుగా ఆయన మాటల్ని బట్టి అర్థమవుతుంది.
అయితే ‘యూపీ మోడల్’ ఇతర రాష్ట్రాలకు వర్తిస్తుందా? యూపీలో అమిత్ చేసిన ట్రిక్కు చిన్నదే. కానీ ఫలితమే పెద్దది. అంతకు ముందు అద్వానీ వేసిన పాచికనే, తిరగేసి వాడారు. ఇద్దరిదీ ‘ద్వేష’ రాజకీయమే. మైనారిటీ మతస్తుల మీద కోపం రప్పిస్తే, మెజారీటి మతస్తులు వోటేస్తారు. అందుకోసం అప్పుడు అద్వానీ ‘మందిర్-మసీదు’ వివాదం వాడితే, ఈ సారి అమిత్‌షా ముజఫర్‌నగర్ అల్లర్లను ఉపయోగించుకున్నారు. అయితే అద్వానీ ఒక్క ‘మతం’ మీద మాత్రమే ఆధారపడ్డారు. కానీ అమిత్ ‘కులాన్నీ, మతాన్నీ’ కలిపి వాడారు. ‘హిందూ- ముస్లిం’ వైరం అనకుండా అల్లర్లను ‘బీసీ-ముస్లిం’ల తగాదాగా చూపించారు. దాంతో అప్పటి వరకూ మైనారిటీలతో వున్న ‘బీసీ’లను అగ్రవర్ణ హిందువుల సరసన చేర్చారు. అంతే ఆట పూర్తయిపోయింది.
ఇదే మోడల్ని తెలంగాణలో ప్రయోగించటం సాధ్యమేనా? ఇక్కడ రాష్ట్రం వరకూ ముస్లింలు మైనారిటీలు. కానీ హైదరాబాద్ వరకూ తీసుకుంటే వారు శక్తిమంతమైన మైనారిటీ, ఇక పాతబస్తీ వరకూ తీసుకుంటే మెజారిటీ. వీరి మీద మజ్లిస్‌కు వున్న పట్టు తెలిసిందే. ఈ మజ్లిస్‌తో కేసీఆర్ చెలిమి చేస్తున్నారు. అయన ఇప్పటికే ‘తెలంగాణ సెంటిమెంటు’ పేరుమీద ఎస్సీలకూ, ఎస్టీలకూ గ్యాలం వేశారు. బీసీలపై కూడా కేసీఆర్ పార్టీ టీఆర్ఎస్కు పట్టులేకుండా పోలేదు. అలాగే ‘మోడీ’ మార్కు పట్టణ మధ్యతరగతి యువత రాజకీయ చైతన్యం కన్నా, తెలంగాణ ఉద్యమంలో చురుకుగా వున్న గ్రామీణ బడుగు వర్గాల విద్యార్థుల ప్రభావం ఎక్కువ. కాబట్టి అక్కడలాగా ‘ముస్లిం-బీసీల’ వైరాన్ని చూపించి వోట్లు దండుకోవటం సాధ్యం కాక పోవచ్చు.
యూపీలో విజయం సాధించి అదే మోడల్‌ను ఇతర రాష్ట్రాలలో ప్రయోగించాలని విఫలమయిన ఇతర పార్టీల వ్యూహకర్తలు కూడా లేక పోలేదు. బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్ తన యూపీ మార్కు ‘బహుజన’ రాజకీయాన్ని ఇతర రాష్ట్రాలలో, మరీ ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో సమర్థవంతంగా ప్రవేశపెట్టలేక పోయారుÑ ఎస్పీ లో రాజకీయ చతురుడుగా పేరు పొందిన అమర్ సింగ్ కూడా రాష్ట్రం వెలుపల చిన్నబోయారు. అమిత్‌షా పట్ల అమితమైన అంచనాలు పెట్టుకోవటం, అన్ని వేళలా, అన్ని రాష్ట్రాలలోనూ పార్టీకి వీలుకాక పోవచ్చు.