సంస్కృతం ఎంతమందికి మాతృభాష?

ఆగస్టు 7-13 మధ్య కేంద్రప్రభుత్వం సంస్కృత భాషావారం నిర్వహించింది. ఈ సందర్భంలో దాన్ని తమ మాతృభాష అని చెప్పుకునే వారెందరు అనే ప్రశ్న తలెత్తింది. సంస్కృతం మాట్లాడడమంటే మన సంస్కృతిని కాపాడుకోవడం, జనాభా లెక్కల…

ఆగస్టు 7-13 మధ్య కేంద్రప్రభుత్వం సంస్కృత భాషావారం నిర్వహించింది. ఈ సందర్భంలో దాన్ని తమ మాతృభాష అని చెప్పుకునే వారెందరు అనే ప్రశ్న తలెత్తింది. సంస్కృతం మాట్లాడడమంటే మన సంస్కృతిని కాపాడుకోవడం, జనాభా లెక్కల వాళ్లు వచ్చినపుడు మా భాష సంస్కృతం అని చెప్పాలి అనే ఉద్యమం 1991 జనాభా గణన కాలంలో తలెత్తింది. 1981లో దేశం మొత్తం మీద 6106 మంది మాత్రమే తమ మాతృభాష అని చెప్పుకున్నారు. ఈ ఉద్యమం కారణంగా 1991లో అది 49,736 అయింది. 2001 నాటికి ఆ వుత్సాహం చల్లారడంతో 14,135 కి తగ్గిపోయింది. జనాభా పెరిగినపుడు సంఖ్య కూడా పెరగాలి కానీ తగ్గిందంటే దాని అర్థం – తమ మాతృభాష వేరే అయినా కావాలని సంస్కృతం అని చెప్పారన్నమాట. భాష పరంగా యిప్పటిదాకా అందుబాటులో వున్నవి 2001 గణాంకాలే కాబట్టి సంస్కృత భాషీయులు ఎక్కడెక్కడ ఎంతమంది వున్నారో చూడబోతే – ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌ జిల్లాలో 558, ఉన్నావ్‌లో 334, లఖనవ్‌లో 334, గోరఖ్‌పూర్‌లో 300, ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో 288, ఢిల్లీలో 279 మంది వున్నారు. ఇక దక్షిణాదిన బెంగుళూరులో 235, ఆదిలాబాద్‌లో 134 మంది వున్నారు. ఈశాన్య రాష్ట్రాలలో, తూర్పు రాష్ట్రాలలో మధ్యప్రదేశ్‌, తమిళనాడు, కేరళ, గుజరాత్‌ తదితర రాష్ట్రాలలో ఒక్కరు కూడా లేరు. 1921 జనగణనలో దేశం మొత్తం మీద 356 మంది వుంటే వారిలో 315 మంది మద్రాసు రాష్ట్రంలోనే వున్నారు. ఇప్పుడు అక్కడ ఎవరూ లేరు. 

గతంలో దూర్‌దర్శన్‌లో ''సురభి'' కార్యక్రమంలో ఒక గ్రామం చూపించి వూళ్లో అందరూ సంస్కృతం మాట్లాడుతున్నట్టుగా చూపించారు. అది నిజమో, అతిశయోక్తో తెలియదు. సంస్కృతం తెలిసి వుండడం వేరు, మాతృభాషగా కలిగి వుండడం వేరు. అయినా మాతృభాష అని చెప్పుకోవడం దేనికంటే సంస్కృతంపై అందరికీ గౌరవం, అభిమానం. సంస్కృతం యొక్క ప్రభావం దేశంలోని అన్ని భాషలపై వుంది కానీ నిజం చెప్పాలంటే దాని ఉనికి ఎక్కడా లేదు. సంస్కృతభాష వ్యాప్తి చెందితే దేశంలోని యితర భాషలకు, తమ మాతృభాషకు గల సామ్యం బాగా అర్థమవుతుంది. ఇతర భాషలు నేర్చుకునేందుకు వీలు పడుతుంది. సంస్కృతం మాతృభాషగా లేనివారు కూడా సంస్కృతంలో అద్భుతమైన రచనలు చేశారు – ఇంగ్లీషు మాతృభాష కానివారు ఇంగ్లీషులో గొప్ప రచనలు చేసినట్లే! 
    
– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఆగస్టు 2014) 

[email protected]