అదేం శాపమో, ఎప్పుడూ హైదరాబాద్‌ది ప్రతిపక్షం బాటే.
అధికార పక్షానికి కార్పొరేషన్ ఎన్నికలు జరిపించాలంటే జంకే?
తెలుగు దేశం పార్టీ హయాంలో కాస్త నయం కానీ, ఒకప్పుడు కాంగ్రెస్‌కు కానీ ఇప్పుడు తెరాసకు కానీ ఇదే సమస్య.
భాజపా గెల్చుకుపోతుందని కాంగ్రెస్ భయపడేది తెలుగుదేశం రాక ముందు.
తెలుగుదేశం గెల్చుకు పోతుందేమో అని తెరాస భయపడుతోంది ఇప్పుడు.
ఈ సమస్య గట్టెక్కాలంటే ఎలా?
ఇదే ఇప్పుడు తెలంగాణ సిఎమ్ కెసిఆర్ ముందున్న తక్షణ సమస్య. అందుకోసమే ఇప్పుడు కెసిఆర్ వ్యూహరచన చేస్తున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఆ వ్యూహాలు ఓ కొలిక్కి వచ్చేవరకు, బహుశా జిహెచ్‌ఎంసి జరగవలసిన ఎన్నికలను పక్కన పెట్టే అవకాశం కూడా వుందన్ని వార్తలు వినవస్తున్నాయి. అసలు కేసిఆర్ వ్యూహం ఏమిటో?
విజయశిఖరం విశాలంగా ఏమీ వుండదు.. కుదురుగా కూర్చుని విన్యాసాలు చేయడానికి. పైగా అక్కడున్నవాళ్లని లాగేందుకు ప్రయత్నించేవాళ్ల సంఖ్య తక్కువా కాదు. తెలంగాణ ఉద్యమ విజయం అనంతరం కెసిఆర్ పరిస్థితి ఇదే. ఆ విజయం తరువాత మరే విజయం అతగాడికి దక్కకూడదన్న ప్రయత్నాలు జరిగాయి. కానీ తెలంగాణ సెంటిమెంట్ పనిచేసి, ఆయన్ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చో పెట్టింది. అక్కడితో సవాళ్లు ముగిసిపోలేదు. తెలంగాణకు గుండెకాయ లాంటి హైదరాబాద్‌లో తన పార్టీ సత్తా అంతగా నిరూపణ కాలేదన్న ఆవేదన ఆయనను వెన్నాడుతూనే వుంది. రంగారెడ్డి, హైదరాబాద్ ప్రాంతాల్లో అపరిమితంగా నివసిస్తున్న తెలంగాణేతరుల కారణంగా తెరాస ఆశించిన మేరకు విజయం సాధించలేకపోయిందన్నది నిజం. ఇదే పరిస్థితి రేపు రాబోయే హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎదురుకాదన్న గ్యారంటీ ఏమీ లేదు. కానీ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వదులుకుని, అక్కడి శాసనసభ స్థానాలు వదులుకుని, తెరాస లెక్క ప్రకారం నష్టపోయేది ఏమీ వుండకపోయినా, నైతికంగా అదో మచ్చగా మిగిలిపోతుంది.
నిజానికి హైదరాబాద్‌ది మొదట్నించీ కాస్త భిన్నమైన వైఖరి. ఇక్కడ మజ్లిస్‌తో పోటీ పడుతూ భాజపా తన పట్టు పెంచుకుంటూ వచ్చింది. తెలుగుదేశం ఆవిర్భావానికి ముందు కాంగ్రెస్ తరచు ఇదే తలకాయనొప్పి ఎదుర్కునేది. ఏదో వంకతో హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు వాయిదా వేసేందుకే చూసేది. మజ్లిస్‌తో పొత్తు పెట్టుకున్నది అందుకే. సరే తెలుగుదేశం వచ్చిన దగ్గర నంచి సీను మారింది. రాను రాను ఒకప్పుడు భాజపాకు అండగా వున్న పెద్ద నాయకులు కనుమరుగు కావడం కూడా జరిగింది. దీంతో హైదరాబాద్లో ఇటు తెలుగుదేశం, అటు కాంగ్రెస్ బలం పెంచుకునేందుకు వీలుకలిగింది. ట్రేడ్ యూనియన్లు భాజపా, కాంగ్రెస్‌కు అండగా వుండేవి. మరోపక్క సిపిఎమ్ పాత బస్తీలో మజ్లిస్‌ను ఢీకొనడం ప్రారంభించింది. ఇలా అన్నివైపులా పలు కారణాలు కలిసి వచ్చి, ఒకప్పుడు మజ్లిస్‌కు దీటుగా వున్న భాజపా వెనక్కు చేరి, సీమాంధ్రుల అండతో తెలుగుదేశం ముందుకు వచ్చింది. అయితే వైఎస్ చరిష్మాతో మళ్లీ కాంగ్రెస్ జంటనగరాల్లో పుంజుకుంది. పలువురు శాసనసభ్యులు ఎన్నికయ్యారు. కార్పొరేషన్‌ను మజ్లిస్‌తో కలిసి పంచుకుంది.
ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ విభజన జరిగి, అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కానీ అధికార తెరాసకు మాత్రం కార్పొరేషన్ పరిథిలో పెద్దగా అనుకూల పలితాలు రాలేదు. అదే పెద్ద చింతగా మారింది కెసిఆర్‌కు. శరీరం అంతా వుండి తలలేని చందంగా బాధపడుతున్నారు ఆయన. అందుకే రాజధానిలో పాగా వేయాలని వ్యూహరచన ప్రారంభించారు. సాధారణంగా వ్యూహాలు ఏవైనా మన పెద్దలు సామ, దాన, బేధ, దండోపాయాలతో పోల్చారు ఇప్పుడు కేసిఆర్ కూడా అదే బాట పట్టారు.
దానోపాయం
రాజధాని హైదరాబాద్ నగరాన్ని అన్ని విధాలా అభివద్ధి చేస్తామని పదే పదే నమ్మబలకడం అన్నది అధికారంలోకి వచ్చిన తోలి రోజు నుంచే ప్రారంభించారు. ముంపు అన్నది లేకుండా చేస్తామన్నారు. అధికారులతో చకచకా సమావేశాలు నిర్వహించారు. ఇప్పుడున్న జనాభాకు మరో యాభై లక్షలు అదనంగా జనాభా పెరిగినా సరిపడా సౌకర్యాలు కల్పిస్తామన్నారు. మరోపక్క ఐటి రంగాన్ని అభివృద్ధి దిశగా నడిపించే ప్రయత్నాలు కనబర్చారు.
సామోపాయం
మరోపక్క మజ్లిస్‌ను, నగరంలో చెప్పుకోదగ్గ సంఖ్యలో వున్న మైనారిటీలను ఆకట్టుకునే ప్రయత్నం చేసారు. వారికి రిజర్వేషన్లు, కీలక పదవులు, ఇంకా చాలా వ్యవహారాలు చేపట్టారు. గోల్కొండ కోటలో జెండా ఎగరేసారు. హైదరాబాద్‌లో పెద్ద సంఖ్యలో వుండే ఆటో వాలాలను ఆకట్టకునేందుకు వాటి ఫీజులను రద్దుచేసారు. ఇలా చాలా వ్యవహారాలు నడుపుతున్నారు.
బేధోపాయం
తమతో మంచిగా వుంటే సరే లేకుంటే చాలా కష్టాలు పడాల్సి వస్తుందన్నదానికి శాంపిల్‌గా అన్నట్లు గురుకుల్ ట్రస్ట్ భూముల వ్యవహారాలు వెలికి తీయడం ప్రారంభించారు. మొన్నటి ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలిచిన తెలుగుదేశం ఎమ్మెల్యే వల్ల వారికి ఏ లాభం వుండదని, అదే తెరాస నేత అయితే ఈ తరహా కూల్చివేతలు జరిగి వుండేవి కాదన్న ఆలోచన జనంలో రేకెత్తేలా చేసారు. తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికే సినిమా జనాలకు కూడ చిన్న రaలక్ ఇచ్చారు. నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ వ్యవహారాన్ని కెలికి, కుదుపు, కుదిపి వదిలారు. ఇప్పుడు మాదాపూర్, గురుకుల్ ట్రస్ట్, అయ్యప్ప సొసైటీ ప్రాంతంలో ఇళ్లు కట్టుకున్నవారు, తమకు తెలియకుండానే సరైనవి కాని భూములు కొన్నవారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వస్తే, వీరు కెసిఆర్‌పై ఆగ్రహంతో తెలుగుదేశం వెంట వెళ్తారో, తమ జోలికి మళ్లీ రాకుండా వుంటారన్న ఆశతో టీఆర్‌ఎస్ వెంట వెళ్తారో చూడాల్సి వుంది.
అల్టిమేట్ ఆలోచన
వీటన్నింటికి తోడు ఓ అధ్భుతమైన ఆలోచన కెసిఆర్ చేస్తున్నారన్న వార్తలు వినవస్తున్నాయి. ఇది కాస్త వాస్తవదూరంగా, ఆచరణ సాధ్యం కాదని అనిపిస్తున్నా, అది కూడా ఆలోచించాలి. మహా నగరంగా మారిన, హైదరాబాద్, సికిందరాబాద్, సైబరాబాద్‌లను మళ్లీ మూడుగా చేయాలన్నది కెసిఆర్ ఆలోచన అన్న వదంతి ఒకటి వినిపిస్తోంది. హైదరాబాద్‌ను చాలా చిన్నగా పరిమితం చేసి, హైదరాబాద్‌ను, సైబరాబాద్‌ను, సికిందరాబాద్‌ను పెద్దవిగా చేయడం ద్వారా పలు రాజకీయ ప్రయోజనాలు కెసిఆర్ ఆశిస్తున్నారని అంటున్నారు. అప్పుడు హైదరాబాద్ మాత్రమే సమైక్య రాజధానిగా వుంటుంది. గవర్నర్ అధికారాలు సైబారాబాద్, సికిందరాబాద్‌ల్లో వుండవు. ఈ ప్రాంతాల్లోనే సీమాంధ్రులు ఎక్కువగా వుంటున్నారు. పైగా మజ్లిస్ కూడా దీనికి పెద్దగా అభ్యంతరం చెప్పకపోవచ్చు. లేదూ ఎవరైనా కోర్టుకు వెళ్తే, ఆ వంకన ఎన్నికలు దూరం తోసేయచ్చు. కానీ ఇక్కడో సమస్య వుంది. కేంద్రం పథకాలు, నిధులు, పలు స్కీములు రాబట్టుకునేందుకే జిహెచ్‌ఎంసికి వైఎస్ రూపకల్పన చేసారు. అలాగే విహెచ్‌ఎంసి (విశాఖ)కు కూడా ఇలా బోలెడు పథకాలు, నిధులు వస్తున్నాయి. ఇప్పుడు మళ్లీ అవి రాకుండా పోతాయి. అందువల్ల అలాంటి పనికి కెసిఆర్ దిగుతారని అనుకోవడం కష్టం. ఇది రాజకీయ వదంతి కావచ్చు.
భాజపా ఏం చెస్తుంది?
కార్పొరేషన్ ఎన్నికలు వస్తే భాజపా ఏం చెస్తుందన్నది మరో ప్రశ్న. తెలుగుదేశంతో పొత్తు కొనసాగిస్తుందా అన్నది అనుమానం. తెలుగుదేశంతో పొత్తు లేకుంటే, భాజపా స్థాయి ఎలా వుంటుదో? చూడాలి. పైగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఈ ఎన్నికలకు దిగుతుందని అంటున్నారు. అదే జరిగితే పరిస్థితి అంచనాలకు అందడం కష్టం. ఇప్పటికే పవన్ – తెరాస ఉప్పు నిప్పు వ్యవహారంలా వుంది. మరి అలాంటపుడు పోరు కాస్త గట్టిగానే వుంటుంది. కెసిఆర్ చాలా యుద్దాలు చూసారు ఇప్పటికే. మరి ఈ కార్పొరేషన్ సంగ్రామం ఎలా ఎదుర్కోంటారో చూడాలి మరి.
చాణక్య