రాయల్టీలో వాటా యిస్తానన్నారు : సాహితీసర్వస్వానికి సంబంధించినదే కాబట్టి ఒక్క విషయం చెప్పక తప్పదు. విశాలాంధ్రవారు సాహితీసర్వస్వం అమ్మకాలపై రాయల్టీ యివ్వసాగారు. రమణగారు అది తీసుకోవడానికి కించపడ్డారు. 'దీనిలో సగమే నాకివ్వండి. బొమ్మలతో అందం తెచ్చిన బాపుకి, దీనికంతా కారకుడైన ఎమ్బీయస్ ప్రసాద్‌కి మిగతా సగం పంచండి' అన్నారు. విశాలాంధ్రవారు 'అయ్యా యివన్నీ లీగల్‌గా చాలా సమస్యలు వస్తాయి. మీరే ఏదో చేసుకోండి' అని చెప్పారు. రమణగారు నాకు పాతికవేలు పంపారు. ఆ ఆఫర్ విని బాధతో గొంతు పెగలలేదు.
''మీరు ప్రేమతో, నాపై యిష్టంతో చేశారు. నాకు తెలుసు. అయినా మీరు తీసుకోవాల్సిందే'' అంటూ చెక్కు పంపేశారు. అది నేను ఎన్‌క్యాష్ చేసుకోలేదు. ఇక ఆయన ఫోన్లపై ఫోన్లు. ''మీరు అది తీసుకోకపోతే నాకు యీ డబ్బు జీర్ణం కాదు.'' అంటూ. చివరకి ఇకపై ఎప్పుడూ యివ్వకూడదన్న షరతుపై ఒప్పుకున్నాను. తర్వాత ''ఆ చెక్కు అలాగే లామినేట్ చేయించి వుంచేసుకుంటాను. మీరు డ్రాఫ్ట్ పంపండి.'' అన్నాను. ''అలా అయితే పాతికవేలకేం ఖర్మ! చెక్కు పాతికలక్షలకు రాద్దునే'' అన్నారు రమణగారు నవ్వుతూ. ఆ తర్వాత తన పుస్తకాలకు రాయల్టీ వచ్చినప్పుడల్లా ఆయన నాకు ఫోన్ చేసి ఆ మొత్తం ఎంతో చెప్పి 'ఇదంతా మీ వల్లనే' అంటూ వచ్చారు ! ఇంత మంచితనం తట్టుకోవడానికి కూడా దేవుడు మనకు శక్తి నివ్వాలి.
కోతికొమ్మచ్చి : నేను ఖచ్చితంగా చెప్పగలను – సాహితీసర్వస్వానికి వచ్చిన స్పందనే రమణగారిని ''కోతికొమ్మచ్చి'' రాయడానికి ప్రేరేపించింది. తెలుగువాళ్లకు ఓ అద్భుతసృష్టి వరప్రసాదంగా లభించింది. సినిమాల జోరు తగ్గాక బాపు-రమణలు ''భాగవతం''పై దృష్టి సారించారు. అది చాలా ఆలస్యమై వారికి విసుగు కలిగించింది. ఆర్థికంగా ఉపకరించలేదు. సీరియల్ ఎంతో ప్రజాదరణ పొందినా దానిని వేరేవారు క్లెయిమ్ చేసుకోవడం మొదలుపెట్టారు. తర్వాత సినిమాలు, సీరియల్స్ ఏదో ఒక వర్క్ వస్తూనే వుంది కానీ రమణగారు అంత తృప్తిగా లేరు. ''భాగవతం'' సీరియల్‌గా వచ్చాక ఆ స్రిప్టును పుస్తకంగా వేయడానికి డా|| విజయమోహన్ రెడ్డి (అనంతపురం) ముందుకు వచ్చారు. ఆ పుస్తకం చాలా బాగా అమ్ముడుపోయి, ఏడాది క్రితం రెండో ముద్రణకు వచ్చింది. నేను దాన్ని వచనంలో చిన్న పుస్తకంగా సంక్షిప్తీకరించి ''నలుగురు మెచ్చిన భాగవతం''గా వేశాను. రమణగారికి అది బాగా నచ్చింది.
ఇలాటి పరిస్థితుల్లో ఒక దినపత్రిక ఆదివారం అనుబంధం ఆయన చేత ఒక వ్యాసం రాయించింది. దానికి మంచి రెస్పాన్స్ రావడంతో 'మీ జీవితచరిత్ర రాయండి. సీరియల్‌గా వేస్తాం' అన్నారు వాళ్లు. రమణగారు నాతో చెప్పి ఏమంటారు? అన్నారు. వరప్రసాద్ సీరియల్ వాళ్లు డీల్ చేసిన విధానం చెప్పి ''స్వాతి''కి దానికి రాయండి అన్నాను.
''ఆత్మకథ రాయమని చాలామంది చెప్పారు కానీ మన గొప్ప చెప్పుకున్నట్టు వుంటుందేమో..'' అని సందేహించారాయన.
''మీకు తెలిసున్న గొప్పవాళ్లందరి గురించీ రాయండి. వాళ్ల గురించి రాసినపుడు మీ గురించిన ప్రస్తావన ఆటోమెటిక్‌గా వస్తుంది…'' అని సూచించాను. ఇలా చాలామందే చెప్పి వుండవచ్చు. నాకు తెలియదు. కానీ ఆయన రాయడం మొదలుపెట్టారు. చిత్రం ఏమిటంటే ఆయనను సాధారణంగా ఏం అడిగినా 'గ్యాపకం లేదండి' అనేవారు. ఆలాటాయన ''కోతికొమ్మచ్చి''లో చిన్నచిన్న విషయాలను – తను ప్లాట్‌ఫాం మీద పడిపోయిన రైల్వేస్టేషన్ మాస్టారి పేరుతో సహా – ఎలా గుర్తుకు తెచ్చుకున్నారో అనూహ్యం. ఎలా అని అడిగాను. 'ఏమోనండీ, ఎక్కడా రాసి పెట్టుకోలేదు, అవే గుర్తుకు వచ్చేశాయి' అన్నారు. 1953 నుండి ఒక ట్రాన్స్‌లోకి వెళ్లి అన్ని రకాల రచనలనూ పరమాద్భుతంగా సృష్టించేసి సాహితీలోకం నుంచి ఠక్కున రిటైరై పోయినట్టు 45 ఏళ్ల తర్వాత మళ్లీ అలాటి ట్రాన్స్‌లోకి వెళ్లి ''కోతి కొమ్మచ్చి'' రాశారు.
మొదటి సంచిక నుండి జనాలను వెర్రెక్కించింది. సూపర్ డూపర్ హిట్ అయింది. రమణగారికి ఎంతో తృప్తిని, ఆనందాన్ని యిచ్చింది. సీరియల్‌కు కావలసిన ఫోటోలు అవీ నేను సప్లయి చేస్తూ వుండేవాణ్ని. సీరియల్ నడుస్తూ వుండగానే పుస్తకం వేస్తే బాగుంటుందనుకున్నాం. మొదటి 35 వారాల మేటర్‌తో మేం ''హాసం ప్రచురణలు'' పక్షాన దాన్ని ప్రచురించాం. 1999లో పబ్లిషింగ్ వదిలేసిన మేం 2001 అక్టోబరులో ''హాసం'' హాస్య-సంగీత పత్రికతో మళ్లీ దానిలోకి దిగాం. ఈ సారి వరప్రసాద్ ప్రచురణకర్త. నేను సంచాలకుణ్ని. ''హాసం'' పత్రిక మొదటి సంచిక నుండి చివరి సంచిక దాకా (మొత్తం 78 సంచికలు) ''బాపూరమణీయం'' అనే శీర్షిక నడిపి కేవలం వాళ్ల గురించే వేసేవాళ్లం. ఒక ఏడాది 20 సంచికల్లో నేను 'బాపూ విశ్వరూపం' పేర బాపుగారి బొమ్మలను విశ్లేషించాను. రమణగారి వెండితెర నవల ''ఇద్దరు మిత్రులు'' కాపీ కోసం చాలా ప్రయత్నించి సంపాదించి దాన్ని సీరియల్‌గా ప్రచురించాం కూడా. 2005 నుండి ''హాసం ప్రచురణలు'' పేర పుస్తకాలు వేయడం మొదలుపెట్టాం. ''ఇద్దరు మిత్రులు'' పుస్తకంగా వేశాం. ఆయన రాసిన తక్కిన రెండు వెండితెర నవలలు ''భార్యాభర్తలు'', ''వెలుగునీడలు'' కూడా సంపాదించి ఆయన మరణానంతరం పుస్తకాలుగా వేశాం. విశాలాంధ్ర వారు ''బాపూరమణీయం''ను పునర్ముద్రణ వేస్తామంటే నేను సంచాలకత్వం వహించి చాలా ఫోటోలు అవీ పెట్టి, మంచి గెటప్ తెచ్చాను. అది జనవరి 2012లో రిలీజైంది.
పట్టాభిషేకం : ''కోతికొమ్మచ్చి'' పుస్తకంగా తయారుచేసినపుడ సీరియల్‌లో లేని అనేక ఫోటోలు చేర్చాను. తన ఫోటోలు ఎక్కువగా పెట్టవద్దని బాపుగారి అభ్యంతరాలు చాలా వచ్చాయి. ''అవన్నీ ప్రసాద్‌కు వదిలేయవయ్యా. ఆయన జడ్జిమెంట్ బాగుంటుంది.'' అని రమణగారు నచ్చచెప్పేవారు. పుస్తకం సర్వాంగసుందరంగా తయారైంది. జూన్ 2009లో రమణగారి పుట్టినరోజు సందర్భంగా రవీంద్రభారతిలో ''కోతికొమ్మచ్చి'' ఆవిష్కరింపబడింది. 'చైతన్య ఆర్ట్ ఎకాడమీ' కెకె రాజాగారు సభ చాలా చక్కగా నిర్వహించారు. ఆ రోజు బాపురమణలకు ఘనసన్మానం జరిగింది. ఎవరి ప్రాప్టింగూ లేకుండా ప్రేక్షకులు యిచ్చిన స్టాండింగ్ ఒవేషన్ చూసి వాళ్లు పులకించిపోయారు. సాధారణంగా వారికి సభలంటే ఎలర్జీ అని అందరికీ తెలుసు. కానీ ఆనాటి సభను వారికి మంచి జ్ఞాపకాలను మిగిల్చింది. వారికే కాదు, మాకు కూడా. బాపురమణలు సీరియల్ ప్రచురించిన ''స్వాతి'' బలరాం గారికి, పుస్తకరూపం ప్రచురించిన వరప్రసాద్‌కు, ''భాగవతం'' ప్రచురించిన విజయమోహనరెడ్డికి సన్మానాలు చేశారు. వారితో బాటు నాకు కూడా. తక్కిన ముగ్గురూ పబ్లిషర్లు. నా హోదా – ఒక అభిమాని! ఇది ఒక అభిమానికి చేసిన పట్టాభిషేకం. బాపురమణల చేతుల మీదుగా సన్మానింపబడడమంటే – ఆనాటి రమణగారి మాటల్ని అరువు తీసుకుంటే ''ఇంతకన్న ఆనందమేమున్నదిరా..''!
డిసెంబరు 2009 కల్లా ''ఇంకోతి కొమ్మచ్చి'' తయారై పోయింది. ఈ సారి బాపుగారి అభ్యంతరాలు ఏమీ లేవు. ఆయనకూ నాపై గురి కుదిరింది. అదీ చాలా ఆదరం పొందింది. ఆ తర్వాత కూడా యింకో ఆర్నెల్లు సీరియల్ సాగింది. 2010 మేలో రమణగారు సీరియల్‌కు విరామం యిచ్చారు. ఇది అన్యాయం అని లక్షలాది పాఠకులతో బాటు నేనూ ఆక్రోశించాను.
''రాయడానికి ఉత్సాహంగా లేదండి'' అనసాగారు రమణ. ''కథానాయకుడు ఓటమిలో వుండగా ఇక్కడ ఆపేస్తే ఎలాగండీ. మళ్లీ రైజ్ అయ్యారు కదా. సాహితీసర్వస్వం సూపర్ సక్సెస్ గురించి రాయకపోతే ఎలా? ''భాగవతం'' సీరియల్‌తో టీవీ ఛానెల్‌ను నిలబెట్టిన వైనం, ఆ సందర్భంగా మీరు పడిన కష్టనష్టాలు, ప్రశంసలూ, అవన్నీ రాయకపోతే ఎలా?'' అని పోట్లాడుతూ వచ్చాను. ''మీరు యింకా యిది రాయలేదు, అది రాయలేదు, ఫ్యామిలీ లైఫ్ గురించి రాయలేదు.'' అని గుర్తు చేస్తూ వుండేవాణ్ని.
రమణగారికి వచ్చిన యిబ్బందేమిటంటే – ''కోతికొమ్మచ్చి'' ప్రతీ ఎపిసోడ్‌లోనూ పాఠకులు చమత్కారం కోసం ఎదురుచూడసాగారు. ''మీరు చెప్పిన విషయాల్లో స్పైస్ లేనప్పుడు ఏం రాస్తాం? ఫ్లాట్‌గా వుంటుంది కదా'' అని రమణగారు వాదించేవారు.
''లేదు మీరు రాయాల్సిందే, యిలా అర్ధాంతరంగా వదిలేస్తే బాగాలేదు.'' అని పేచీ పెట్టుకునేవాణ్ని. వరప్రసాదూ నాకు వంత పాడేవాడు.
''అయినంతవరకు పుస్తకం వేసేయండి'' అంటూ రమణగారు కొత్త పాట మొదలుపెట్టారు.
''వెయ్యను. మీరు యింకా రాయండి. ఉన్నది పుస్తకానికి చాలదు. క్లిక్ అవ్వదు'' అని నేను మొండికేశాను. బాపుగారి చేత చెప్పిద్దామని చూస్తే బాపుగారు ఎప్పటిలాగ రమణగారినే సమర్థించారు. 'ఇది క్రియేటివ్ రైటింగండి. మీ క్కావాలి కదాని అప్పటికప్పుడు కాయదు.'' అన్నారు.
నా పోరు భరించలేక ''ముక్కోతి కొమ్మచ్చి''కి సీక్వెల్ వుంటుందనే ఆశ కల్పిస్తూ ఒక టెయిల్ పీస్ రాసి పంపించారు. అది యిది – (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2014)