2003 అక్టోబరు 14 న ఫైనాన్స్ మంత్రిత్వశాఖ గ్రే వరల్డ్‌వైడ్ యాడ్ ఏజన్సీ తయారు చేసిన ''ఇండియా షైనింగ్'' అనే ప్రకటనను విడుదల చేసింది. జిడిపి 8.5% వుందని, ఐటీ సెక్టారులో నారాయణమూర్తి, అజీమ్ ప్రేమ్‌జీ అంతర్జాతీయ ఖ్యాతి గడిస్తున్నారని, యిదంతా ఎన్‌డిఏ ప్రభుత్వపాలన వలననే అనీ యాడ్ సారాంశం. ఏజన్సీ వారు సూచించిన పేర్లు – 'ఇండియా ఎలైవ్, ఇండియా రైజింగ్, ఇండియా డాజ్లింగ్, ఇండియా షైనింగ్'. ఆడ్వాణీకి షైనింగ్ నచ్చింది. భారతదేశంలోని సంపన్నవర్గాలు కూడా హర్షించాయి. దాంతో బిజెపి పార్టీ పెద్దలు ఆ స్లోగన్‌ను సొంతం చేసుకుందామనుకున్నారు. ఫైనాన్స్ మినిస్ట్రీ చిన్నగా మొదలుపెట్టిన ఆ కాంపెయిన్ బిజెపికి రణనినాదంగా మారింది. ఎందుకంటే యీ మధ్యలోనే బిజెపి రాజస్థాన్, మధ్య ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో అసెంబ్లీ ఎన్నికలు నెగ్గింది. రూ. 500 కోట్లు ఖర్చు పెట్టి ప్రచారం సాగింది. ఢిల్లీ హైకోర్టులో ఎవరో పిల్ వేశారు – ఈ యాడ్ కాంపెయిన్‌కు ప్రభుత్వం ఖర్చెందుకు పెట్టాలని? పట్టించుకున్న వారెవరూ లేరు.
ఈ పరిస్థితుల్లో ఆరెస్సెస్ సిద్ధాంతకర్త ఎస్.గురుమూర్తి ముందస్తు ఎన్నికలు జరిపించి, యీ మూడ్‌ను ఎన్‌క్యాష్ చేసుకుంటే మంచిది కదా అని సలహా యిచ్చాడు. దాంతో దాదాపు 9 నెలల ముందుగానే 2004 ఫిబ్రవరిలో లోకసభను రద్దు చేయడం జరిగింది. బిజెపిలో అందరూ హుషారుగానే వున్నారు కానీ వాజపేయికి మాత్రం ఇండియా షైనింగ్ నినాదమూ నచ్చలేదు, ముందస్తు ఎన్నికల ఐడియానూ నచ్చలేదు. కానీ ఆయన ఒంటరి వాడై పోయాడు. మీడియా కూడా బిజెపి పాలనలో ప్రజలందరూ సంతోషంగా వున్నారని గాఢంగా నమ్మింది. వాళ్లు నిర్వహించిన ఒపీనియన్ పోల్సన్నీ బిజెపికి ఘనవిజయాన్ని కట్టబెట్టాయి. అవి చూసి కాంగ్రెసు బెంబేలు పడింది. బిజెపి సమరోత్సాహంతో సోనియా, రాహుల్, ప్రియాంకాల రాజకీయ అనుభవశూన్యత మీదనే కాదు, వారి విదేశీ మూలాలపై కూడా విరుచుకు పడింది. సోనియాకు కిరీటం కట్టబెడితే అది భారతచరిత్రలోనే దుర్దినం అని ఉమాభారతి ప్రకటించింది. సోనియా ప్రధాని అయిన రోజున తను గుండు కొట్టించుకుంటానని సుష్మా స్వరాజ్ ప్రతిన బూనింది. ఇవన్నీ చూసి కాంగ్రెసు దిగాలు పడింది. ఏప్రిల్-మేలో ఎన్నికలు జరిగాయి. ఔట్‌లుక్ ఎప్పటిలాగా సర్వే జరిపి ఎన్‌డిఏకు 276, కాంగ్రెసు దాని భాగస్వాములకు 166 వస్తాయని ప్రకటించింది.
ఔట్‌లుక్ అంచనాలు ఎప్పుడూ తప్పుతాయి కాబట్టి యీసారి బిజెపి ఓటమి ఖాయం అంటూ ఒక పాఠకుడు వెక్కిరించాడు. చివరకు అతని మాటే ఖాయమైంది. 2004 మే 13 న ఫలితాలు వచ్చాయి. రాజకీయ విశ్లేషకులు, సర్వే సామ్రాట్టులు, జ్యోతిష్కచక్రవర్తులు అందరూ ఘోరంగా పరీక్ష తప్పిపోయారు. కాంగ్రెసుకు 145, దాని కూటమికి 217 రాగా బిజెపికి 138, దాని కూటమికి 185 వచ్చాయి. వామపక్షాలకు 60 చిల్లర వచ్చాయి. లెఫ్ట్ సపోర్టుతో కాంగ్రెసు కూటమి అధికారంలోకి రావడం తథ్యం అని అందరికీ తెలిసిపోయింది. బిజెపి పెద్దలకు దిమ్మ తిరిగిపోయింది. ఐటీ రివల్యూషన్ వంటి పైపై హంగులు చూసి, జనాభాలో 20% వుండే నగరవాసుల ఆదాయంలో 40% ఎదుగుదల చూసి బిజెపి, దాన్ని సమర్థిస్తున్న మధ్యతరగతి మురిసిపోయారు కానీ తక్కిన 80% మంది జనాభా వున్న గ్రామాల్లో వ్యవసాయం, ఆదాయం ఎంత దెబ్బ తిందో, పేదవాడు మరింత పేదవాడెలా అయ్యాడో నాయకులు గమనించలేక పోయారు. నగరవాసుల తన బాధను గమనించకుండా దేశం వెలిగిపోతోందని ప్రచారం చేస్తున్న బిజెపిపై అతను తన ఆగ్రహాన్ని బ్యాలట్ ద్వారా చూపాడు. ఢిల్లీలోని 7 సీట్లలో 6టిలో బిజెపి ఓడిపోయింది. వాజపేయి, ఆయన కూతురు ఆ నినాదం వద్దని మొత్తుకున్నా విన్నారా? అని దెప్పిపొడిచారు. ఆ తప్పిదం నాదే అని ఆడ్వాణీ హుందాగా ఒప్పుకున్నారు.
భారత ఓటరు తనను విదేశీరాలుగా పరిగణించక పోయినా సోనియా రాజకీయ విజ్ఞత ప్రదర్శించింది. గతంలో ప్రధాని కావాలని ప్రయత్నించినా తన విదేశీయత చర్చకు వచ్చాక, తను ముందు సీటులో వుండడం కంటె వేరే వారిని కూర్చోబెడితే మంచిదనుకుంది. గద్దె కోసం అయినవాళ్లనే కత్తికి ఎఱ చేసిన, కుట్రలు పన్నిన యీ దేశంలో తన వద్దకు వచ్చిన పదవిని వదులుకున్న వారెవరూ లేరు. ప్రధాని పదవి వదులుకున్నా సోనియా అధికారాన్ని వదులుకోలేదు. దానికి ఒడంబడే మనిషి దొరికాడు – మన్‌మోహన్! ఏ జ్యోతిష్కుడు, ఏ రాజకీయపండితుడు దీని గురించి జోస్యం చెప్పలేదు. యుపిఏ ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోగా ముసలం పుట్టింది. తనకు కావలసిన పోర్టుఫోలియోలు యివ్వకపోతే తప్పుకుంటానని కరుణానిధి బెదిరింపులకు దిగాడు. చివరకు కాసులు రాలే మూడు మంత్రిత్వశాఖలను (సర్ఫేస్ ట్రాన్స్‌పోర్టు, హైవేస్, షిప్పింగ్ – కమ్యూనికేషన్, ఐటీ – ఎన్వైర్‌మెంట్, ఫారెస్ట్‌స్) గుంజుకున్నాడు. టిఆర్ బాలు, దయానిధి మారన్, ఏ రాజా పదవి చేపట్టిన మర్నాటి నుంచి దండుకోవడం మొదలుపెట్టారు. కరుణానిధి కుటుంబకలహం వలన మారన్ తప్పుకోవలసి వచ్చినపుడు రాజా కమ్యూనికేషన్స్ మంత్రిగా వచ్చాడు. చివరకు జైలు కెళ్లాడు.
గతంలో ఔట్‌లుక్ పత్రికకు కన్సల్టెంట్‌గా పని చేసిన జెఎన్ దీక్షిత్ తన పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి దిగాడు. కాంగ్రెసు పార్టీలో చేరి, అది అధికారంలోకి వచ్చినపుడు నేషనల్ సెక్యూరిటీ ఎడ్వైజర్ (ఎన్‌ఎస్‌ఏ)గా చేరాడు. ఎంకె నారాయణన్ ప్రధానికి స్పెషల్ ఎడ్వైజర్ (ఇంటర్నల్ సెక్యూరిటీ)గా చేరాడు. ఇద్దరికీ పడేది కాదు. నారాయణన్ కేరళ నుంచి తన స్నేహితులను తీసుకుని వచ్చి యింటెలిజెన్సు ఏజన్సీలలో నింపడం మొదలుపెట్టాడు. దాన్ని దీక్షిత్ వ్యతిరేకించేవాడు. ఇద్దరికీ ఎప్పుడూ ఘర్షణే. 2004 డిసెంబరులో ఓ రోజు వుదయం గడ్డం గీసుకుంటూ వుండగా గుండెనొప్పి వచ్చి తక్షణం మరణించాడు. సుదర్శన్ ఔట్‌లుక్ విలేకరి దీక్షిత్ స్నేహితులను, కుటుంబసభ్యులను యింటర్వ్యూ చేశాడు. అతని భార్య ''వాళ్లే (పిఎంఓ ఆఫీసు వాళ్లే) అతన్ని చంపేశారు. విపరీతమైన టెన్షన్‌కు గురి చేశారు. నారాయణన్ మా ఆయనకు ముప్పు తెచ్చిపెట్టాడు'' అంది. వీటన్నిటి ఆధారంగా వాళ్ల పేర్లు రాయకుండా విలేకరి కథనం రాశాడు. పిఎంఓలో ఒక అధికారి ''మా ఆఫీసును అప్రదిష్టపాలు చేశారు. మీరు మాకు క్షమాపణ చెప్పాల్సిందే'' అని గర్జించాడు. ప్రధానికి ప్రెస్ సలహాదారుగా వున్నా సంజయ బారు కథనాన్ని ఖండించలేదు కానీ, మీకీ విషయాలన్నీ చెప్పినవారెవరు? అని అడిగాడు. 'కథనాన్ని లోతుగా చదివితే యింత విపులంగా విషయాలు చెప్పగలిగేదెవరో మీరే వూహించవచ్చు' అన్నాడు వినోద్. నారాయణన్ మాత్రం ఉగ్రుడై పోయాడు. ఒక ఫంక్షన్‌లో సుదర్శన్ వెళ్లి తనను తాను పరిచయం చేసుకుంటే ''నువ్వు చెత్త రాస్తున్నావు. నిన్ను లేపేస్తాను. మామూలుగా కాదు, నా పద్ధతిలో..'' అంటూ తిట్ట నారంభించాడు. పాకిస్తాన్‌కు రాయబారిగా పనిచేసిన సతీందర్ లాంబా వ్యవహారం శ్రుతి మీరుతోందని గమనించి ''సుదర్శన్, నీతో పని వుంది, రా'' అంటూ పక్కకు పిలుచుకుపోయి, అక్కడ పరిస్థితి విషమించకుండా చూశాడు.- (సశేషం)
-ఎమ్బీయస్ ప్రసాద్ (జూన్ 2015)