తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ఉన్న బలం కేవలం ఐదు స్థానాలు మాత్రమే. కానీ గత ఎన్నికలలో వారు గెలిచిన స్థానాలు ఎక్కువ. 12 మంది ఎమ్మెల్యేలు, గెలిచిన తర్వాత కాంగ్రెస్ ను వదిలిపెట్టి గులాబీ తీర్థం తీసుకోవడంతో వారికి ఇలాంటి పరిస్థితి దాపురించింది.
ప్రస్తుతం ఉన్నది సభలో ఐదు సీట్లు అయినప్పటికీ వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి వచ్చి తీరుతామని కాంగ్రెస్ పార్టీ అంటోంది. కర్ణాటక ఎన్నికల్లో పార్టీ సాధించిన అపురూపమైన విజయం నేపథ్యంలో, తెలంగాణ ప్రజల మీద కూడా కొంత సానుకూల ప్రభావం ఉంటుందనేది వారి నమ్మకం.
చాలామంది ఇతర పార్టీల్లోని నాయకులు కూడా ఇలాంటి వాదనను నమ్ముతున్నారు గనుకనే భవిష్యత్తు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ని ఎంచునినే ఆ పార్టీలో చేరిపోతున్నారు. ఇదంతా బాగానే ఉంది కానీ అధికారంలోకి రావడం అంటే… ఎన్ని సీట్లు గెలవాలని కాంగ్రెస్ కోరుకుంటున్నదా? అనేది ఇప్పుడు ఆశ్చర్యకరమైన ప్రశ్నగా ఎదురవుతోంది?
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తరఫున రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం తాజాగా జరిగింది. ఈ సమావేశంలో వారికి వ్యూహరచన బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంస్థకు చెందిన సునీల్ కనుగోలు కూడా పాల్గొన్నారు ఆయన నివేదిక ప్రకారం రాష్ట్రంలోని 35 అసెంబ్లీ నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లుగా చెబుతున్నారు. అదే సమయంలో, మిగిలిన 84 నియోజకవర్గాలలో కాంగ్రెస్ గెలుస్తుందనే నమ్మకం వారికి ఉందా అనే సంగతి మాత్రం స్పష్టంగా బయట పెట్టడం లేదు.
ఈ వ్యూహకర్తల నివేదిక ద్వారా 35 నియోజకవర్గాలలో బలహీనంగా ఉన్నాం అనే సంగతి అర్థం అవుతుంది కనుక పరిస్థితిని చక్కగా ఎదుర్కోవడానికి ఇప్పటినుంచే చర్యలు చేపట్టాలని పార్టీ మేనేజ్మెంట్ భావిస్తున్నది. ఈ 35 స్థానాలకు కొత్త అభ్యర్థులను ఎంపిక చేయడం, పార్టీని బలోపేతం చేసుకోవడం జరగాలనేది వారి వ్యూహంగా కనిపిస్తోంది.
అయితే ఇంతగా ప్రయాస పడుతున్న కాంగ్రెస్ పార్టీ, ఈ ఎన్నికలలో రాష్ట్రంలోని మొత్తం 119 స్థానాలను ఏకరీతిగా గంపగుత్తగా గెలుచుకోవాలని అనుకుంటున్నారా అనే చర్చ ప్రజల్లో ఇప్పుడే మొదలైంది. సాధారణంగా ఎవరైనా సరే పార్టీ సింపుల్ మెజారిటీ సాధించి అధికారంలోకి వస్తే చాలు అని కలగంటారు. కానీ కాంగ్రెస్ పరిస్థితి వేరుగా ఉంది.
ఒకవైపు 84 స్థానాలలో తమ పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయని భావిస్తూ మరోవైపు 35 స్థానాలలో గెలవలేమని తెలిసినా మరింత శ్రమ పడాలని అనుకోవడం అనేది వారి డొంక తిరుగుడు వైఖరికి నిదర్శనంగా ఉంది. వారు ఈ 35 స్థానాల మీద దృష్టి పెట్టి పార్టీని బలోపేతం చేసే లోగా… గెలుస్తామని అనుకుంటున్న నియోజకవర్గాలలో కొన్నింటి విషయంలో తేడా కొట్టి మళ్ళీ పార్టీ బలహీనపడితే అప్పుడు ఏం చేస్తారు అనే ప్రశ్న ఎదురవుతోంది.
దక్కేవాటితో ప్రభుత్వంలోకి వస్తామని మరింత కష్టపడకుండా కాంగ్రెస్ 119 టార్గెట్ చేస్తే ఎదురుదెబ్బ తప్పదని అనుకుంటున్నారు.