ప్రముఖ సంఖ్యాశాస్త్రవేత్తలు ఎవరైనా వారికి సలహా ఇచ్చారో ఏమో తెలియదు. లేదా, పాత పేరును కొనసాగిస్తే.. పగ్గాలు పాత సారథుల చేతుల్లోనే ఉంటాయనే అనుమానం పుట్టిందో ఏమో తెలియదు! మొత్తానికి వారు చేస్తున్నది పాత పోరాటమే అయినప్పటికీ.. పేరు మాత్రం కొత్తగా పెట్టుకున్నారు. నామకరణం స్వయంగా రాహుల్ గాంధీ చేశారు.
‘‘నరేంద్రమోడీని ఓడించడానికి పోరాటం చేస్తున్నది కొన్ని పార్టీల కూటమి కాదు.. యావత్తు దేశమే’’ అనే భ్రమ కల్పించడానికి, ప్రజలను మాయ చేయడానికి చేసిన వంకర ప్రయోగమే ‘ఇం.డి.యా.’. భిన్నత్వంలో ఏకత్వం అనే రాజ్యాంగ స్ఫూర్తికి తమ కూటమి ప్రతీక అని చెప్పుకుంటూ I.N.D.I.A. అనే రూపంలో… ఐక్యంగా ఉండే INDIA ను నడుమ చుక్కలతో విడగొట్టి, చీల్చి విపక్షాలు తమ పబ్బం గడుపుకుంటున్న వైనం ఇది. వీరి పాచిక ఫలిస్తుందా? మోడీ 3.0 సర్కారు ఏర్పడకుండా వీరు నిలువరిస్తారా? అనే విశ్లేషణే ఈ వారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ ‘కొత్తపేరు.. పాత పోరు..!’
దేశ రాజకీయాల్లో కీలక సమరానికి ప్రధాన కూటములు తమ తుది బలగాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇం.డి.యా రూపంలో కొత్త పేర్లు ధ్వనిస్తున్నాయి. కొత్త పేర్లు వినిపిస్తున్నాయి గనుక.. కొత్త శక్తులు సమీకృతమవుతున్నాయా? అనుకుంటే అలాంటిదేమీ లేదు. ఒకవైపు అదే నరేంద్ర మోడీ.. ఆయన వెంట గతంలో అలిగిన వెళ్లిన వాళ్లు సహా అదే అనుచర గణం! రెండో వైపున ఒకటిరెండు మార్పులతో అవే పార్టీలు. అదే కాంగ్రెస్ సారథ్యం! కాకపోతే పేరు కొత్తది. I.N.D.I.A.! ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్ అని పేరు పెట్టారు. విపక్ష నాయకులు ఈ పేరు పెట్టుకోవడంలోనే వారికి చిత్తశుద్ధి లేదు. ఇండియా పేరు కావాలని వారు ఫిక్సయిపోయారు.
‘మోడీ మీద పోరాడుతున్నది ఇండియా’ అనే మాట వాడదలచుకున్నారు. మరి ఆ ఇండియా అంటే ఏమిటి.. అనే దానికి తగ్గట్టుగా పదాలను పేర్చుకుంటూ వెళ్లారు. ఈ పేరును కనిపెట్టిన ఘనత రాహుల్ గాంధీకి దక్కుతుంది. నిజానికి ఈ ఇండియా– పూర్తి రూపంలో డి అనే అక్షరానికి డెమోక్రటిక్ అనే పేరునే తొలుత అనుకున్నారట. అయితే.. అధికార కూటమి పేరు ఎన్డిఏ లో కూడా డి అంటే డెమోక్రటిక్ అని ఉంటుంది. వారిని కాపీ కొట్టినట్టుగా ఉంటుందని కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో.. దానిని డెవలప్మెంటల్ అని మార్చారు. అంటే ఏమిటన్న మాట.. ఈ పేరుతో.. తమ కూటమి లక్ష్యం ఏమిటో స్పష్టం చేయాలనే ఉద్దేశం వారికి ప్రధానం కాదు.
పేరు ప్రధానం.. దానికి అనుగుణంగా తమ లక్ష్యాలను మార్చుకుంటారు. ఆ మార్పు తర్వాత కూడా ఇండియా అనే పేరు పట్ల.. ఈ కూటమి ఈ స్థాయికి బాలారిష్టాలు దాటి ఏకం కావడం వెనుక బోలెడంత కష్టం పడిన బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ యాదవ్ అయిష్టాన్నే ప్రకటించారు. బెంగుళూరు భేటీ తరువాత.. అన్ని పార్టీల నాయకులు కలిసి నిర్వహించిన ప్రెస్ మీట్ కు అసలు సూత్రధారి నితీశ్ ఉండకుండానే వెళ్లిపోయారు. ఆయన అలిగారని తేల్చిచెప్పలేం. అయితే, ఆయనతో పాటు లాలూప్రసాద్ యాదవ్, బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ కూడా వెళ్లిపోయిన వైనం చూస్తే అలాంటి అభిప్రాయం కలుగుతుంది. మొత్తానికి మోడీని ఆటాడుకోవడంలో మంచిగా జనాన్ని మాయ చేయగల పేరు పెట్టుకున్నాం అని ఈ కూటమి సారథులు మురిసిపోతున్నట్టుగా కనిపిస్తోంది.
కాంగ్రెస్ పార్టీ మైండ్ గేమ్
ఇండియా కూటమిలోని పార్టీలతో కాంగ్రెస్ మైండ్ గేమ్ ఆడుతోంది. ఇప్పటికే వారు ఇండియా కన్వీనరు పోస్టు మీద తమ పార్టీకి ఆసక్తి లేదని తేల్చి చెప్పేశారు. తద్వారా.. విపక్ష కూటమిలో త్యాగమూర్తి పార్టీ కాంగ్రెస్ అనే ఇంప్రెషన్ క్రియేట్ చేయగలిగారు. అదే సమయంలో.. దాదాపుగా అన్ని భాగస్వామి పార్టీలతోనూ కాంగ్రెస్ మైండ్ గేమ్ ఆడుతున్నట్టుగా తెలుస్తోంది. త్యాగం కూడా ఆ ఆటలో ఒక భాగం అనుకోవాలి.
ఈ కూటమి అవసరం తమకంటె.. మిగిలిన పార్టీలకే ఎక్కువ అనే భావనను కాంగ్రెస్ వ్యాపింపజేస్తోంది. మోడీ ప్రభుత్వం మరోసారి ఏర్పడినా కూడా తమ పార్టీకి వచ్చే నష్టమేమీ లేదని.. ఇవాళ కాకపోతే రేపు అన్నట్టుగా తమ పార్టీ మళ్లీ నిలదొక్కుకుంటుందని.. కానీ మోడీ మరోసారి గెలిస్తే.. చిన్నాసన్నా ప్రాంతీయ పార్టీలు అన్నీ అంతమైపోతాయని కాంగ్రెస్ వారినందరినీ హెచ్చరిస్తున్నట్టుగా తెలుస్తోంది.
మోడీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. రాష్ట్రాలకు ఉండే అధికారాలకు క్రమంగా కోత పెట్టుకుంటూ వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇదే విషయంపై రాష్ట్రాల పరిధిలో ఉండే ప్రతి చిన్న విషయాన్ని కూడా కేంద్రం నుంచి చేస్తుండడం అనేది సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నదని కేసీఆర్ సహా అనేక మంది నాయకులు వేర్వేరు సందర్భాల్లో విమర్శలు చేస్తూనే ఉన్నారు. మోడీ సర్కారు క్రమంగా రాష్ట్రప్రభుత్వాలని, తదనుగుణంగా ప్రాంతీయ పార్టీలను కూడా నిర్వీర్యం చేసేసే సంకల్పంతో ఉన్నదనే ప్రచారం ఉంది. ఇదే ప్రచారాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తమకు అనుకూలంగా వాడుకుంటోంది.
ఇతర పార్టీలను ఒక భయంలోకి నెట్టి.. తన సారథ్యంలోని కూటమిలోకి వచ్చేలా చేసుకుంటున్నది. వారి అంతిమలక్ష్యం వేరు. అందుకే ఢిల్లీ అధికార్ల బదిలీల విషయంలో కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ ను వ్యతిరేకించడానికి తొలుత భీష్మించుకున్నా, తర్వాత మెట్టు దిగి వచ్చారు. మొత్తానికి కూటమి ప్రస్తుతం జట్టుగానే ఉంది. బెంగుళూరు భేటీలోనే ఈ కూటమి కన్వీనర్ గా తన పేరు ప్రకటిస్తారని నితీశ్ కుమార్ ఆశించారని, అయితే ప్రస్తుతానికి ఒక కమిటీని ఏర్పాటుచేసి, నిర్వాహకుడెవరనేది తేల్చకపోవడం వల్లనే ఆయన అలిగారనేది కూడా ఒక ప్రచారం ఉంది. అది మినహా.. కూటమి సవ్యంగా ఉన్నట్టే.
బిజెపి-ఎన్డీయే మైండ్ గేమ్!
భారతీయ జనతా పార్టీ వారి మైండ్ గేమ్ మరొక తీరుగా ఉంది. ఇండియా జట్టు కంటె తమ జట్టు చాలా పెద్దది అని చాటుకోవడమే లక్ష్యంగా భాగస్వామి పార్టీల భేటీకి ఠికానా లేని పార్టీలను కూడా ఆహ్వానించారు. ఇండియా కూటమిలో 26 పార్టీలున్నట్టు లెక్కతేలగా, తమ కూటమిలో 39 పార్టీలున్నట్టుగా చెప్పుకున్నారు. అయితే ఇవన్నీ కేవలం లెక్కపెట్టుకోవడానికి తప్ప బలానికి ఉపయోగపడే పార్టీలు కాదు.
ఈ కూటమిలోని 18 పార్టీలకు పార్లమెంటులోని ఉభయ సభల్లో అసలు ప్రాతినిధ్యం లేదు. 13 పార్టీలకు ఒక్కొక్క సభ్యుడు మాత్రమే ఉన్నారు. కూటమి లెక్కకు 39 పార్టీలైనా చెప్పుకోదగ్గవి బిజెపి, శివసేన మాత్రమే. సభ్యుల బలం బిజెపికే ఎక్కువ ఉండొచ్చు గాక.. కానీ తమ మీద విశ్వాసంతో చాలా పార్టీలు ఉన్నాయనే అభిప్రాయం కలిగించడానికి ఈ ఠికానా లేని పార్టీలనన్నిటినీ వెంటబెట్టుకున్నట్టుగా తెలుస్తోంది.
మిగిలిన పార్టీల సంగతేంటి!
ఈ రెండు కూటముల్లోనూ చేరకుండా మిగిలిపోయిన పార్టీలు చాలా కొన్ని మాత్రమే. వాటిలో భారాస, మజ్లిస్, వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం, బిజూ జనతాదళ్ వంటి పార్టీలు మాత్రమే ముఖ్యమైనవి. మజ్లిస్ విషయానికి వస్తే.. ఇండియా కూటమి తమని నమ్మడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇండియా కూటమి భారాసను మాత్రం నమ్మడం లేదు.
భారాస అనేది కేవలం బిజెపికి బిటీమ్ మాత్రమే అనే ప్రచారంతోనే కాంగ్రెస్ ఇప్పటికీ ముందుకు సాగుతోంది. భారాసను ఆహ్వానిస్తే అసలు తాము ఇండియా కూటమిలోనే ఉండబోము అన్నట్టుగా బెదిరిస్తోంది. బిజూ జనతాదళ్ ప్రస్తుతం కేంద్రం మీద విమర్శలు చేస్తున్నది గానీ, నిజానికి పార్లమెంటులో ప్రతి విషయంలోనూ సర్కారుకు సహకరిస్తూనే ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ ల పరిస్థితి కూడా అంతే. వారు బిజెపికి అనుకూలంగానే వ్యవహరిస్తున్నారు. ఆ దశలో ఈ తటస్థ పార్టీలు ఉన్నాయి.
ఏపీలో పవన్ కు సీఎం సీటు ఎర వేస్తున్న బిజెపి!
పవన్ కల్యాణ్ కు ఆశలావు పీక సన్నం! తాను ముఖ్యమంత్రి అయిపోవాలని కలలుకంటూ ఉంటారేతప్ప.. అందుకు తగిన విధంగా తాను ఏం కసరత్తు చేస్తున్నారో, ఏం కష్టం పడుతున్నారో మాత్రం ఆలోచించుకోరు. తన సభల్లో తాను ఊగిపోయి మాట్లాడేప్పుడు జనం వేసే విజిల్స్, వారి అరుపులు విని.. నేను ముఖ్యమంత్రి అయిపోవాలని వీరంతా కోరుకుంటున్నారు.. నేను అయిపోతాను అని ఆయన భ్రమిస్తుంటారు.
ప్రజల నుంచి వ్యక్తమయ్యే ప్రతి చిన్న సమస్యకు కూడా తన సీఎం సీటును ముడిపెడతారు. మీరు మా పార్టీని గెలిపించి, నన్ను ముఖ్యమంత్రిని చేయండి.. మీ సమస్యలు తీరుస్తా అని మాట్లాడతారు. ఇలాంటి స్థాయికి మించి ఆశపడే నాయకుడు పవన్ కల్యాణ్‌కు ఆ సీఎం సీటునే ఎరగా వేసి రాజకీయం నడిపించాలనుకుంటోంది భారతీయ జనతా పార్టీ. ఎన్డీయే తరఫున పవన్ కల్యాణ్ ఏపీ సీఎం అభ్యర్థిగా ఉంటారని ప్రకటించబోతోంది. ఈ విషయాన్ని పవన్ తో కూడా చెప్పినట్లు సమాచారం.
వారి హామీకి మురిసిపోయి ఆ బుట్టలో పడిన పవన్ కల్యాణ్ ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత.. జగన్ సర్కారు పోవాలి..ఎన్డీయే సర్కారు రావాలి.. అంటూ తాను పాడుతున్న పాటలో చిన్న ‘లిరికల్ ఛేంజ్’ చేసుకున్నారు. అయితే సదరు ఎన్డీయే అనేది తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని బరిలో ఉంటుందా? లేదా స్వతంత్రంగా 175 స్థానాల్లో పోటీచేసి పవన్ ను సీఎం కుర్చీ మీద కూర్చోబెడుతుందా అనే సంగతి స్పష్టత లేదు. ఇలాంటి ప్రకటన ద్వారా.. భారతీయ జనతా పార్టీ రెండు రకాల ఎత్తుగడలు వేస్తున్నట్టుగా కనిపిస్తోంది.
ఒకటి- సీఎం సీటు మీద ఆశ చూపించి పవన్ కల్యాణ్ అసలు తెలుగుదేశం పొత్తుల్లోకి వెళ్లకుండా చూడడం. చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని ఆయనను సీఎం చేయడానికి ప్రయత్నిస్తే గనుక.. ఇక ఎప్పటికీ పవన్ సీఎం కావడం జరగదు అని వారు జనసేనానిని భయపెడుతున్నారు. చంద్రబాబునాయుడు మర్రిచెట్టు లాంటి వాడని, ఆయన నీడలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు అయినా సరే… ఆ పార్టీలు ఎదగవని, వారి శక్తిని కూడా ఆయన లాగేసుకుంటాడని పవన్‌కు బ్రెయిన్ వాష్ చేస్తున్నారు.
అలాగే.. బాబుతో పొత్తుల్లోకి వెళ్లకుండా ఎన్డీయే విడిగా పోటీచేసి రాష్ట్రంలో పట్టుమని పదిస్థానాలు గెలుచుకున్నా సరే.. ఆ తర్వాతి ఎన్నికల నాటికి తమ కూటమి ఇంకా బాగా బలపడుతుందని.. అప్పటికి జనసేనాని ఖచ్చితంగా సీఎం కావొచ్చునని.. అందుకు తగినట్టుగా ఆ సమయానికి ఇటుతెలుగుదేశం, అటు వైసీపీ నుంచి కూడా కీలక నేతల్ని ఫిరాయింపజేసి తమ కూటమికి అనుకూలంగా మార్చేసే వ్యూహాలను ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న రీతిలో ఇక్కడకూడా అమలుచేయగలమని కమలదళం ప్లాన్ చేస్తుండవచ్చు.
ఇది మాటల్లో అనుకున్నంత సులువు కాదు గానీ.. పవన్ కల్యాణ్ తెలుగుదేశం పల్లకీ మోయడానికి పదేపదే ఎగబడకుండా, తమ పార్టీతో కూడా చంద్రబాబు పల్లకీ మోయించకుండా ఆపడానికి ఈ ఎర ఉపయోగపడుతుందనేది బిజెపి ఆలోచన కావొచ్చు.
రెండు- పవన్ ఒత్తిడి ఫలించి ఈ ఎన్నికల సమయంలోనే అనివార్యంగా తెలుగుదేశంతో పొత్తుల్లోకి వెళ్లవలసి వస్తే గనుక.. ఎన్డీయే కూటమికి సగం సీట్లు కావాలని బేరం పెట్టడం ఒక ఆలోచన. ఎందుకంటే.. పొత్తుల్లో ఉన్న పార్టీలు గెలిస్తే.. ఎక్కువ సీట్లు ఉన్నవారినే సీఎం చేయాలనే మాట వస్తుంది. ఎన్డీయే పార్టీలు రెండూ కలిసి 30-40 సీట్లకు పరిమితం అయితే.. నూరుశాతంగా అన్నీ గెలిచినా కూడా సీఎం సీటును డిమాండ్ చేసే అర్హత కూడా ఉండదు. అందుకని తమ రెండు పార్టీలకు కనీసం 65 సీట్లు కావాలని చంద్రబాబుకు బేరం పెట్టాలనే ఆలోచనతో ముందుకు వస్తుండొచ్చు. అదే జరిగితే.. తెలుగుదేశానికి అది ఆత్మహత్యా సదృశం అవుతుంది. చంద్రబాబు ససేమిరా ఒప్పుకోరు. ఆ రకంగా పొత్తుబంధం చెడిపోవడం బిజెపి కోరిక అయిఉంటుంది.
పవన్ కల్యాణ్ కు 30 సీట్లు కేటాయించడమే చంద్రబాబుకు తలకుమించిన భారం. ఎదుకంటే.. తెదేపా బలంతో కలిపి తాము ఖచ్చితంగా గెలిచేసీట్లను మాత్రమే పవన్ అడుగుతారు. అలాంటప్పుడు ఆయా నియోజకవర్గాల్లో తెలుగుదేశం ఆశావహులకు సర్ది చెప్పుకోవడం చిన్న సంగతి కాదు. అలా పొత్తులు కుదరకుండా మిగిలిపోవాలనే బిజెపి కోరుకుంటుంది. పవన్ కోరుకుంటున్న పొత్తుల విషయంలో నిర్ణయం తీసుకోకుండా.. తమ పార్టీ ప్రయోజనాలకు ఏది మేలవుతుందో తేల్చుకునే ప్రయత్నంలో భాజపా ఉంది.
మొత్తానికి ఇటు రాష్ట్రంలో గానీ, అటు కేంద్రంలో గానీ పోరు పాతదే! పేర్లే కొత్తగా పెట్టుకుంటున్నారు. పాతపేర్లతో ప్రజలను మళ్లీ మళ్లీ మభ్యపెట్టడం సాధ్యం కాదనే ఉద్దేశంతోనే పార్టీలన్నీ ఇలాంటి ఎత్తుగడలతో సాగుతున్నట్టుగా కనిపిస్తోంది.
..ఎల్ విజయలక్ష్మి