ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను రాజకీయంగా తమపై రుద్దాలనే ప్రయత్నాలపై వైసీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతానుభవాలను దృష్టిలో పెట్టుకుని వారిని భరించలేమని నిర్మొహమాటంగా చెబుతున్నారు. తాజాగా ఐఏఎస్ అధికారి విజయ్‌కుమార్ రాజకీయాలపై ఆసక్తి కనబరుస్తున్నారు. తిరుపతి జిల్లా తడ నుంచి తుని వరకూ ఆయన పాదయాత్ర చేసేందుకు ఆదివారం తొలి అడుగులు వేశారు.
పేదరికంపై గెలుపు సాధించడమే లక్ష్యంగా ఆయన ప్రకటించారు. తన పాదయాత్రకు విజయ పథం అనే పేరు పెట్టారు. తనది ఓ ఉద్యమమని ఆయన చెబుతున్నారు. పేదలకు విద్య, వైద్యం ఉచితంగా దొరకాలని, వారి జీవన విధానానికి ఉపాధి లేదా భూమి ఉండాలన్నారు. వీటి సాధనకు చట్టసభల్లో, అధికారంలో భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు. వాటి సాధనకు విజయపథం ఉద్యమం కెరటంలా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.
రాజకీయాల్లోకి వచ్చేందుకే విజయ్‌కుమార్ పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. నిన్నమొన్నటి వరకూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వంలో కీలకంగా పని చేసిన విజయ్‌కుమార్ రాజకీయ ఆకాంక్షలపై ఎవరికీ అనుమానాలు లేవు. పాదయాత్ర అనంతరం ఆయన వైసీపీలో చేరుతారనే ప్రచారం ఊపందుకుంది. తిరుపతి లేదా బాపట్ల లోక్‌సభ, గూడూరు అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది.
ఐఏఎస్ అధికారి రాజకీయ అవతారం ఎత్తడం, తమపై రుద్దుతారనే ప్రచారంతో తిరుపతి పార్లమెంట్ పరిధిలోని వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వరప్రసాద్‌రావు తిరుపతి ఎంపీగా మిగిల్చిన చేదు అనుభవాలను ఇంకా వైసీపీ నేతలు మరిచిపోలేకున్నారు. వైసీపీ ప్రజాప్రతినిధులందరిదీ ఒక దారైతే, తనొక్కడిదీ మరో దారి అన్నట్టు వరప్రసాద్ ప్రవర్తించేవారు. వైసీపీతో సంబంధం లేని నాయకులతో ఆయన అంటకాగే వారని చెబుతున్నారు.
దీంతో వరప్రసాద్‌రావుకు 2019లో ఎట్టి పరిస్థితుల్లో టికెట్ ఇవ్వొద్దని తిరుపతి లోక్‌సభ పరిధిలోని వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకులు జగన్‌కు మొరపెట్టుకున్నారు. దీంతో తిరుపతి పార్లమెంట్ నుంచి ఆయన్ను తప్పించి, గూడూరు నుంచి బరిలో దింపారు. అక్కడి నుంచి ఆయన గెలుపొందారు. వైసీపీకి కంచుకోట లాంటి గూడూరులో పార్టీ బలహీనపడడానికి వరప్రసాద్‌రావు మనస్తత్వమే కారణమని చెబుతున్నారు.
ఐఏఎస్, ఐపీఎస్, ఇతర ఉన్నతాధికారులు ప్రజలతో మమేకం కాలేరు. రాజకీయాల్లోకి వాళ్లు వస్తున్నప్పటికీ, ప్రజల వద్ద కూడా ఇంకా తాము బాస్‌లమే అన్నట్టుగా ప్రవర్తిస్తుంటారు. అందుకే రాజకీయాల్లో వారు చాలా త్వరగా వ్యతిరేకత తెచ్చుకుం టుంటారు. హిందూపురం వైసీపీ ఇన్‌చార్జ్‌గా ఐపీఎస్ అధికారి ఇక్బాల్‌ను జగన్ గత ఎన్నికల సందర్భంలో తీసుకొచ్చారు. ఇక్బాల్ ఎంత వివాదాస్పదయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఆయన్ను తప్పించాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది.
ఇక్బాల్ వైఖరితో హిందూపురం వైసీపీ ఒక నిబద్ధత గల నాయకుడిని పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఇక్బాల్ అభ్యర్థి అయితే తామే ఓడిస్తామని వైసీపీ నేతలు ప్రతినబూనారు. దీంతో అక్కడ కొత్త నాయకత్వాన్ని వైసీపీ తీసుకొచ్చింది. ఇప్పుడు విజయ్‌కుమార్‌ను వైసీపీ తెస్తోందనే ప్రచారంతో ఆ పార్టీ నేతలు ఉలిక్కిపడుతున్నారు. ఐఏఎస్, ఐపీఎస్‌లను తీసుకొచ్చి తమపై బలవంతంగా రుద్ధాలని చూస్తే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందనే హెచ్చరికలు ఆ పార్టీ నేతల నుంచి వస్తున్నాయి. విజయ్‌కుమార్‌ను సీఎం జగన్ ఏ విధంగా ఉపయోగించుకుంటారో చూడాలి.