ఇంకా ఏడుపే అయితే.. ఓటమికి సిద్ధపడుతున్నట్టే!

‘అధికారంలో ఉన్న పార్టీ అక్రమాలకు పాల్పడుతోంది..’ అని విపక్షాల అరిచి గీపెట్టడం చాలా సాధారణమైన విషయం. ఎన్నికలు ముంచుకువచ్చే తరుణంలో ఇలాంటి ఆరోపణలు చాలా చాలా ఉంటాయి. పదేపదే ఇలాంటి గోల చేయడం ద్వారా..…

‘అధికారంలో ఉన్న పార్టీ అక్రమాలకు పాల్పడుతోంది..’ అని విపక్షాల అరిచి గీపెట్టడం చాలా సాధారణమైన విషయం. ఎన్నికలు ముంచుకువచ్చే తరుణంలో ఇలాంటి ఆరోపణలు చాలా చాలా ఉంటాయి. పదేపదే ఇలాంటి గోల చేయడం ద్వారా.. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచవచ్చునని, ఎన్నికల సంఘం జోక్యం చేసుకునేలా, ప్రభుత్వాల చేతులు కట్టేసేలా చేయడం సాధ్యమవుతుందని విపక్షాలు వ్యూహరచన చేస్తుంటాయి. 

ఒక దశ వరకు ఇలాంటి కుయత్నాల ద్వారా వారు అనుకున్నది నెరవేర్చుకుంటారు కూడా. కానీ, ఇలాంటి చర్యల ద్వారా రాష్ట్రప్రభుత్వాల మీద నిఘాపెరిగిన తర్వాత కూడా, నియంత్రణ చర్యలు తీసుకున్న తర్వాత కూడా.. వారు అదే రకమైన ఆరోపణలతో చెలరేగుతూ ఉంటే గనుక.. అది వారిలోని భయానికి ప్రతీకగా అనుకోవాల్సిందే. ఓటమి భయాన్ని కప్పెట్టుకోవడానికి, ఓడిపోయినా సరే.. నిందను అక్రమాలమీదికి మళ్లించడానికి ముందే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నట్టుగా అనుకోవాల్సిందే. ఇప్పుడు ఏపీ రాజకీయాలలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి గమనిస్తే అలాగే అనిపిస్తోంది.

ఓటర్ల జాబితాలో విపరీతమైన అక్రమాలు జరిగిపోతున్నాయంటూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చం నాయుడు తొలి నుంచి గోల గోల చేస్తున్నారు. ఎన్నికల సంఘానికి గవర్నర్కు రకరకాల ఫిర్యాదులు అందించారు. వీటి పర్యవసా ఎన్నికల కేంద్ర ఎన్నికల సంఘం చొరవ తీసుకుంది. 

రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిని పిలిపించి.. డోర్ టు డోర్ సర్వే నిర్వహించడం ద్వారా ఓటర్ల జాబితా లోని అవకతవకలను సమగ్రంగా తనిఖీ చేయాలని ఆదేశించింది. ఈ తనిఖీని చాలా పకడ్బందీగా చేపట్టేలాగా నిబంధనలు రూపొందించారు. ఓటర్ల జాబితా తనిఖీకి వెళ్లే సమయంలో స్థానికంగా రాజకీయ పార్టీలకు నోటీసులు ఇవ్వాలని, వారి తరఫున పంపే ఏజెంట్లను కూడా వెంటబెట్టుకుని వెళ్లి వారి సమక్షంలోనే తనిఖీలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇలాంటి తనిఖీలు జరగడంలో ఎలాంటి పొరపాటు ఆస్కారం ఉండదనేది అందరూ నమ్ముతున్న సంగతి. ఇతనిఖీలు రాష్ట్రవ్యాప్తంగా చురుగ్గా జరుగుతున్నాయి.

ఒకవైపు ఓటర్ల జాబితా సంస్కరణలు జరుగుతున్నప్పటికీ కూడా.. తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు అచ్చం నాయుడు ఇంకా అదే ఆరోపణలు చేస్తున్నారు. తనిఖీల తర్వాత కూడా ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉంటున్నాయని ఆయన ఆరోపిస్తున్నారు. ఒకవేళ అదే నిజమైతే గనుక దానికి  పార్టీగా తెలుగుదేశం కూడా బాధ్యత వహించాలి. తనిఖీలకు ఏజెంట్లను పంపడం వారికి చేతకానప్పుడు, పంపిన ఏజెంట్లు లోపాయి కారీగా కుమ్మక్కు అయినప్పుడు మాత్రమే అలా జరిగే అవకాశం ఉంది.

ఇవేమీ కాకుండా ఉత్తినే అవకతవకలు జరుగుతున్నాయి, ఓటర్ల జాబితాలో దొంగఓట్లు నమోదు చేస్తున్నారు.. అంటూ అవే మాటలను పదేపదే అనడం ద్వారా తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టు అనుకోవాలి. ఇలాంటి మాటలను వీలైనంతవరకు ప్రజలను ప్రచారంలో పెడితే రేప్పొద్దున ఎన్నికల్లో ఓడిపోయిన తర్వా‘‘త ఇది మా ఓటమి కాదు.. ఓటర్ల జాబితా అక్రమాల వలన జరిగిన ఓటమి’’ అనే డాంబికపు మాయమాటలు చెప్పవచ్చు అనేది వారి కోరిక లాగా కనిపిస్తోంది.