సప్తగిరి మంచి కమెడియన్..తన దైన డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ తో జనాలను ఎంటర్ టైన్ చేయగల సత్తా వున్నావాడు. కానీ ఇటీవల అతను చేస్తున్న సినిమాలు, పాత్రలు మాత్రం చాలా డిస్సపాయింట్ గా వుంటున్నాయి. ఎందుకిలా..మరీ చారులో కరివేపాకులా కనిపిస్తున్నాడు సప్తగిరి..సినిమాకు బ్రహ్మానందం, ఎమ్ఎస్ నారాయణ, ఒకప్పటి సునీల్ మాదిరిగా ఫుల్ లెంగ్త్ కమెడియన్ గా ఎందుకు కనిపించడం లేదు. సరైన క్యారెక్టర్ డిజైన్ చేసి, సినిమా ఆద్యంతం కథతో పాటు ట్రావెల్ చేస్తే, సప్తగిరి చితక్కొట్టేస్తాడు. అందులో సందేహం లేదు.
కానీ మరి సినిమా జనం సప్తగిరిని గెస్ట్ కమెడియన్ గా సినిమా చివర్నో, మధ్యలోనో అలా తళుక్కున మెరిపిస్తున్నారు తప్ప, సరైన రోల్ ఎందుకు క్రియేట్ చేయడం లేదు? ఈ ప్రశ్నలకు టాలీవుడ్ లో మాత్రం చిత్రమైన సమాధానాలు వినిపిస్తున్నాయి. సప్తగిరి ఇప్పుడు డిమాండ్ లో వున్నాడు. రోజుకు లక్ష నుంచి లక్షన్నర మధ్య తీసుకుంటున్నారు. ఫుల్ లెంగ్త్ రోల్ అంటే సప్తగిరి కనీసం పాతిక ముఫై రోజులన్నా పనిచేయాలి. అంటే కేరవాన్, మేకప్ అసిస్టెంట్ ఖర్చులతో కలిసి యాభై లక్షల వరకు అయిపోతుంది.
చిన్న హీరోలకే అంత ఇస్తున్నారు. మరి కమెడియన్ పై అంత ఖర్చు చేస్తారా? అదే షకలక శంకర్, సత్య వంటిలాంటి వాళ్లు రోజుకు పదివేల రెమ్యూనిరేషన్ లో వస్తున్నారు. దాంతో అది తక్కువ తో అయిపోయే వ్యవహారంగా కనిపిస్తోంది. కానీ సినిమా అట్రాక్షన్ కోసం సప్తగిరి కావాలి. అందుకోసం ఒక రోజు, మహా అయితే రెండు రోజుల్లో అయిపోయే ట్రాక్ లు రాసి, సప్తగిరిని బుక్ చేసి ఫినిష్ చేస్తున్నారు.
సప్తగిరి వెర్షన్ మరోలా వుందని వినికిడి. పదేళ్లు ఇండస్ట్రీలో నానా అగచాట్లు పడి, అసిస్టెంట్ గా, స్క్రిప్ట్ అసిస్టెంట్ గా రకరకాల పనులు చేసి, ఇప్పుడు ఈ స్టేజ్ కు వచ్చాడు. ఇప్పడున్నా నాలుగు రూపాయిలు సంపాదించకుంటే, భవిష్యత్ ఎలా వుంటుందో?
అయితే సప్తగిరి చెప్పేది కరెక్టే కావచ్చు కానీ, మంచి ఫుల్ లెంగ్త్ రోల్ తెస్తే రోజుల లెక్క కాకుండా రెమ్యూనిరేషన్ పద్దతినో, లేదా కాస్త తక్కువకో చేస్తానని చెప్పచ్చు కదా. దాని వల్ల ఇండస్ట్రీలో కలకాల నిల్చునే అవకాశం కలుగుతుంది. ఒకసారి డిమాండ్ పీక్ కు వెళ్లాక, ఖర్చు ఎక్కువైనా ఫుల్ లెంగ్త్ రోల్ ఆఫర్ చేస్తారు. బ్రహ్మానందాన్ని అలాగే భరించారు కదా.
ఏమైనా సప్తగిరి తన కెరీర్ గురించి కాస్త ఆలోచించాలన్నది అభిమానుల మాట.