అక్కడే రాజధాని…!

స్పష్టత ఇచ్చిన బాబు సర్కార్ కర్నూలుకు రెండవ రాజధాని హోదా విజయవాడపై కేబినెట్‌లోనే భిన్న స్వరాలు మరో చీలిక రాకుండా చూడాలంటున్న మేధావులు Advertisement ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సరిగ్గా రెండున్నర నెలల క్రితం అధికారికంగా…

స్పష్టత ఇచ్చిన బాబు సర్కార్
కర్నూలుకు రెండవ రాజధాని హోదా
విజయవాడపై కేబినెట్‌లోనే భిన్న స్వరాలు
మరో చీలిక రాకుండా చూడాలంటున్న మేధావులు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సరిగ్గా రెండున్నర నెలల క్రితం అధికారికంగా ముక్కలైంది. తెలంగాణా సంగతేమో కానీ, ఆంధ్రప్రదేశ్‌కు నాటి నుంచి కష్టాలు మొదయ్యాయి. సాధారణంగా సమస్యలు ఎపుడూ కష్టకాలంలోనే కనిపిస్తాయి. ఇపుడు అదే జరుగుతోంది. పదమూడు జిల్లాలతో విడిపోయిన పూర్వపు ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని ప్రధాన సమస్యగా మారింది. ఎక్కడ రాజధాని నిర్మించాలన్న దానిపై బాబు కేబినెట్‌లోనే విభిన్నమైన వాదనలు ఉన్నాయి. దక్షిణ కోస్తా వాసులు విజయవాడగుంటూరుల మధ్యలో రాజధాని ఏర్పాటుకు సుముఖంగా ఉండగా, రాయలసీమ వాసులు మాత్రం లోలోపల రగులుతున్నారు. తాజాగా బాబు కేబినెట్‌లో ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న రెవిన్యూ మంత్రి కెఇ కృష్ణమూర్తి విజయవాడ రాజధాని ఏంటని అసహనం వ్యక్తం చేయడం గమనార్హం. చాలా ఇరుకు నగరంగా కూడా ఆయన అభివర్ణించారు. పైగా, సాటి మంత్రి నారాయణ మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని కూడా తేల్చేశారు. ఈ పరిణామం బాబు మంత్రివర్గంలో విభేదాలకు అద్దం పడుతూండగా, బాబు మాత్రం విజయవాడగుంటూరులపైనే దృష్టి సారించడం విశేషం. మరోవైపు కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటి నివేదిక ఈ నెలాఖరులో రావాల్సిఉంది. దానికంటే ముందుగానే విజయవాడను తాత్కాలిక రాజధానిగా బాబు సర్కార్ ప్రకటించడం తొందరపాటుతనంగా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇదంతా ముందస్తు ప్రణాళికలో భాగంగానే జరుగుతోందన్న మాట కూడా వినిపిస్తోంది. మొత్తం మీద కొత్త రాజధాని విషయంలో పేచీలు పెరగకముందే సామరస్యంగా సర్కార్ పరిష్కారం చూపాలన్న సలహా మేధావుల నుంచి వస్తోంది. లేకపోతే ఇపుడున్న ఆంధ్రప్రదేశ్‌లో మరో చీలిక సంభవించి తెలుగు జాతి గుండెలలో మరో వేరు కుంపటి అగ్గి రాజేసినా ఆశ్చర్యం లేదన్నది వారి భావనగా ఉంది.

తాత్కాలిక రాజధానిగా విజయవాడ…

బాబు సర్కార్ విజయవాడను తాత్కాలిక రాజధానిగా ప్రకటించింది. అక్కడకు వీలైనంత తొందరగా మూటా ముల్లె సర్దుకుని పోవాలని కూడా ఆత్రపడుతోంది. సాక్షాత్తూ ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సైతం వచ్చే అసెంబ్లీ సమావేశాలు ఇక్కడ (హైదరాబాద్)లో జరగవని సూచనాప్రాయంగా విజయవాడ గురించి చెప్పేశారు. ఇక, బాబుకు తలలో నాలుకగా ఉన్న కొత్త మంత్రి నారాయణ అయితే సమయం దొరికితే చాలు విజయవాడగుంటూరు అంటూ రాజధాని పాట పాడుతున్నారు. బాబు కూడా సీఎం అయిన కొత్తలోనే ఉద్యోగుల సమావేశంలో మాట్లాడుతూ విజయవాడకు తొందరలోనే అంతా తరలిరావాల్సిఉంటుందని చెప్పడం కూడా ఆయన మదిలో ఏముందన్నది తేటతెల్లం చేస్తోంది.  మిగిలిన మంత్రులు కూడా మరో రెండు, మూడేళ్ల వ్యవధిలో మొత్తం ఏపీ పాలన విజయవాడ కేంద్రంగా సాగుతుందని తరచూ చెబుతున్నారు. విజయవాడ కేంద్రంగా రాజకీయ కార్యకలాపాలు కూడా ముమ్మరం అవుతున్నాయి.  ఏపీ కాంగ్రెస్ పార్టీ తన కేంద్ర కార్యాలయాన్ని విజయవాడలోనే ఏర్పాటుచేసుకుని ఇటీవల స్వాతంత్య్ర వేడుకలను కూడా నిర్వహించుకుంది. సీపీఐ, సీపీఎం, బీజేపీ సైతం అక్కడే తమ నెలవులను చూసుకుంటున్నాయి. టీడీపీ కేంద్ర కార్యాలయం బాధ్యతను విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నానికి అప్పగించారు. ఇక, ప్రభుత్వ పరంగా సీఎం నివాసం, ప్రధాన కార్యాలయాలకు స్ధలాల వంటివి పర్యవేక్షించే బాధ్యతను భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్వీకరించారు. మొత్తం మీద చూసుకుంటే విజయవాడ కానీ, దాని సమీపంలో కానీ కొత్త రాజధాని ఏర్పాటు ఖాయమన్నది బాబు సర్కార్ చేతల ద్వారా స్పష్టంగానే చెబుతోంది.

శివరాజన్ కమిటీ నివేదిక సంగతేంటి…!

ఆరు నెలల గడువుతో గత యూపీఏ సర్కార్ నియమించిన శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఈ నెలాఖరులో రానుంది. ఆ నివేదిక ఏం చెబుతుందన్నది ఇపుడు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. నిజానికి అధికారుల స్ధాయిలో నియమించే ఏ కమిటీ నివేదిక అయినా అటు కేంద్రానికీ, ఇటు రాష్ట్ర సర్కార్‌కు అనుకూలంగానే 
ఉంటాయన్నది వాస్తవం. ఏలికల మనసెరిగి వారు ప్రవర్తిస్తారన్నది కూడా నిజం. పైగా, ఇపుడు ఉన్న ఎన్‌డిఏ సర్కార్‌లో ఏపీ నుంచి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కీలకంగా ఉన్నారు, ఆయన సీఎం చంద్రబాబుకు మంచి దోస్త్. వారిద్దరూ ఏం అనుకుంటే అదే నివేదికలో ఉంటుందన్నది కూడా జనం మాటగా ఉంది. అయితే, వెంకయ్యనాయుడు ప్రకాశం జిల్లా వైపు కాసింత మొగ్గు చూపుతున్నారని వినిపిస్తున్నా ఆయన సైతం దానిని కొట్టివేస్తూ రాజధాని ఎక్కడ అన్నది బాబు సర్కార్ ఇష్టమని తేల్చేశారు. దాంతో, బాబు ఏం అనుకుంటే అదే రాజధాని అవుతుంది, ఆయన చేతలు, చర్యలకు అనుగుణంగానే నివేదిక కూడా ఉంటుందని స్పష్టమవుతోంది. ఇంకోవైపు కడపలో పర్యటించిన సందర్బంగా శివరామకృష్ణన్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, రాయలసీమ బాగా వెనుకబడి ఉందని, కర్నూలు పూర్వ రాజధానిగా ఉన్నందున దానిని రెండవ రాజధానిగా ప్రతిపాదించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆ విధంగా చూస్తే విజయవాడగుంటూరు మధ్యలో కొత్త రాజధాని ఏర్పాటును ప్రతిపాదిస్తూ, కర్నూలుకు రెండవ రాజధాని హోదా ఇచ్చేలా నివేదిక ఉంటుందని తెలిసిపోతోంది. ే బాబు తాత్కాలిక రాజధాని పేరుతో బాగానే నివేదికను ప్రభావితం చేశారన్న విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఈ నెలాఖరుకు ఈ నివేదిక కేంద్రం చేతులలోకి వెళ్తుంది. అపుడే అసలు కథ మొదలవుతుంది. 

కెఈ వ్యాఖ్యలు దేనికి సంకేతం…!

ఉప ముఖ్యమంత్రి హోదాలో కహోఇ కృష్ణమూర్తి చేసిన వ్యాఖ్యలకు విలువ ఇవ్వకుండా ఉండలేం. ఆయన కర్నూలు జిల్లాకు చెందినవారు. ప్రస్తుతం అక్కడ రాజధాని కోసం ఉద్యమం సాగుతోంది. ఇటీవలే సీఎం చంద్రబాబు స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలను అక్కడ ఘనంగా నిర్వహించారు. సహజంగానే ఒకప్పటి రాజధాని కాబట్టి వారంతా మళ్లీ అక్కడే కావాలని కోరుకోవడంలో తప్పులేదు. ఇపుడు దానికి నైతిక బలాన్ని ఇస్తూ బాబు తరువాత సీనియర్‌గా ఉన్న కెఇ కృష్ణమూర్తి చేసిన వ్యాఖ్యలు సర్కార్‌లో భిన్న స్వరాలు ఉన్నాయని చెప్పకనే చెబుతున్నాయి. బాబు ఆయన వందిమాగదులు విజయవాడ పేరును పదే పదే ప్రస్తావించడం, ఇంకోవైపు కర్నూలులో ఆందోళనలు సాగడంతో ఆ జిల్లాకు చెందిన మంత్రిగా కేఇ ఘాటుగానే స్పందించాల్సిన స్థితి. అయితే, ఆయన మరింత ముందుకు వెళ్తూ విజయవాడ ఏ రకంగానూ రాజధానికి తగిన విధంగా లేదని చెప్పడం విశేషం. ఇరుకు నగరంలో రాజధాని ఏంటని కెఇ ప్రశ్నించారు. అంతటితో ఆగకుండా అక్కడ ఉన్న ప్రభుత్వ భూములు ఏ పాటని లెక్క కూడా రెవిన్యూ మంత్రిగా జనాల ముందు ఉంచారు. కేవలం 500 ఎకరాలు మాత్రమే విజయవాడగుంటూరుల మధ్యన ప్రభుత్వ భూమి ఉందని చెప్పారు. అదే సమయంలో పదమూడు జిల్లాలలో సర్కారీ భూముల లభ్యతను కూడా ఆయన వివరించారు. ఆయన లెక్కల బట్టి చూస్తే కర్నూలులో వేలాది ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది, పైగా, నీటి లభ్యత కూడా తుంగభద్ర నదీ ద్వారా అందుతుందని, జాతీయ రహదారులు, ఇతర నగరాలకు అనుసంధానం చేయడం ద్వారా చక్కని రాజధాని అవుతుందన్న భావనను కలిగించారు. రాజధాని అందరికీ అందుబాటులో ఉండలనడం కొసమెరుపు.

ఉత్తరాంధ్ర మౌనరాగం…

ఇంకోవైపు ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు మౌనరాగాన్ని ఆలపిస్తున్నారు. ఉత్తరాంధ్రకు ముఖద్వారంగా ఉన్న విశాఖ నుంచి గెలిచిన వారంతా ఇతర జిల్లాల వారే కావడంతో వారు నోరు మెదపడంలేదన్న విమర్శలు ఉన్నాయి. విజయనగరం, శ్రీకాకుళంలో బాబు నిర్ణయాన్ని ఎదిరించేటంతటి నాయకులు లేరు. దివంగత మాజీ కేంద్ర మంత్రి కింజరపు ఎర్రంనాయుడు ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో కానీ, ఇపుడు రాజధాని కాదు కదా, ఏ డిమాండు కూడా మంత్రులు చేయకుండా మిన్నకుంటున్నారు. ఇది ప్రజలలో అసహనానికి దారి తీసినా వారు మాత్రం స్పందించడంలేదు. ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్రతిపత్తిని విభజన బిల్లులో పేర్కొన్నా కూడా ఆ విషయాన్ని కూడా పట్టించుకునే వారు లేరు. ఇక,  ప్రధానమైన రైల్వేజోన్, కేంద్ర విద్యా సంస్ధలు, ఐటీ హబ్, ఎయిమ్స్ వంటి వాటి విషయంలోనూ మంత్రులు మౌనాన్నే ఆశ్రయిస్తున్నారు.

అన్ని పార్టీలను కలుపుకునిపోవాలి…

రాజధాని ఏర్పాటు అన్నది ఏ పార్టీ తనకు తానుగా సొంతంగా నిర్ణయించే వ్యవహారం కాదు. ఈనాడు అధికారంలో ఉన్న వారు రేపు ఉండరు, కానీ, తెలుగు జాతికి కలకాలం ఓ రాజధాని ఉండాలి. అందువల్ల ఇపుడున్న రాజకీయ పార్టీల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుని ముందుకు సాగాలన్నది డిమాండుగా ఉంది. ఈ విషయంలో ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి ఈసరికే బాబుకు సూచన చేశారు. అలాగే, మాజీ పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, వామపక్షాల నేతలు కూడా తొందరపాటు కూడదని సలహా ఇచ్చారు. శివరామకృష్ణన్ నివేదిక వచ్చేంతవరకూ ఓపికతో వ్యవహరించి ఆ మీదట అఖిలపక్ష భేటీ నిర్వహించాలని, అన్ని ప్రాంతాల రాజకీయ ప్రతినిధుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడమే కాకుండా, వందేళ్ల దీర్ఘకాలిక ప్రణాళికతో కొత్త రాజధాని ఎంపిక ఉండేలా చూడాలని సూచనలు అందుతున్నాయి. ఇదే తీరున మేధావులు కూడా బాబుకు సలహాలు ఇస్తున్నారు. రాజధాని దక్షిణ కోస్తాలోనా, సీమలోనా అన్నది తేలడం అంత సులభం కాదు, ఎందుచేతనంటే ఇక్కడ రాజకీయ పార్టీలతో పాటు, ప్రాంతీయ భేదాలు, సామాజికపరమైన విభేదాలు కూడా హెచ్చుగానే ఉన్నాయి. సీఎంగా చంద్రబాబు సీమ జిల్లాకు చెందినవారైనప్పటికీ, ఆయన బలమంతా కోస్తాలోనే ఉండడంతో అటు మొగ్గుతున్నారన్న భావన ఉంది. మరోవైపు వైసీపీ అధినేత జగన్ బలం సీమలో ఉంది. అందువల్ల ఇది అంత సులువుగా పరిష్కారం కాదు, కానీ, అంతా కలసి ఆలోచన చేస్తే మంచి పరిష్కారమే లభిస్తుందని అంటున్నారు. 

పివిఎస్‌ఎస్ ప్రసాద్,
విశాఖపట్నం..