‘నెత్తిన బొట్టు పెట్టి, మీసం మెలేసి.. చేతిలో కత్తి పట్టుకుని.. ఆ టైపులో వుండదు…’ అంటున్నాడు తన తండ్రి చిరంజీవి హీరోగా రాబోయే 150 సినిమా గురించి ఆయన తనయుడు రామ్చరణ్. చిరంజీవి పుట్టినరోజు వేడుకల సందర్భంగా హైద్రాబాద్లోని చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ బ్లడ్ అండ్ ఐ బ్యాంక్లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన చరణ్, ఓ మంచి సినిమా చేయాలని చిరంజీవి అనుకుంటున్నారనీ, అభిమానుల్ని అలరించేలా ఆ సినిమా వుంటుందని చెప్పాడు.
అయితే మీసం మెలేయడం గురించీ, కత్తి పట్టడం గురించీ చరణ్ అలా ఎందుకు అన్నాడబ్బా.? అన్న అనుమానం కలుగుతోంది అందరికీ. ఇటీవలి కాలంలో చరణ్ చేస్తోన్న చాలా సినిమాల్లో మీసం మెలేయలేదుగానీ.. కత్తి పట్టి తెగనరికేసిన సన్నివేశాలకైతే కొదవే లేదు. దాదాపుగా యంగ్ హీరోలు, సీనియర్ హీరోలు అలాంటి సినిమాలే చేశారు, చేస్తూనే వున్నారు. చిరంజీవి కూడా ‘ఇంద్ర’ సినిమాలో మీసం మెలేశాడులెండి.
మంచి సినిమా.. అంటే బీభత్సాలు లేని సినిమా అనేది చరణ్ ఉద్దేశ్యం కావొచ్చుగాక. కానీ, ఎవర్నో ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చరణ్ చేశాడేమోనన్న అనుమానాలకు తావిచ్చినట్లయ్యిందిప్పుడు. సినీ జనం ఏం మాట్లాడినా అంతే.. ఏదో ఒకరకంగా వివాదమవుతుంటుంది. అన్నట్టు, తన తండ్రి నటించే 150వ సినిమాకి చరణ్ నిర్మాత అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.