రెండు రోజుల క్రితం ఏబీఎన్‌లో ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డిపై దాడిని ఆ పార్టీ శ్రేణులు జీర్ణించు కోలేకున్నాయి. పక్కా ప్లాన్ ప్రకారమే దాడి చేయించారనే ప్రచారం విస్తృతంగా జరుగుతున్న నేపథ్యంలో…తాజాగా ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును ఆంధ్రజ్యోతి టార్గెట్ చేయడం గమనార్హం. ఏపీలో బీజేపీని బద్నాం చేయడానికి ఓ పథకం ప్రకారం టీడీపీ ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని కుట్ర పన్నుతోందని బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు జగన్ ప్రభుత్వమే కారణమని ఇంతకాలం కథనాలు వండివార్చిన ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ అకస్మాత్తుగా ఏపీ బీజేపీతో పాటు ఆ పార్టీ అధ్యక్షుడిని టార్గెట్ చేయడం వెనుక కారణాలేంటో అందరికీ తెలిసినవే. ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్‌రెడ్డిపై రెండురోజుల క్రితం ఏబీఎన్ చానల్‌లో అమరావతి జేఏసీ నేత శ్రీనివాసరావు దాడి చేశాడు. అతన్ని శాశ్వతంగా ఏబీఎన్ చానల్ బహిష్కరిస్తున్నట్టుగా ప్రకటించారు. మరోవైపు దాడికి పాల్పడ్డ శ్రీనివాసరావుపై ఏబీఎన్ యాజమాన్యమే కేసు పెట్టాలని సోము వీర్రాజు కోరారు.
ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ డిమాండ్‌ను ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో పాటు చివరికి తాను చెప్పిన బహిష్కరణపై కనీసం ఒక్కరోజు కూడా నిలబడకపోవడం విమర్శలకు తావిచ్చింది. శ్రీనివాసరావుతో ఏబీఎన్ చానల్‌లో లైవ్ డిబేట్ పెట్టడం బీజేపీ ఆగ్రహానికి గురైంది. దీంతో ఇక మీదట ఏబీఎన్ చానల్‌కు వెళ్లేది లేదని బీజేపీ బహిష్కరణ నిర్ణయాన్ని ప్రకటించింది. బీజేపీ నిర్ణయాన్ని జీర్ణించుకోలేని ఆంధ్రజ్యోతి …సోము వీర్రాజుపై అక్షర దాడికి తెగబడింది. దీనికి చాలా తెలివిగా విశాఖ ఉక్కు అంశాన్ని వాడుకుంది.
నిజంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు కారణమైన కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయకుండా, ఏపీ బీజేపీ అధ్యక్షుడిని టార్గెట్ చేయడం కేవలం వ్యక్తిగత విద్వేషమే కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఏపీ బీజేపీ, దాని మిత్రపక్షం జనసేన కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఇది ఆంధ్రుల సెంటిమెంట్‌కు సంబంధించిన అంశమని, మరోసారి ఆలోచించాలని ఢిల్లీ పెద్దలకు ఏపీ బీజేపీ నేతలు మొర పెట్టుకున్నారు. అయినా కేంద్రం ఏ మాత్రం పట్టించుకోలేదు.
ఈ నేపథ్యంలో సోము వీర్రాజును టార్గెట్ చేసి, ఆయనపై వ్యతిరేక కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రచురించడం చర్చనీయాంశమైంది. ‘ఇప్పుడేమంటారు …వీర్రాజా?’ శీర్షికతో బాటమ్ బ్యానర్ కథనాన్ని ప్రచురించారు. ‘చిన్న ట్వీట్‌కే అంత రాద్ధాంతమా? విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ పెద్దలు చెప్పారా? పోనీ ఏదైనా అధికారిక ప్రకటన వచ్చిందా?’ అంటూ సోము వీర్రాజు ఉక్కు ఉద్యమకారులపై ఇలా చిందులు తొక్కారంటూ రాసుకొచ్చారు.
నిజమే, సోము వీర్రాజు దూకుడు మాటలు ఆ పార్టీకి నష్టం తెచ్చాయి. కానీ రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కేంద్రం, బీజేపీ తీరుపై అన్ని సందర్భాల్లో ఇట్లే కథనాలు రాసి ఉంటే, ఇప్పుడీ అంశం చర్చకు వచ్చేదే కాదు. తమకు ప్రేమ కలిగినప్పుడు నెత్తికెత్తుకోవడం, కోపం వచ్చినప్పుడు నేలకేసి కొట్టడం వల్లే చిక్కంతా.
‘ప్రధాని మోదీకి మూడు ప్రతిపాదనలు సమర్పించేందుకు సోము ప్రయత్నించారు. కానీ మూడు రోజులు వేచి చూసినా ప్రధాని అపాయింట్‌మెంట్ లభించలేదు. చివరికి కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మూడంటే మూడు నిమిషాలు అవకాశమిచ్చారు. ఆయనకు సమస్య వివరించేందుకు ప్రయత్నించగా.. ‘అవన్నీ ఎంపీలు చూసుకుంటారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరుగు తుంటే ఇక్కడికెందుకు వచ్చారు?’ అని షా అడగడంతో సోము వీర్రాజు షాకయ్యారు.
మరోవైపు… ‘పార్టీకి సంబంధించిన విషయాలపైనే నాతో మాట్లాడండి. ఇతర అంశాలతై సంబంధిత మంత్రులతోనే మాట్లాడుకోండి’ అని బీజేపీ అధ్యక్షుడు నడ్డా సూటిగా తేల్చిచెప్పారు. దీంతో… సోము వీర్రాజు బృందం ఢిల్లీకి వెళ్లి… ఉత్తిచేతులతో తిరిగి వచ్చింది’…ఇలా వీర్రాజుపై అక్షర దాడికి ఆంధ్రజ్యోతి తెగబడింది.
ఈ కథనం మొత్తం సారాంశం ఏంటంటే …సోము వీర్రాజు అనే బీజేపీ అధ్యక్షుడు ఎందుకూ పనికి రారని, ఆయనకు ఢిల్లీలో అంత సీన్ లేదని ఏపీ సమాజానికి చెప్పడం ఆంధ్రజ్యోతి ఉద్దేశం. తమ చానల్‌ను బహిష్కరించినందుకు ఆంధ్రజ్యోతి అక్కసునంతా ఈ కథనంలో తీర్చుకుంది. సోషల్ మీడియాలో ఏపీ బీజేపీని చెడుగుడు ఆడుకుంటున్నారని రాయడం గమనార్హం.
అమరావతి, ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్‌తో మొదలుకుని ఇప్పుడు విశాఖ ఉక్కుపైనా ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని నెటిజన్లు మండిపడుతున్నారని రాసుకొచ్చారు. ఇందులో అబద్ధాలున్నాయని ఎవరూ అనుకోలేదు. కానీ తమ చానల్‌పై బహిష్కరణ వేటు వేసిన ఏపీ బీజేపీపై మండిపడుతున్న ఆంధ్రజ్యోతి, కేంద్రంపై ఒక్క మాట కూడా రాయకపోవడం గమనార్హం.
మొన్న విష్ణువర్ధన్‌రెడ్డిపై దాడితో ఆనందించిన వాళ్లకు, ఇప్పుడు సోము వీర్రాజుపై వ్యతిరేక కథనాన్ని రాసి, మరింత సంతోషాన్ని పంచినట్టైంది. కారణాలేవైనా ఏపీలో డ్రామాలాడుతున్న బీజేపీకి తగిన శాస్తి జరగాల్సిందే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇవే కదా ఆర్కే మార్క్ రాతలంటే.