తెలంగాణలో బీజేపీ పాగా..

తెలంగాణలో బీజేపీ పాగా వేయాలని నిర్ణయించుకుంది. బీజేపీ నూతనాధ్యక్షుడు అమిత్‌షా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే హైదరాబాద్‌ రావడం ఇందుకు నిదర్శనం. అంతకు ముందే ఆయన పలుసార్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని ఢిల్లీ…

తెలంగాణలో బీజేపీ పాగా వేయాలని నిర్ణయించుకుంది. బీజేపీ నూతనాధ్యక్షుడు అమిత్‌షా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే హైదరాబాద్‌ రావడం ఇందుకు నిదర్శనం. అంతకు ముందే ఆయన పలుసార్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని ఢిల్లీ పిలిపించారు. రహస్యమంతనాలు జరిపారు. తెలంగాణలో బీజేపీ రాజకీయంగా ఎంతో పుంజుకునే అవకాశం ఉన్నదని, కాంగ్రెస్‌ బలహీనంగా ఉన్న తరుణంలోనే పార్టీని బలోపేతం చేయాలని కిషన్‌రెడ్డి చేసిన సూచన అమిత్‌షాకు నచ్చింది. దీనితో ఆయన తెలంగాణలో బీజేపీ బలంగా ఉన్న ప్రాంతాలు, బలపడగలిగిన ప్రాంతాలు, బలహీనంగా ఉన్న ప్రాంతాలను గుర్తించారు. ఒక్కో ప్రాంతానికి ఒక్కో వ్యూహాన్ని అమలు పరచాలని ఆయన నిర్ణయించుకున్నారు. ప్రతి బూతు స్థాయిలో బీజేపీ కమిటీలు వేయాలని ఆయన పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ఎవరెవరు పార్టీలో చేరితే పార్టీ బలోపేతం అవుతుందో చెప్పాలని ఆయన తెలంగాణ బీజేపీ నేతలను కోరారు.

ఈ మొత్తం వ్యూహరచనలో అమిత్‌షా బీజేపీ సీనియర్‌ నేత, పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడును సంప్రదించలేదు. అసలు ఇటీవలి కాలంలో పార్టీలో ఏం జరుగుతున్నది వెంకయ్యకు తెలియదు. బీజేపీ జాతీయ మండలి సమావేశాల్లో అమిత్‌షా బాధ్యతలు చేపట్టినప్పుడు కూడా ఆయన వెంకయ్యనాయడుతో మాట్లాడించలేదు. పైగా బీజేపీ సీనియర్‌ నేత దత్తాత్రేయను వేదికపై ఆసీనులు చేశారు. పార్టీలో దత్తాత్రేయకు ప్రాధాన్యతనిస్తున్న విషయం దీనితో వెంకయ్యకు అర్థమైంది. నిజానికి వెంకయ్య అటు తెలంగాణలోనూ, ఇటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎవర్నీ ఎదగనీయరని, ఆయన వ్యక్తిగత ఇష్టాయిష్టాల ప్రకారమే నేతలను ప్రోత్సహిస్తారని అమిత్‌షాకు సమాచారం అందింది. దత్తాత్రేయ సీనియర్‌ నాయకుడైనప్పటికీ ఆయనకు కేబినెట్‌లో పదవి దక్కనీయకుండా వెంకయ్య అడ్డుపడ్డారని, గతంలో నరేంద్ర విషయంలో కూడా ఆయన అలాగే చేశారని అమిత్‌షాకు ఫిర్యాదులు అందాయి. దీనితో షా వెంకయ్యను తన వ్యూహరచన నుంచి దూరం చేశారు. తాజాగా పార్టీ ఉపాధ్యక్షుడుగా దత్తాత్రేయను నియమించడం వెంకయ్యకు మింగుడుపడలేదు పైగా తెలంగాణ నుంచి మురళీధర్‌ రావును, ఆంధ్ర నుంచి రాం మాధవన్‌ను ప్రధాన కార్యదర్శులుగా నియమించడంతో పార్టీలో వెంకయ్యకు పట్టు లేకుండా పోయింది. తాను పార్టీలో చేరతానని ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్‌ చాలా రోజులుగా వెంకయ్యను కోరుతున్నప్పటికీ ఆయన పట్టించుకోలేదు. దీనితో దిలీప్‌ నేరుగా రాంమాధవ్‌ను కలుసుకున్నారు. అంతే అమిత్‌షా పర్యటన సందర్భంగా దిలీప్‌ బీజేపీలో చేరేందుకు రాంమాధవ్‌ ఏర్పాట్లు చేశారు. వెంకయ్య అడ్డుకున్న చాలా మందికి అమిత్‌షా ఇలా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం గమనార్హం.

విచిత్రమేమంటే పార్టీ అధ్యక్షుడైన తర్వాత తెలంగాణలో అడుగుపెట్టిన అమిత్‌షా తన సమావేశాలకు వెంకయ్యనాయుడును ఆహ్వానించలేదు. అమిత్‌షా ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో వెంకయ్య పాల్గొనలేదు. నిజానికి వెంకయ్య గత ఎన్నికల్లో తనకు సంబంధం లేదంటూనే తెలుగుదేశంతో పొత్తు కుదిర్చారు. దీనివల్ల బీజేపీ స్వతంత్ర అస్తిత్వం కోల్పోయింది. కాని అమిత్‌షా వ్యూహరచనలో వెంకయ్య పాత్ర లేదు. వెంయ్యను కర్ణాటక నుంచి ఎన్నికైన రాజ్యసభ సభ్యుడుగానే భావిస్తున్నారు కాని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాజకీయాల్లో ఆయన పెత్తనం లేకుండా చేయాలన్నదే అమిత్‌షా అభిప్రాయం. అందుకే దత్తాత్రేయ. కిషన్‌రెడ్డి, మురళీధర్‌ రావు లాంటి వారికే ఆయన ప్రాధాన్యతనిస్తున్నారు.

ఇక ఆంధ్రప్రదేశ్‌ విషయంలో కూడా అమిత్‌షా స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌తో అమిత్‌షా మంతనాలు జరపడానికి కీలక ప్రాధన్యత ఏర్పడింది. రానున్న రోజుల్లో బీజేపీ సీమాంధ్ర నేతల్లో పవన్‌ కల్యాణ్‌కే అధిక ప్రాధన్యత లభించనున్నది. పవన్‌ కల్యాణ్‌ అమిత్‌షాను కలుసుకోవడం వెనుక కూడా వెంకయ్య పాత్ర లేనేలేదు. షా నేరుగా పవన్‌కు ఫోన్‌ చేశారని తెలుస్తోంది. నిజానికి హరిబాబు వంటి సీమాంధ్ర నేతలకు కూడా వెంకయ్య అంటే ఇష్టం లేదు. ఆంధ్రప్రదేశ్‌ కోటాలో వెంకయ్య కేంద్రమంత్రి పదవి కొట్టేయడంతోనే హరిబాబుకు మంత్రివర్గంలో ఛాన్స్‌ రాలేదు. నిజానికి విశాఖ నుంచి తాను పోటీ చేయకుండా పురంధేశ్వరిని లేదా కేఎస్‌ రావును పోటీ చేయించాలని వెంకయ్య, జవదేకర్‌ ప్రయత్నించిన విషయం తెలిసిన హరిబాబు వెంకయ్యపై గుర్రుగా ఉన్నారు. తాజాగా కూడా పురంధేశ్వరిని కేంద్రంలో కేబినెట్‌ హోదాలో మహిళాకమిషన్‌ చైర్మన్‌ పదవిలో చేర్పించేందుకు వెంకయ్య చేస్తున్న ప్రయత్నాల పట్ల కూడా హరిబాబు ప్రభృతులకు ఆగ్రహం కలుగుతున్నది. అయితే మోడీ ఈ విషయంలో వెంకయ్య మాట వినే అవకాశం లేదని వారికి తెలుసు.

వెంకయ్యను అమిత్‌షా దూరం పెట్టడానికి ప్రధాన కారణం రెండు రాష్ట్రాల్లో తెలుగుదేశంతో ప్రమేయం లేకుండా బీజేపీ ఎదగాలని ఆయన భావించడమే. వెంకయ్యకు పార్టీని అప్పజెబితే ఒక వర్గం ప్రాబల్యమే పెరిగి బీసీలు, ఎస్‌పీలు, ఇతర వర్గాలు దూరం అవుతారని ఆయనకు తెలుసు. అందుకే వెంకయ్యను కేంద్ర కేబినెట్‌ పదవికే పరిమితం కావాలని, ఇతర విషయాల్లో జోక్యం చేసుకోకూడదని పార్టీ ఆదేశించింది. దీనితో వెంకయ్య రెండు ప్రాంతాల్లో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం తగ్గించి, తన వర్గం వారు ఏర్పాటు చేసే సభల్లోనే పాల్గొంటున్నారు.

అమిత్‌షా తెలంగాణలో పర్యటన, ఆయన చేసిన ప్రసంగాలు, ఆయన కలిసిన నేతలను బట్టే బీజేపీ తెలంగాణలో స్వతంత్రంగా బలోపితం కావాలని నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది. ఇకనుంచి ప్రతి ఎన్నికల్లోనూ గెలవాలని అమిత్‌షా పార్టీ బాధ్యతలు చేపట్టిన మరునాడే నేతలకు చెప్పారు. అందుకే ఆయన జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై కేంద్రీకరించారు. జీహెచ్‌ఎంసీలని సీమాంధ్ర ప్రాంతాల్లో ఆయన చంద్రబాబు కన్నా పవన్‌ కల్యాణ్‌పై ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ పట్టు సాధిస్తే తెలంగాణలో క్రమంగా విస్తరించవచ్చునని అమిత్‌షా భావిస్తున్నారు. 2019 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ విజయమే లక్ష్యం కావాలని ఆయన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ ప్రసంగంలో ఎక్కడా ఆయన తెలుగుదేశం ప్రస్తావన తీసుకురాలేదు. హైదరాబాద్‌ను విముక్తం చేసింది గుజరాత్‌కు చెందిన నాయకుడు సర్దార్‌ పటేల్‌ అన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు పటేల్‌ లాంటి మరో నేత నరేంద్రమోడీ రంగంలోకి దిగిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని బీజేపీ గ్రామగ్రామాల్లో జరుపుకోవాలని ఆయన సూచించడం వెనుక ఉద్దేశం ఇదే. అమిత్‌ షా లక్ష్యం నెరవేరుతుందా? చూడాలి.

-హరీశ్‌