ఎమ్బీయస్‌ : పాలస్తీనా సమస్య – 03

టర్కీ పాలనలో వుండగా అరబ్బులు సుఖంగా ఏమీ లేరు. వాళ్లు వీళ్లనేమీ గౌరవంగా చూడలేదు. చులకనగా చూసి అణచివేసేవారు. యంగ్‌ టర్క్‌లు అధికారంలోకి వచ్చాక యిది మరీ ఎక్కువైంది. దాంతో అరబ్బులకు టర్కీ పట్ల…

టర్కీ పాలనలో వుండగా అరబ్బులు సుఖంగా ఏమీ లేరు. వాళ్లు వీళ్లనేమీ గౌరవంగా చూడలేదు. చులకనగా చూసి అణచివేసేవారు. యంగ్‌ టర్క్‌లు అధికారంలోకి వచ్చాక యిది మరీ ఎక్కువైంది. దాంతో అరబ్బులకు టర్కీ పట్ల ద్వేషం పెరిగింది. మొదటి ప్రపంచయుద్ధంలో బ్రిటన్‌ వాళ్లు దీనికి ఆజ్యం పోశారు. తమకు వ్యతిరేక కూటమిలో చేరిన టర్కీను బలహీనపరచాలంటే దాని పాలనలో వున్న ప్రాంతాల్లో చిచ్చు పెట్టాలి. టర్కీ నుండి అరబ్‌ను విడగొడితే యింకో లాభం కూడా వుంది. అక్కడ అప్పుడప్పుడే బయటపడుతున్న పెట్రోలు బావులను తమ అధీనంలోకి తెచ్చుకోవచ్చు. అయితే యీ ప్లాను సఫలీకృతం కావాలంటే బ్రిటిషు వారు  అరబ్బుల్లో ఒక ప్రముఖుణ్ని తమవైపు తిప్పుకోవాలి. ఆ ప్రముఖుడి విశ్వాసాన్ని చూరగొనడానికి ఒక బ్రిటిషువాణ్ని తయారుచేసుకోవాలి. వాళ్లకు అలా దొరికినవాడే టి.ఇ.లారెన్స్‌. ఇతను ఆర్కియాలజిస్టు. బహుభాషావేత్త. ఇతన్ని గూఢచారిగా చేర్చుకుని టర్కీపాలనలో వున్న పురాతన ప్రాంతాలలో పురావస్తు ప్రాంతాల పరిశోధన పేరుతో 1916లో అరబ్‌ ప్రాంతాలకు పంపించారు. 
అతను అరబ్బులతో వారి భాష మాట్లాడుతూ విశ్వాసాన్ని చూరగొన్నాడు. ఆ తర్వాత మక్కా మసీదుకు షరీఫ్‌గా వున్న హుసేన్‌ను బుట్టలో పెట్టాడు. 'మాతో చేతులు కలిపితే అరబ్బులను టర్కీకి వ్యతిరేకంగా పోరాడేట్లా చేస్తే టర్కీ సుల్తాన్‌ను ఖలీఫా (క్రైస్తవులకు పోప్‌ లా ముస్లిములకు ఖలీఫా వుండేవాడు. కెమాల్‌ పాషా ఆ పదవి పీకేశాడు) పదవిలోంచి పీకేసి అది నీకు కట్టబెడతా, అంతేకాదు అరబ్‌ ప్రాంతాలన్నిటినీ ఒక రాజ్యంగా సమైక్యం చేసి దాని ఆధిపత్యం నీకే కట్టబెడతా' అని బ్రిటన్‌ ప్రభుత్వం తరఫున మాట యిచ్చాడు. హుసేన్‌ ఆ మాట నమ్మి లారెన్సుతో కలిసి, అరబ్బులను రెచ్చగొట్టి టర్కీ సైన్యాలతో యుద్ధం చేశాడు. అరబ్బులు లారెన్సును నమ్మారు. అతని పేరు ''లారెన్స్‌ ఆఫ్‌ అరేబియా'' అయిపోయింది. తర్వాతి రోజుల్లో బ్రిటిషు దర్శకనిర్మాత డేవిడ్‌ లీన్‌ అతనిపై అదే పేరుతో ఇంగ్లీషు సినిమా తీసి అతన్ని ప్రపంచం దృష్టిలో పెద్ద హీరోను చేశాడు. కానీ జరిగినదేమిటంటే యుద్ధానంతరం అతన్ని బ్రిటను వెనక్కి రప్పించేసింది. హుసేన్‌కు, అరబ్‌ ప్రజలకు యిచ్చిన హామీలు గట్టున పెట్టేసింది. దాంతో అరబ్బులు మోసపోయారు. 

మొదటి ప్రపంచయుద్ధం తర్వాత యుద్ధం అనర్థం, శాంతి తక్షణావసరం అంటూ అప్పటిదాకా యుద్ధాలు చేసిన అగ్రదేశాలే నానారాజ్య సమితి (లీగ్‌ ఆఫ్‌ నేషన్స్‌) పేర ఒక అంతర్జాతీయ సంస్థ పెట్టారు. అది అగ్రరాజ్యాలు చెప్పినట్లా ఆడి, ఘోరంగా విఫలమైంది. రెండవ ప్రపంచయుద్ధాన్ని ఆపలేకపోయింది. అందువలన రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఐక్యరాజ్య సమితి (యుఎన్‌ఓ) స్థాపించారు. అది కూడా అమెరికా, పాశ్చాత్య దేశాలు చెప్పినట్లు ఆడుతోందని అందరికీ తెలుసు. కానీ యిన్నాళ్లగా నెట్టుకొస్తోంది. మొదటి యుద్ధానంతరం యీ నానారాజ్య సమితి మేన్‌డేటరీ పద్ధతి అని పెట్టి దాని ద్వారా సిరియాను ఫ్రాన్స్‌కి, పాలస్తీనా, ఇరాక్‌లను బ్రిటన్‌లకు కట్టబెట్టింది. తక్కిన అరబ్‌ రాజ్యాలు బ్రిటన్‌ పరోక్ష ప్రాబల్యంలోకి తరలిపోయాయి. మనం ఎలాగైతే ఆంగ్లసామ్రాజ్యపు వలస రాజ్యంగా వున్నామో, అరబ్బులు కూడా అలాగే తయారయ్యారు. మనలాగే యీ బానిసత్వాన్ని అరబ్‌లు ఆమోదించలేదు, సహించలేదు. రష్యాలో జరిగిన విప్లవం వారిని ఉత్తేజ పరిచింది. పైగా అప్పుడే టర్కీ మహాసామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడి గెలిచి వున్నారు. అందువలన బ్రిటిష్‌, ఫ్రెంచ్‌ సామ్రాజ్యవాదులకు ఓ పట్టాన లొంగలేదు. అప్పుడు యీ రెండు రాజ్యాలు  విభజించి పాలించే సూత్రం అవలంబించి అరబ్బుల్లో చీలికలు తేవడానికి పూనుకున్నాయి. కొన్ని దేశాలలో క్రైస్తవులు అధికంగా వున్న ప్రాంతాలను గుర్తించి వాటిని విడగొట్టి, ఏ రాజ్యమూ పెద్దగా లేకుండా అంతఃకలహాల్లో మునిగేట్లు చేసి, బలహీన పరచాలనే చూశాయి. ప్రజలు తిరగబడితే రాజ్యాంగ సంస్కరణలు చేపడతామని హామీ యివ్వడం, వారిలో కొందర్ని మితవాదులుగా మార్చడం చేశాయి. ఇలా ప్రతీ అరబ్‌ దేశంతోనూ యివి ఆటలాడాయి. మన ప్రస్తుత అంశం పాలస్తీనా కాబట్టి దాని గురించే మాట్లాడదాం.

పాలస్తీనాతో వచ్చిన చిక్కేమిటంటే అది మూడు ప్రముఖమతాల వారికి పుణ్యక్షేత్రం. ప్రాచీన కాలంలో యూదులకు స్వస్థలం. దానిలో ఉత్తర భాగాన్ని ఇజ్రాయేల్‌  (రాజధాని జెరూసలేం) అని, దక్షిణ భాగాన్ని జుడా అని పిలిచేవారు. జీసస్‌ క్రైస్త్‌ జెరూసలెంలో యూదుజాతిలోనే పుట్టాడు. అతని మరణం తర్వాత సుమారు 300 ఏళ్లకు క్రైస్తవం బాగా వ్యాప్తి చెందింది. అప్పణ్నుంచి ప్రపంచ క్రైస్తవులందరూ జెరూసలెంను పుణ్యస్థలంగా భావించసాగారు. కొన్నాళ్లకు వచ్చిన ఇస్లాం మతస్తులకు కూడా పాలస్తీనా పవిత్రభూమిగానే వుంది. ఇస్లాం స్వీకరించిన అరబ్బులు పాలస్తీనాను ఆక్రమించారు. వారి సైనికబలానికి తట్టుకోలేక యూదులు యితర దేశాలకు తరలివెళ్లిపోయి, మొదటిభాగంలో చెప్పినట్లు వ్యాపారమార్గం ద్వారా డబ్బు బాగా సంపాదించారు. గతంలో యుద్ధాలలో పోగొట్టుకున్న పాలస్తీనాను యీ కాలంలో డబ్బుతో సంపాదించాలని ప్రయత్నించారు. 

మొదటి ప్రపంచయుద్ధకాలంలో బ్రిటన్‌తో బేరాలాడారు – 'ఇప్పుడు మీకు చాలా డబ్బు కావాలి, మేం అప్పిస్తాం. కానీ దానికి బదులుగా పాలస్తీనాలో మాకు జన్మభూమి కల్పించాలి' అని. అరబ్బుల స్వాతంత్య్ర పిపాస అప్పటికే రుచి చూస్తున్న బ్రిటన్‌కు యీ యూదుల దేశాన్ని వారి మధ్య స్థాపిస్తే  వాళ్లకు చెక్‌ చెప్పినట్టు వుంటుందని లెక్క వేసింది. అరేబియాలోని చమురు తమకు కావాలి. వాళ్లు యివ్వకపోతే ఆయుధశక్తి ప్రయోగించాలి. దానికి అక్కడ ఒక స్థావరం కావాలి, అది నెలకొల్పడానికి మిత్రదేశం కావాలి. ఈ యూదులు ఆ మిత్రదేశాన్ని తమ ఖర్చుతో తాము ఏర్పాటు చేసుకుంటానంటున్నారు, పైగా మనకు భారీ ఋణాలు యిస్తామంటున్నారు. ఇంకేం కావాలి? బ్రిటన్‌ విదేశాంగ మంత్రి ఆర్థర్‌ బాల్ఫర్‌ ద్వారా యూదు ఋణదాతలు (బ్యాంకర్లు) నాయకుడు రాత్‌ఛైల్డ్‌కు 1917లో ఒక లేఖ రాసి కమిట్‌ అయ్యారు. యూదులు సంతృప్తి పడి అప్పులిచ్చారు. యుద్ధానంతరం మాట చెల్లించమన్నారు. నానారాజ్యసమితి ద్వారా మేన్‌డేటరీ పద్ధతిలో పాలస్తీనాను చేజిక్కించుకున్న బ్రిటన్‌ యూదులను అక్కడకి వెళ్లి నివసించడానికి అనుమతి యిచ్చేసింది. పాలస్తీనాను సంప్రదించనే లేదు. 1919లో 60 వేల మంది యూదులు పాలస్తీనాకు తరలివెళ్లారు. ఆ తర్వాత వెళుతూనే వున్నారు. పదేళ్లు తిరిగేసరికి వారి సంఖ్య 8 లక్షలకు పెరిగింది. 

యూదు ధనికులు బ్రిటన్‌ పాలకులతో ఒప్పందం చేసుకున్నా యీ స్థాయిలో సామాన్య యూదులెవరైనా తరలి వెళతారా? అన్న సందేహం మనకు కలుగుతుంది. ఈ తరలి వెళ్లడం వెనక్కాల ఒక ఉద్యమం వుందని తెలిస్తే ఆ సందేహం తీరుతుంది. మాతృదేశం వదలి వెళ్లిన యూదులు ఎన్ని అష్టకష్టాలు పడ్డారో బైబిల్‌లోనే వర్ణించబడింది. యూదులలో మతభావనలు హెచ్చు. ఎన్ని వేల సంవత్సరాలు గడిచినా స్థానికులతో కలవకుండా తమ ఐడెంటిటీని అలాగే కాపాడుకుంటూ వచ్చారు. మాతృదేశానికి మరలాలన్న ధ్యేయాన్ని పాత తరం కొత్తతరానికి నూరిపోస్తూ వచ్చింది. 1492లో స్పెయిన్‌ యూదులను తరిమివేయడంతో కొందరు పాలస్తీనాలో సెటిల్‌ అయ్యారు. 16 వ శతాబ్దంలో యూదులు జెరూసలెం, టిబిరియాస్‌, హెబ్రాన్‌, సఫేద్‌ అనే నాలుగు పుణ్యస్థలాలలో స్థిరపడ్డారు. 1697లో కొంతమంది వచ్చారు. 1750 ప్రాంతాల్లో తూర్పు యూరప్‌ దేశాల నుండి మరి కొందరు వచ్చారు. కానీ 1881లో తూర్పు యూరోప్‌ నుండి భారీ సంఖ్యలో వలస ప్రారంభమైంది. ఆస్ట్రియా-హంగరీ దేశాలకు చెందిన జర్నలిస్టు థియోడోర్‌ హెర్జెల్‌ యూదులు సంచారజీవితానికి స్వస్తి చెప్పి తమ మాతృభూమిని తిరిగి చేరాలనే ఉద్యమాన్ని 1896లో ప్రారంభించాడు. మరుసటి ఏడాదే ప్రపంచ యూదుల సమావేశాన్ని ఏర్పాటు చేసి అందరికీ యీ సలహా యిచ్చాడు. 1904-14 మధ్య 40 వేల మంది యూదులు పాలస్తీనాలో స్థిరపడ్డారు కానీ సగానికి సగం మంది వెనక్కి వెళ్లిపోయారు. ఇక 1918లో బ్రిటన్‌ మద్దతు లభించాక వెల్లువెత్తారు. (సశేషం) 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఆగస్టు 2014)

[email protected]

Click Here For Part-1

Click Here For Part-2