మహారాష్ట్రలో ముఖ్యంగా ముంబయి నగరంలో డాన్స్ బార్‌లకు ఉన్న క్రేజ్ మూమూలుది కాదు. ప్రపంచవ్యాప్త ప్రాచుర్యం ఉన్న ఈ బార్‌లు ఒక దశాబ్ధం క్రితం దాకా జల్సారాయుళ్లకు కిక్కెక్కించాయి. ముంబయి మాఫియా డాన్‌లకు కాసులు కురిపించాయి. దేశంలో మరికొన్ని నగరాలు కూడా దీనిని స్ఫూర్తిగా తీసుకునేందుకు ప్రేరేపించాయి. అలా స్ఫూర్తిగా తీసుకున్న నగరాల్లో మన హైదరాబాద్ కూడా కొంతకాలం పాటు కొనసాగింది.
అయితే గత కొన్నేళ్లుగా ముంబయి డాన్స్ బార్‌లకు టైమ్ బాగోలేదు. వీటిపైన పాక్షిక నిషేధం, ఆ తర్వాత సంపూర్ణ నిషేధం… మళ్లీ కోర్టు అనుమతితో ప్రారంభం అవడం… ఇలా మార్పు చేర్పులతో సదరు డాన్స్ బార్‌ల సంస్కృతి నిదానంగా తగ్గు ముఖం పట్టింది. అయితే ఈ కల్చర్ ద్వారా డబ్బు చేసుకోవడానికి అలవాటు పడిన వాళ్లు పట్టు వదలని విక్రమార్కుల్లా న్యాయ పోరాటాలు సాగిస్తూనే ఉన్నారు.
మొత్తం మీద వారి పోరాటం ఫలించింది. తాజాగా సుప్రీంకోర్టు డాన్స్ బార్ల మీద ఉన్న స్టేను ఎత్తివేస్తూ గురువారం ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఇకపై బార్లు, హోటల్స్, రెస్టారెంట్స్…లలో డాన్సులకు అనుమతి ఉంటుంది. అయితే అవి అశ్లీలంగా ఉండకుండా చూడాల్సిన బాధ్యత మాత్రం లైసెన్సింగ్ అధికారులదే అని కోర్టు స్పష్టం చేసింది.