టీవీ9 Vs విశ్వక్.. ఆ అతి ముందు ఇది చాలా తక్కువ

టీవీ9 యాంకర్ కు హీరో విశ్వక్ సేన్ కు మధ్య మొదలైన వివాదం ఇంకా రాజుకుంటూనే ఉంది. అటు ఆ ఛానెల్ లో, ఇటు సోషల్ మీడియాలో ఈ వివాదాన్ని ఇంకా ఎగదోస్తూనే ఉన్నారు.…

టీవీ9 యాంకర్ కు హీరో విశ్వక్ సేన్ కు మధ్య మొదలైన వివాదం ఇంకా రాజుకుంటూనే ఉంది. అటు ఆ ఛానెల్ లో, ఇటు సోషల్ మీడియాలో ఈ వివాదాన్ని ఇంకా ఎగదోస్తూనే ఉన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ మొత్తం వ్యవహారంలో విశ్వక్ వైపే ఎక్కువమంది మొగ్గుచూపడం. ఛానెల్ లో ఎంత ప్రాపగాండ జరుగుతున్నప్పటికీ, మరోవైపు ఎన్ని కేసులు నమోదైనప్పటికీ.. విశ్వక్ కే ఎక్కువ నైతిక మద్దతు దొరకడం విశేషం.

ఈ సందర్భంగా మరో ఆసక్తికర చర్చకు తెరలేచింది..

మామూలుగానే విశ్వక్ సేన్ కు ఓవరాక్షన్ ఎక్కువనే టాక్ ఉంది. తన సినిమాల ఈవెంట్లలో విశ్వక్ మాట్లాడే తీరు, ఇచ్చే స్టేట్ మెంట్లు అతడి ఓవరాక్షన్ కు ఎగ్జాంపుల్స్. గతంలో 2-3 వివాదాల్లో విశ్వక్ ను దారుణంగా ట్రోల్ చేశారు నెటిజన్లు. అలా ట్రోల్ చేసిన జనాలే ఇప్పుడు విశ్వక్ చేసిన ఓవరాక్షన్ ను చాలా తక్కువ అంటున్నారు. దీనికి కారణం టీవీ9 యాంకర్ దేవి.

కొన్నేళ్లుగా దేవి చేస్తున్న ఓవరాక్షన్ తో పోలిస్తే, విశ్వక్ చేసింది చాలా తక్కువని అభిప్రాయపడుతోంది సోషల్ మీడియా. బిగ్ బాస్ కార్యక్రమంలో, టీవీ చర్చల్లో, ఔట్ డౌర్ లో చేసే వార్తా కార్యక్రమాల్లో దేవి చేసిన ఓవరాక్షన్ కు సంబంధించిన వీడియోలు కుప్పలు తెప్పలుగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమౌతున్నాయి.

గతంలో విశ్వక్ చేసిన ఓవరాక్షన్ ను, దేవి చేసిన ఓవరాక్షన్ పక్కపక్క బాక్సుల్లో పెట్టి వీడియోలు క్రియేట్ చేసి వదులుతున్నారు జనం. ఎవరిది ఎక్కువ ఓవరాక్షనో చెప్పాలంటూ పోల్స్ పెడుతున్నారు. ఈ పోల్స్ లో దేవికే ఎక్కువ మార్కులు పడుతున్నాయి.

ఈమె టీఆర్పీ కోసం చేసిందా, ఆయన పబ్లిసిటీ కోసం చేశాడా అనే చర్చను పక్కనపెడితే.. ఈ వివాదంతో సదరు ఛానెల్ ప్రతిష్ట మాత్రం మరింత మసకబారింది. అదే టైమ్ లో విశ్వక్ కు అనూహ్యంగా మద్దతు పెరిగింది. ఈ మొత్తం వివాదానికి కారణమైన అశోకవనంలో అర్జునకల్యాణం అనే సినిమా ఈరోజు థియేటర్లలోకి వచ్చింది.