‘‘అయిదో తేదీ వచ్చేసింది.. ఇంకా జీతాలు రాలేదు.. చేసిన పనికి జీతాలు ఇవ్వమని అడిగే దుస్థితి వచ్చింది.. జీతాలు ఏరోజులోగా ఇస్తారో ఖచ్చితంగా చెప్పాలి..’’ ఈ కామెంట్లు చదివితే, ఈ ప్రభుత్వం అసలు ఉద్యోగులకు జీతాలే ఇవ్వడం లేదేమో అనే అభిప్రాయం కలుగుతుంది. ఇదంతా ఏపీ ప్రభుత్వం గురించి పచ్చమీడియాలో వచ్చే ప్రచారం,. మేనెల 5వ తేదీ వచ్చినా కూడా ‘‘40శాతం మందికి’’ ఇంకా జీతాలు రాలేదంటూ.. పచ్చమీడియా ఆక్రోశం వ్యక్తం చేస్తుంటుంది.
సాధారణంగా జీతాలు కొద్దిగా ముందూ వెనుకా అవుతుంటాయి. ఎటొచ్చీ ఖచ్చితంగా వచ్చే జీతాలే గనుక.. ఉద్యోగులు కూడా తదనుగుణంగా సర్దుకుంటూ ఉంటారు. అయితే ఏపీ విషయంలో మాత్రం ప్రతినెలా ఒకటో తేదీ రాగానే పచ్చమీడియా ప్రతిరోజూ జీతాలు లేటయ్యాయనే విషాన్ని కక్కడానికి గోతికాడ నక్కలా ఎదురుచూస్తూ ఉంటుంది. ఇదంతా వారికి నిజంగా ఉద్యోగుల జీతాల మీద ఉన్న ప్రేమేనా? అంటే ఎంత మాత్రమూ కాదు!
సాధారణంగా గాజుగ్లాసులో సగం నీళ్లు పోసి ఏం కనిపిస్తోందో చెప్పమని అడుగుతారు సైకాలజిస్టులు. ‘సగం గ్లాసు ఖాళీ’ అని చెప్పేవాళ్లు నిరాశావాదులు.. జీవితంలో బాగుపడరని, ‘సగం గ్లాసు నిండింది’ అని చెప్పేవాళ్లు ఆశావహులు, జీవితంలో ఎదుగుతారు.. అనేది సిద్ధాంతం. 60 శాతం మంది ఉద్యోగులకు జీతాలు చెల్లింపులు జరిగిన తర్వాత.. 40 శాతంమందికి ఇంకా రాలేదని.. వాళ్లు కుమిలిపోతున్నారని అన్నట్టుగా కథనాలు రాస్తే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.
పొరుగునే ఉన్న సంపన్న రాష్ట్రం తెలంగాణలో జీతాలు ఒకటోతేదీనే చెల్లిస్తున్నారా? ఐదో తేదీ వచ్చినా సగం మంది వరకు ఆ రాష్ట్రంలో కూడా జీతాల చెల్లింపులు జరగనేలేదు. 20వ తేదీ వరకు కూడా జీతాల చెల్లింపులు జరగని సందర్భాలు సంపన్న రాష్ట్రమైన తెలంగాణలో కొన్ని చోటుచేసుకున్నాయి. అవేవీ ఈ పచ్చమీడియాకు కనిపించవు. అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క మాట రాయడానికి కూడా వెన్నెముక లేని ఈ పచ్చమీడియా ఏనాడైనా ఆ విషయాన్ని గమనించిందా? గమనించి కూడా.. అక్కడ కేసీఆర్ మీద మనం చల్లవలసిన విషం లేదు గదా అని మిన్నకుంటోందా? ఏపీలో మాత్రం.. కొంచెం ఆలస్యం కాగానే.. ఇక మొదలు పెడతారు.
జీతాలు పూర్తిగా ఇవ్వకపోతే ప్రభుత్వాన్ని నిందిస్తే తప్పులేదు. రోజుల తేడాతో ముందు వెనుకగా చెల్లింపులు చేస్తూ ఉంటే కూడా.. ప్రభుత్వం మీద ఇలా నిందలు కురిపించడం అనేది.. కేవలం ఉద్యోగ వర్గాల్లో ఇలాంటి దుష్ప్రచారం ద్వారా ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి మాత్రమే అనే భావం ఎవ్వరికైనా కలుగుతుంది. పచ్చమీడియా ఇలాంటి కుట్రపూరిత ప్రచాచారలను కట్టిపెడితే.. కనీసం తమ పరువు కాపాడుకుంటుంది.