బాబు త‌ప్పుకుంటారా? త‌ప్పిస్తారా?

మ‌రో రెండేళ్ల‌లో సార్వత్రిక ఎన్నిక‌లు ఉన్న‌ప్ప‌టికీ, ఇప్ప‌టి నుంచే ప్ర‌చారం చేస్తున్న‌ట్టుగా… ఏపీలో అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల తీరుంది. ఈ నేప‌థ్యంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు దూకుడు పెంచారు. ముఖ్యంగా చంద్ర‌బాబుకు రాబోయే…

మ‌రో రెండేళ్ల‌లో సార్వత్రిక ఎన్నిక‌లు ఉన్న‌ప్ప‌టికీ, ఇప్ప‌టి నుంచే ప్ర‌చారం చేస్తున్న‌ట్టుగా… ఏపీలో అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల తీరుంది. ఈ నేప‌థ్యంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు దూకుడు పెంచారు. ముఖ్యంగా చంద్ర‌బాబుకు రాబోయే ఎన్నిక‌లు ప్ర‌తిష్టాత్మ‌కం. 

ఎందుకంటే రానున్న ఎన్నిక‌ల్లో టీడీపీ అధికారంలోకి రాక‌పోతే, ఇక ఆ పార్టీకి భ‌విష్య‌త్ ప్ర‌శ్నార్థ‌క‌మే. ఇందుకు చంద్ర‌బాబు వ‌య‌సు, కొత్త జ‌న‌రేష‌న్ ఆలోచ‌న‌ల్లో మార్పు, బీజేపీ బ‌లోపేతం కావాల‌నే ఆకాంక్ష‌… అన్నీ క‌లిసి టీడీపీకి ఎస‌రు పెట్టనున్నాయి. నారా లోకేశ్ ఇప్ప‌టికీ నాయ‌కుడిగా త‌న‌ను ఆవిష్క‌రించుకోలేకున్నారు. ఇది చంద్ర‌బాబుకు అద‌న‌పు బాధ‌.

ఈ నేప‌థ్యంలో విశాఖ జిల్లా భీమిలి మండలం తాళ్లవలసలో ‘బాదుడేబాదుడు’ లో చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌లు ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి. దేశంలో అత్య‌ధిక ప‌న్నుల భారం మోపిన రాష్ట్రం ఆంధ్ర‌ప్ర‌దేశే అని విమ‌ర్శించారు. మ‌న‌క‌న్నా ఎక్కువ ధ‌ర‌లు ఎక్క‌డున్నా తాను రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటాన‌ని స‌వాల్ విసిరారు. రాజ‌కీయాల్లో స‌వాళ్లు, ప్ర‌తిసవాళ్ల గురించి జ‌నానికి బాగా తెలుసు. వీటిని పెద్ద‌గా ప‌ట్టించుకునే ప‌రిస్థితి వుండ‌దు.

రాజ‌కీయాల నుంచి చంద్ర‌బాబు ఉండాల‌ని అనుకున్నా, త‌ప్పించే ప‌వ‌ర్ ప్ర‌జ‌ల చేత‌ల్లో ఉంది. వైఎస్ జ‌గ‌న్ పాల‌న‌కు సంబంధించి ప్ర‌తిప‌క్షాల ఆరోప‌ణ‌లు ఎలా ఉన్నా, తాను ఎన్నిక‌ల ప్ర‌ణాళిక‌లో ఇచ్చిన హామీల అమ‌లుకు సీఎం క‌ట్టుబ‌డి ఉన్నార‌నేది వాస్త‌వం. 

అప్పో, మ‌రొక‌టో జ‌నానికి సంక్షేమ ప‌థ‌కాల పేరుతో డ‌బ్బు పంచుతున్నారు. గ‌తంలో చంద్ర‌బాబు ఇచ్చిన హామీల‌న్నీ స‌గం స‌గ‌మే అమ‌ల‌య్యాయి. రైతుల రుణ‌మాఫీ, డ్వాక్రామ‌హిళ‌ల రుణ‌మాఫీ, ఇలా ఏది తీసుకున్నా చంద్ర‌బాబు హామీ నిల‌బెట్టుకోలేద‌నే విమ‌ర్శ సొంత పార్టీ శ్రేణుల నుంచే వ‌స్తోంది.

ఈ నేప‌థ్యంలో ఆల్రెడీ హామీలు నిల‌బెట్టుకోలేని చంద్ర‌బాబు, మాట‌కు క‌ట్టుబ‌డి క‌రోనా లాంటి విప‌త్క‌ర స‌మ‌యాల్లోనూ సంక్షేమ ప‌థ‌కాల‌ను విజ‌య‌వంతంగా అమ‌లు చేసిన జ‌గ‌న్ పాల‌న‌ను ప్ర‌జ‌లు పోల్చుకుంటున్నారు. ఇదే జ‌గ‌న్‌కు బ‌లం, చంద్ర‌బాబుకు మైన‌స్. త‌మ‌కు మేలు చేసే పాల‌కుడిని పేద ప్ర‌జ‌లు పోగొట్టుకుంటారా? అనేది ప్ర‌శ్న‌. 

జ‌గ‌న్‌పై తాను గొంతు చించుకుని అర‌వ‌డం త‌ప్ప‌, జ‌నం నుంచి వ్య‌తిరేక‌త రాలేద‌న్న‌దే చంద్ర‌బాబు ఆవేద‌న‌, ఆక్రోశం. అందుకే రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటాన‌నే స‌వాల్‌తో ప‌ని లేకుండా స‌మ‌యం చూసి, ప్ర‌జ‌లే ఆ ప‌ని చేస్తార‌ని చంద్ర‌బాబు గ్ర‌హిస్తే మంచిది.