టాలీవుడ్‌ని లైట్‌ తీసుకున్న చంద్రబాబు.!

రెండు వేల ఎకరాల్లో సినీ సిటీ నిర్మిస్తామని గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. అదెక్కడిదాకా వచ్చిందన్నది ఇప్పటికీ ఎవరికీ తెలియడంలేదు. అయినప్పటికీ, హైద్రాబాద్‌లో స్థిరపడ్డ తెలుగు సినీ పరిశ్రమకి చిన్నపాటి అదనపు వసతులు…

రెండు వేల ఎకరాల్లో సినీ సిటీ నిర్మిస్తామని గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. అదెక్కడిదాకా వచ్చిందన్నది ఇప్పటికీ ఎవరికీ తెలియడంలేదు. అయినప్పటికీ, హైద్రాబాద్‌లో స్థిరపడ్డ తెలుగు సినీ పరిశ్రమకి చిన్నపాటి అదనపు వసతులు కల్పించినా మరింతగా తెలంగాణలో సినీ పరిశ్రమ విస్తరించే అవకాశం వుంది గనుక.. రేపో మాపో కేసీఆర్‌, తెలుగు సినీ పరిశ్రమకు ప్రకటించిన వరాలపై యాక్షన్‌ షురూ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

నిన్నటికి నిన్న ‘బస్తీ’ ఆడియో విడుదల వేడుకకు హాజరైన కేసీఆర్‌, తెలుగు సినీ పరిశ్రమకు అభయమిచ్చారు. తెలంగాణ రాష్ట్ర సినీ కళాకారులు అభివృద్ధిలోకి రావాలని ఆకాంక్షిస్తూనే, సినిమాకి ప్రాంతీయ బేధాలు వుండవని చెప్పారు. సినీ పరిశ్రమ నుంచి ప్రతిపాదనలు వస్తే సినీ పరిశ్రమ అభివృద్ధికి తనవంతు సహకారమిస్తానని కేసీఆర్‌ చెప్పుకొచ్చారు. తెలంగాణలో సినీ పరిశ్రమకు సంబంధించిన తాజా వాతావరణం ఇలా వుంది.

మరి ఆంధ్రప్రదేశ్‌ మాటేమిటి.? ఉద్యమాల సమయంలో తెలుగు సినీ పరిశ్రమ ఆంధ్రాకి తరలి వెళ్ళిపోతుందంటూ అనేక ఊహాగానాలు విన్పించాయి. అవెక్కడిదాకా వచ్చాయి.? అని చాలామంది ఆరా తీస్తున్నా, ఇప్పట్లో తెలుగు సినీ పరిశ్రమ ఎక్కడికీ కదిలి వెళ్ళే అవకాశమే లేదన్న సమాధానమే వస్తోంది సినీ రంగం నుంచి.

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో రామానాయుడు స్టూడియో ఒక్కటే వుంది. అది కాకుండా సినీ రంగం స్థిరపడేందుకు తగిన సౌకర్యాలు ఇంకెక్కడా లేవన్నది నిర్వివాదాంశం. అసలు ఏపీ సర్కార్‌, తెలుగు సినీ రంగం గురించి ఆలోచనే చేయకపోవడం ఆశ్చర్యకరమైన విషయం. తెలుగు సినీ పరిశ్రమలో మెజార్టీ సీమాంధ్రులే వున్నారన్నది ఓపెన్‌ సీక్రెట్‌. అలాంటప్పుడు తెలుగు సినిమాకి ఇంకో బ్రాంచ్‌గానైనా ఆంధ్రప్రదేశ్‌లోని ఏదో ఒక నగరంలో తగిన అవకాశాలు కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం ముందుకు రాకపోవడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు సినీ నటుడు. ఆయన తనయుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రముఖ సినీ నటుడు. ఆ మాటకొస్తే నందమూరి కుటుంబంలో చాలామంది సినీ రంగంలో వెలుగొందుతున్నారు. చంద్రబాబు సోదరుడి తనయుడు నారా రోహిత్‌ కూడా సినీ హీరోనే. ఇలా సినీ పరిశ్రమలో తన సన్నిహితులే చాలామంది వున్నప్పుడు, కనీసం వారి సూచనలు, సలహాలతో అయినా ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి చంద్రబాబు ముందుకు రాకపోవడమేంటో ఎవరికీ అర్థం కావడంలేదు.

హైద్రాబాద్‌ నుంచి టాలీవుడ్‌ ఎక్కడికీ వెళ్ళిపోవాల్సిన పనిలేదుగానీ, మరో తెలుగు రాష్ట్రంలోనూ హైద్రాబాద్‌తో సమాంతరంగా అభివృద్ధి చెందితే, తెలుగు సినీ రంగం ఖ్యాతి మరింత పెరుగుతుంది కదా.! ఈ లాజిక్‌ చంద్రబాబు ఎందుకు మిస్‌ అవుతున్నట్టు.? ఏమో మరి ఆయనకే తెలియాలి.