సదరన్ స్పైస్ : రీమేక్ .. దశాబ్దాల తర్వాత!

రీమేక్ చాలా సహజమైన సినిమా ప్రకియ. ఒక్క భాషలో హిట్ రిజల్ట్ పొందినా మరో భాష ప్రేక్షకుల కోసం రీమేక్ చేసి చూపడం ప్రపంచ సినిమాలో సహజంగా జరుగుతుంది. మరి ఇలాంటి రీమేక్‌లు వేడి…

రీమేక్ చాలా సహజమైన సినిమా ప్రకియ. ఒక్క భాషలో హిట్ రిజల్ట్ పొందినా మరో భాష ప్రేక్షకుల కోసం రీమేక్ చేసి చూపడం ప్రపంచ సినిమాలో సహజంగా జరుగుతుంది. మరి ఇలాంటి రీమేక్‌లు వేడి వేడిగా జరుగుతూ ఉంటాయి. ఏదైనా సినిమా హిట్ టాక్ పొందిందంటే.. వెంటనే దాని శాటిలైట్ రైట్స్ విషయంలో వార్తలొచ్చినట్టుగానే.. రీమేక్ రైట్స్ విషయంలో వార్తలు రావడం రొటీనయ్యింది. ప్రత్యేకించి గత కొంతకాలంలో సినిమా హిట్ అయ్యిందంటే చాలు రీమేక్ అనేస్తున్నారు! మరి ఒక భాష నుంచి ఒక సబ్జెక్ట్‌ను తెచ్చుకొని మరో భాష వారు రీమేక్ చేసుకొనే తీరును ఒకసారి పరిశీలిస్తే.. వేడి వేడిగా జరిగే రీమేక్‌లు కొన్ని అయితే.. చాలా లేటుగా జరిగే రీమేక్‌లు మరికొన్ని. ఎప్పుడో వచ్చిన సినిమాను ఇప్పుడు రీమేక్ చేయడం అన్నమాట. మధ్యలో కొన్ని తరాలు మారిపోయినా మరో భాషలో రీమేక్ కావడం ఆ సబ్జెక్టుల విశిష్టత.. గొప్పదనం. ఇలాంటి సినిమాలు ఎన్నో ఉన్నాయి. ప్రత్యేకించి దక్షిణాదిలో తరాలు మారిన తర్వాత ’తాజా’గా మారిన సినిమాలెన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో కొన్నింటి వివరాలు…

బుద్ధిమంతుడు… ఈ సినిమా 2008లో తెలుగులో విడుదల అయ్యింది. ఉపేంద్ర హీరోగా నటించిన ఈ వైవిధ్యమైన చిత్రాన్ని కన్నడ నుంచి తెలుగులోకి డబ్ చేశారు. ఈ డబ్బింగ్ బొమ్మ విషయంలో ఆసక్తికరమైన విశేషాలెన్నో ఉన్నాయి. 2008 జనరేషన్‌కే ఒక వైవిధ్యభరితమైన సినిమా అనిపించిన ఈ సబ్జెక్ట్ 1970లలోది అంటే ఆశ్చర్యం కలగకమానదు. అవును.. ఈ సినిమాకు మూలం కె.బాలచందర్ రూపొందించిన ఒక తమిళ సినిమా దాని పేరు నాన్ అవన్ ఇళ్లై(నేను వాడ్ని కాదు)’’ జెమినీ గణేషన్ హీరోగా నటించిన ఈ సినిమా 1974లో విడుదలైంది. అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది. మరి 1974లో వచ్చిన ఆ సినిమాను 2008లో మరోభాషలో రీమేక్ చేయడం అంటే.. మాటలు కాదు కదా! ఏదో మాస్ మసాలా సబ్జెక్టులు.. అప్పట్లో తాత లేదా తండ్రి చేసిన సినిమాను ఇప్పుడు కొడుకులు, మనవళ్లు చేయడం.. రామ్ గోపాల్ వర్మ షోలేను రీమేక్ చేసి చెడగొట్టడం వంటి వ్యవహారంలా గాక.. 34 యేళ్ల గ్యాప్‌తో వేర్వేరు భాషల్లో వేర్వేరు తరాల వారి ఆదరణ పొందిన సబ్జెక్ట్ ఇది. మరి ఇలా దశాబ్దాల తర్వాత కూడా ఫెష్ నెస్‌ను కలిగిన సబ్జెక్ట్‌ను రూపొందించడంలో పూర్తి క్రెడిట్ బాలచందర్‌కే కాదు.. మరాఠీ రచయిత పహ్లాద్ కేశవ్ అతేకు కూడా దక్కుతుంది. ఎందుకంటే 1962లో ఆయన ఈ సబ్జెక్ట్‌ను తయారు చేశారు..’నేను వాడ్ని కాదు..’ అనే అర్థాన్నిచ్చే మరాఠీ పేరుతో ఈ సినిమా రూపొందింది. అంటే.. ఓవరాల్‌గా 46 యేళ్ల గ్యాప్‌తో భిన్నమైన భాషల్లో రూపొందిన సబ్జెక్ట్ ఇది!

తరాలు మారినా వాడని ఇలాంటి సబ్జెక్టుల్లో ’మర్యాద రామన్న’ కథను కూడా ప్రస్తావించుకోవాలి. రాజమౌళి దర్శకత్వంలో 2010లో వచ్చిన ఈ సినిమాకు మూలం హాలీవుడ్ మూకీ సినిమా’అవర్ హాస్పిటాలిటీ’ అనే విషయం చాలా మందికి తెలిసిందే. పూర్తిగా కాదు కానీ.. మూలకథను రాజమౌళి హాలీవుడ్ సినిమా నుంచే తెచ్చుకొన్నాడు. ఆ మూలకథ 1923 నాటిది. అంటే.. 78 యేళ్ల తర్వాత రీమేక్ చేసినట్టనమాట. రాజమౌళి 78 యేళ్ల తర్వాత ఈ కథను తిరిగి తెరకెక్కిస్తే.. ఈ మూడేళ్లలో హిందీ, తమిళ, కన్నడ, మళయాల భాషల వాళ్లు ఈ సినిమాను రీమేక్ చేసుకొన్నారు. 

దక్షిణాది నుంచి హిందీ చిత్రపరిశమ వైపు వెళ్లిపోయిన దర్శకుల్లో ఒకరు ప్రియదర్శన్. ఈ దర్శకుడు 0లలో మళయాల చిత్ర పరిశ్రమను, దక్షిణాది సినిమాను బాగా ప్రభావితం చేశాడు. మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్‌కు స్నేహితుడిగా కూడా పేరున్న ప్రియదర్శన్ సినిమాలు అనేకం తెలుగులో కూడా రీమేక్ అయ్యాయి. బాలీవుడ్ వైపు వెళ్లిపోయాకా పియదర్శన్ అక్కడ సత్తాచాటడానికి ఒక టెక్నిక్ ఎంచుకొన్నాడు. అదే 80, 90లలో విడుదలైన మలయాళీ బొమ్మలను హిందీలో రీమేక్ చేయడం! 1998లో మళయాలంలో వచ్చిన సూపర్ హిట్ సినిమా ’రామ్ జీ రావ్ స్పీకింగ్’ ఈ కామెడీ థిల్లర్ రూపొందించింది సిద్ధిక్-లాల్ ద్వయం. దాదాపు పన్నెండేళ్ల తర్వాత ప్రియదర్శన్ దీన్ని  హిందీలో హేరా ఫెరీ పేరుతో రీమేక్ చేస్తే.. అదొక ఇండస్ట్రీ హిట్ అయ్యింది. అక్షయ్ కుమార్, సునీల్ షెట్టి, పరేష్ రావల్‌లు ముఖ్యపాతలు చేసిన ఈ సినిమా అంత వరకూ ఉన్న బాలీవుడ్ రికార్డులను చెరిపివేసింది. ఈ సినిమా ఆ తర్వాతి కాలంలో అనేక మళయాలం సినిమాలకు కొత్త ఊపునిచ్చింది. పాత స్కిప్ట్‌ల దుమ్ము దులిపింది. పాత మళయాల సినిమాలపై అందరి కన్నూ పడింది. అనేకం రీమేక్ కావడం మొదలైంది. ప్రియదర్శనే చాలా సినిమాలను దశాబ్దాల తర్వాత రీమేక్ చేశాడు. ఈ పరంపరలో వచ్చినవే… కఠామిట్టా, ధోల్, చుప్ చుప్ కే, భాగమ్ భాగ్, మలమాల్ వీక్లి తదితరాలు. ఇవన్నీ కూడా8 0ల చివర్లో.. 90ల పారంభంలో మళయాలంలో వచ్చి పది పదిహేను సంవత్సరాల తర్వాత బాలీవుడ్‌లో రీమేక్ అయ్యాయి. రెండు వేరు వేరు జనరేషన్ జనాల ఆదరణను చూరగొన్నాయి.

ఇక ఇలా దశాబ్దాల తర్వాత రీమేక్ తలంపును హీరోలకు, దర్శకులకు తెచ్చి పెట్టిన సబ్జెక్టుల్లో ఒకటి ’చందముఖి’. మన వరకూ అయితే ఈ సినిమా 2005 సమయంలో విడుదల అయ్యింది. తమిళంలో రజనీకాంత్ నటించగా దీన్ని తెలుగులోకి డబ్ చేశారు. దీని మూలం మళయాలంలో ఉండగా..ఆ సినిమా మాత్రం అంతకు పన్నెండేళ్ల కిందటే విడదలవ్వడం విశేషం. మోహన్ లాల్, సురేష్ గోపి, శోభన తదితరులు నటించిన ఆ సినిమాను విడుదలైనప్పుడే చూసిన రజనీకాంత్ దాదాపు పన్నెండేళ్ల తర్వాత రీమేక్‌కు పూనుకొన్నాడు. మధ్యలో ఈ సినిమాను కన్నడలో రీమేక్ చేసిన పి.వాసుకే తమిళంలో రూపొందించే బాధ్యతలు కూడా అప్పగించి హిట్ కొట్టాడు రజనీకాంత్. కథలో కొన్ని మార్పులైతే చేశారు కానీ.. పదేళ్ల తర్వాత కూడా ప్రేక్షకులకు నచ్చేలా ఈ సబ్జెక్ట్‌ను రూపొందించిన మళయాల దర్శక నిర్మాతలు ప్రశంసలకు అర్హులే కదా!

ఇలాంటి సినిమాలను రూపొందించిన ఘనత మనవాళ్లకూ ఉంది. మహేశ్ బాబు హీరోగా నటించిన  ’ఒక్కడు’ 2003లో వచ్చింది. మరి అది జరిగి పన్నెండేళ్లయిన తర్వాత ఈ ఏడాదే ఈ సినిమా ‘తెవర్’ పేరుతో హిందీలో అర్జున్ కపూర్ హీరోగా విడుదలైంది. అయితే అక్కడ అంత సక్సెస్ కాకపోవడం విశేషం. దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి 90లలో తను రూపొందించిన ’ఆహ్వానం’ సినిమానే ఇటీవల హాలీవుడ్‌కు పరిచయం చేశాడు. మరి క్రియేటివిటీకి పాతబడటం అనేది ఉండదు. అప్పటికప్పుడు అవి అందరి దృష్టినీ ఆకర్షించకపోయినా.. వాటి సౌరభం చెదరదు. సృజనాత్మకత అనేది టైమ్ పిరియడ్ లేకుండా తాజాగా ఉంటుంది. ఇలాంటి జాబితాలో ఇంకా ఎన్నో సినిమాలు ఉండొచ్చు. భవిష్యత్తులో కూడా ఎక్కడో ఎప్పుడో వచ్చిన సినిమాలు ఏ నిర్మాతకో, దర్శకుడికో, హీరోకో నచ్చి మరో భాషలో రూపొందవచ్చు. నిస్సందేహంగా అది వాటి సృజనకారుల ఘనతే!