వెంకటేష్ ‘‘విక్టరీ’’ ఫార్ములా ‘రీమేక్’ !

బహుశా భారత సినీ చరిత్రలో ఏ హీరో కూడా ‘రీమేక్’ ప్రక్రియకు అతీతుడుకాకపోవచ్చు. ఒక భాషలో హిట్ అయిన సినిమాను రీమేక్ చేయకుండా కెరీర్‌ను కొనసాగించిన వారు లేకపోవచ్చు. అయితే ఇలా ఒక సారి,…

బహుశా భారత సినీ చరిత్రలో ఏ హీరో కూడా ‘రీమేక్’ ప్రక్రియకు అతీతుడుకాకపోవచ్చు. ఒక భాషలో హిట్ అయిన సినిమాను రీమేక్ చేయకుండా కెరీర్‌ను కొనసాగించిన వారు లేకపోవచ్చు. అయితే ఇలా ఒక సారి, ఒక భాషలో ఆదరణపొందిన సినిమాను ఎంతో ఇష్టంతో రీమేక్ చేసే హీరోల్లో కొందరు హీరోలు మాత్రం చాలా ప్రత్యేకం. వీరి కళ్లు తమ సినీ పరిశ్రమ కన్నా పక్క సినీపరిశ్రమల మీదే ఎక్కువగా ఉంటాయి. అక్కడేం సినిమాలు వస్తున్నాయి.. ఏవీ హిట్ అయ్యాయి.. వేటిని రీమేక్ చేయవచ్చు.. అనేదాని గురించే వీరి ఆలోచనలు సుడుల్లాతిరుగుతూ ఉండవచ్చు. 

ఇలాంటి వారిలో ఒకరు దగ్గుబాటి వెంకటేష్. తెలుగులో ఫ్యాబ్ ఫోర్‌గా పేరు గాంచిన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున లతర్వాతి స్థానంలో ఉన్న వెంకీ తనకంటూ ప్రత్యేక అభిమానగణాన్ని కలిగిన హీరో. తనకంటూ ప్రత్యేక మార్కెట్‌ను కలిగిన వ్యక్తి. వెంకీ ప్రత్యేకతలు ఇంకా ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి సినిమాలను రీమేక్ చేయడం. హిందీలో అనిల్ కపూర్, గోవిందా, తమిళంలో విజయ్ వంటి హీరోలు ఎక్కువగా రీమేక్‌ల మీద దృష్టిసారిస్తూ ఉంటారు. తెలుగులో ఆ బాధ్యత వెంకీ తీసుకొన్నాడు.

ఎంతలా అంటే.. వెంకీ కెరీర్‌లో ఇప్పటి వరకూ దాదాపు డ్బ్బై సినిమాలు చేస్తే.. వాటిల్లో ముప్పై సినిమాలు రీమేక్ సబ్జెక్టులే! అంటే సగానికి కొంచెం తక్కువ. తాజాగా వెంకీ మలయాళ సినిమా ‘భాస్కర్ ది రాస్కెల్’ను రీమేక్ చేసేఆలోచనలో ఉన్నట్టుగా వార్తలొస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఈ తెలుగుస్టార్ హీరో ఇంత వరకూ రీమేక్ చేసిన సినిమాల వైపు ఒక లుక్కేయొచ్చు.

వెంకీ లాస్ట్ సినిమా దగ్గర నుంచి ఫస్ట్ సినిమా వైపుగా పరిశీలిస్తూ పోతే… ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన సినిమా ‘‘గోపాలా గోపాలా’’ దీంట్లో పవన్ కల్యాణ్‌తో కలిసి నటించాడు వెంకీ. ఈ సినిమా హిందీలో వచ్చిన ‘‘ఓహ్ మై గాడ్’’కు రీమేక్ అనివేరేచెప్పనక్కర్లేదు. హిందీలో పరేష్ రావల్ చేసిన పాత్రనే తెలుగులో వెంకీ చేశాడు. అంతకు ముందు దగ్గుబాటి వారబ్బాయి నటించిన ‘‘దృశ్యం’’ వచ్చింది. అది మళయాల ‘‘దృశ్యం’’కు రీమేక్. మోహన్ లాల్ హీరోగా వచ్చి సంచలన విజయం సాధించిన ఆ సినిమాను వెంకీ ఎంతో ఇష్టపడి రీమేక్ చేశాడు. దానికన్నా ముందు ‘‘మసాలా’’ ఇలాంటి మసాలా సబ్జెక్టులో తెలుగులో ఆల్రెడీ వచ్చినా.. హిందీలో హిట్ అయిన ‘‘బోల్ బచ్చన్’’ వెంకీ ఆధ్వర్యంలో రీమేక్ అయ్యింది. అయితే ఈ సినిమా తెలుగు అంతగా ఆడలేదు.

వీటికన్నా ముందు ‘‘బాడీగార్డ్’’ ఇది కూడా మళయాలం అయినంత హిట్ కాలేదు. అక్కడ దిలీప్ నటించిన ఈ సినిమా తెలుగులో వెంకీకి చేదు అనుభవాన్ని మిగిల్చింది. మధ్యలో ఏవైనా ఒకటీ రెండు స్ర్టైట్ సినిమాలు చేశాడు. వాటికన్నా ముందు కన్నడలో వచ్చిన ‘‘ఆప్తరక్షక’’ను ‘‘నాగవల్లి’’ గారీమేక్ చేశారు వెంకటేశ్. ఇది కూడా తెలుగులో సానుకూల ఫలితాన్ని ఇవ్వలేదు.

హిందీలో సూపర్ హిట్ అయిన ‘‘ఏ వెన్స్ డే’’ను కమల్ రీమేక్ చేశాడు. దీంట్లో తెలుగు వెర్షన్ కోసం వెంకీకి ఒక ముఖ్యపాత్రను ఇచ్చాడు యూనివర్సల్ స్టార్. తమిళ, మళయాల వెర్షన్ లలో వెంకీ చేసిన పాత్రను మోహన్ లాల్ చేశాడు. వెంకీ అంతకు ముందు చేసిన’’ ‘‘ఆడవారి మాటలకు అర్థాలు వేరులే’’ సినిమా కూడా అదే సమయంలో తమిళంలో రూపొందింది. ధనుష్ హీరోగా నటించిన సినిమా అది. 

‘‘భాస్కర్ ది రాస్కెల్’’ తోనే కాదు ఇంతకు ముందే మమ్ముట్టీ సినిమాను ఒకదాన్ని రీమేక్ చేశాడు వెంకీ. అదే ‘‘సంక్రాంతి’’. తమిళంలో మమ్ముట్టీ ప్రధానపాత్రలో రూపొందిన ఒకసినిమాకురీమేక్ గా తెలుగులో సంక్రాంతి వచ్చింది. కేవలం ఫ్యామిలీసబ్జెక్టులే కాక ‘‘ఘర్షణ’’ వంటి యాక్షన్ మూవీస్‌లో కూడా నటించాడు వెంకీ. అయితే అది కూడా రీమేక్ సినిమానే. తమిళంలో సూర్య హీరోగా వచ్చిన సినిమాకు రీమేక్‌గా తెలుగులో ఘర్షణ వచ్చింది. అంతకన్నా ముందు వెంకీ రీమేక్ చేసింది ‘‘వసంతం’’ సినిమాను. తమిళంలో మాధవన్ హీరోగా వచ్చిన ఈ క్రికెట్ రిలేటెడ్ సినిమాను వెంకీరీమేక్ చేశాడు. 

విక్రమ్ నటించగా తమిళంలో వచ్చిన సూపర్ హిట్ సినిమా ‘‘జెమిని’’. దాన్ని అదేపేరుతో రీమేక్ చేశాడు వెంకీ. అయితే ఇది తెలుగులో డిజాస్టర్ అయ్యింది. మ్యూజికల్ హిట్ గానిలిచిన ‘‘శీను’’ సినిమా కూడా తమిళ సినిమాకు రీమేకే. తమిళంలో కార్తీక్, రోజాలు జతగా నటించగా సూపర్ హిట్ అయిన సినిమానే తెలుగులో వెంకీ, సౌందర్యల కాంబినేషన్ లో ‘‘రాజా’’గా రీమేక్ అయ్యింది. 

శరత్ కుమార్ నటించిన ఎమోషనల్ ఫ్యామిలీ బాండేజీతో వచ్చిన సినిమానే వెంకీ ద్విపాత్రాభినయం చేయగా ‘‘సూర్యవంశం’’గా రీమేక్ అయ్యింది.

తమిళ నట, దర్శకుడు భాగ్యరాజ్ చేసే సబ్జెక్టులు అయితే వెంకీకి భలే సెట్ అవుతాయి. భాగ్యరాజ్ సినిమాలను అనేక మంది తెలుగు హీరోలు రీమేక్ చేయగా వెంకీ కూడా వాటిపై ఓ చూపు చూశారు. సుందరకాండ, అబ్బాయిగారు, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు.. ఈ మూడు సినిమాలూ భాగ్యరాజ్ కథ, కథనాలతో రూపొందినవే. 

వెంకీ హిందీలో కూడా రెండు మూడు సినిమాలను చేశాడు. వాటిలో రెండు సినిమాలు రీమేక్ లే. తెలుగులో హిట్ అయిన ‘‘చంటి’’ని హిందీలో ‘‘అనారీ’’గా రీమేక్ చేశారు. దీని అసలు వెర్షన్ హీరో ప్రభు. తమిళంలో ప్రభు హీరోగా వచ్చిన ‘‘చిన్నతంబి’’ సినిమాను వెంకీ రెండు భాషల్లో రీమేక్ చేశాడు. ఇక తెలుగులో సూపర్ హిట్ అయిన ‘‘యమలీల’’ను కూడా వెంకీ హిందీలో ‘‘తఖ్ దీర్ వాలా’’గా రీమేక్ చేశాడు. 

హిందీలో రీమేక్ సినిమాలు చేయడమే కాదు.. హిందీలో హిట్ అయిన సినిమాలను కూడా వెంకీ రీమేక్ చేశాడు. ‘‘పోకిరిరాజా’’ ‘‘టూటౌన్ రౌడీ’’ ‘‘త్రిమూర్తులు’’ ‘‘భారతంలో అర్జునుడు’’ వంటిసినిమాలు అన్నీ హిందీలో హిట్ అయిన సబ్జెక్టులకు రీమేక్‌లుగా వచ్చినవే. ఇంకా కొండపల్లిరాజా, బ్రహ్మపుత్రుడు వంటిసినిమాలు కూడా రీమేక్ సబ్జెక్టులే. తమిళంలో విజయ్ కాంత్ నటించగా సూపర్ హిట్ అయిన ‘‘చినగౌండర్’’ నే వెంకీ ‘‘చిన్నరాయుడు’’ గా రీమేక్ చేశాడు. 

వెంకీ చేసిన రీమేక్ సినిమాల్లో చాలా వరకూహిట్ అయ్యాయి. మరికొన్ని ప్లాఫ్ అయ్యాయి. స్ర్టైట్ సినిమాలతో కూడా సూపర్ హిట్లను కలిగిన ఈ హీరోకు రీమేక్ సినిమాలు మిశ్రమానుభూతిని ఇచ్చాయి. ఇతర టాప్ హీరోలతో పోలిస్తే వెంకీ రీమేక్‌లకు చాలాప్రాధాన్యతనే ఇచ్చాడు. చాలా ధైర్యంగా వ్యవహరించాడు. ఇప్పటికీ అదే తీరునే కొనసాగిస్తున్నాడు. మరి పరాయి భాషల్లో హిట్ అయిన సినిమాలను రీమేక్ చేసి వాటిని మనకు పరిచయం చేసినందుకు వెంకీకి తెలుగు ప్రేక్షకుల కృతజ్ఞులుగా ఉండాల్సిందే కదా!