యూదుహంతకులు మిగల్లేదు..

హిట్లర్‌ రోజుల్లో యూదులను హింసించి మట్టుపెట్టడానికి గెస్టపోలోనే 'ఎస్‌ఎస్‌' అనే రహస్యసంస్థను ఏర్పరచాడు. యుద్ధం ఆఖరిథలో వుండగా, జర్మనీ ఓటమి ఖాయం అని గ్రహించిన ఆ సంస్థ ప్రముఖులందరూ యూదుల దగ్గర్నుంచి కొట్టేసిన బంగారాలతో,…

హిట్లర్‌ రోజుల్లో యూదులను హింసించి మట్టుపెట్టడానికి గెస్టపోలోనే 'ఎస్‌ఎస్‌' అనే రహస్యసంస్థను ఏర్పరచాడు. యుద్ధం ఆఖరిథలో వుండగా, జర్మనీ ఓటమి ఖాయం అని గ్రహించిన ఆ సంస్థ ప్రముఖులందరూ యూదుల దగ్గర్నుంచి కొట్టేసిన బంగారాలతో, వజ్రాలతో జర్మనీ విడిచి పారిపోయారు. దక్షిణ అమెరికా దేశాలను పాలిస్తున్న సైనిక నియంతలకు ఆ బంగారంలో వాటా యిచ్చి ఆశ్రయం పొందారు. అక్కడ మారుపేర్లతో అనామకంగా బతుకసాగారు. యుద్ధానంతరం యూదు రాజ్యమైన ఇజ్రాయేలు ఏర్పడిన తర్వాత వాళ్ల గూఢచారులు యీ యూదుహంతకులను వెతికి, వెంటాడి, వేటాడి, ఇజ్రాయేలు తీసుకుని వచ్చి యుద్ధనేరాలకై శిక్షించసాగారు. ఇజ్రాయేలు గూఢచారుల కళ్లు కప్పడానికి చాలామంది తమ చావును తామే నిర్వహించుకునేవారు. ఏదో అనాథ శవాన్ని తగలబెట్టి, అదే ఫలానావాడి శవం అని వార్తలు పుట్టించి, ఇజ్రాయేలు గూఢచారుల దృష్టి మరలించేవారు. సద్దు మణిగాక మారుపేర్లతో జర్మనీలోకి వచ్చేసిన ఎస్‌ఎస్‌ సభ్యులు కూడా వున్నారు. ఈ అంశంపై ఫ్రెడరిక్‌ ఫోర్సిత్‌ ''ఒడెస్సా ఫైల్‌'' నవల రాశాడు. ఇలాటి యూదుహంతకులను వెతికి పట్టుకునే ఏకైక లక్ష్యంతో ఇజ్రాయేల్‌లో సైమన్‌ వైసెంథాల్‌ సెంటర్‌ ఏర్పడి వాళ్ల జాబితా మేన్‌టేన్‌ చేస్తోంది. ఉత్తుత్తి చావుల గురించి వార్తలు వచ్చినపుడు వాటిని నమ్మకుండా తాము స్వయంగా నిర్ధారించుకునేదాకా జాబితాలో పేరు వుంచుతోంది. ఏళ్లు గడుస్తున్నకొద్దీ ఎస్‌ఎస్‌ ఆఫీసర్లు దొరకడమో, చనిపోవడమో జరిగి జాబితా తగ్గుతూ వచ్చింది. యూదు మారణహోమానికి మాస్టర్‌మైండ్‌ అనదగిన ఎడాల్ఫ్‌ ఐష్‌మన్‌కు కుడిభుజంగా వ్యవహరించిన ఎలోయిస్‌ బ్రన్నర్‌ పేరు యిప్పటిదాకా ఆ జాబితాలో వుంది. గతవారమే అతని పేరు తీసేశారు. 

ఆస్ట్రియాలో పుట్టిన బ్రన్నర్‌ ఎస్‌ఎస్‌లో ఆఫీసరుగా పనిచేశాడు. 1,25,500 మంది యూదులను కాన్సన్‌ట్రేషన్‌ క్యాంపులకు తరలించిన ఘనుడు యితనే. యుద్ధం ముగియబోతూండగా జర్మనీ నుంచి ఈజిప్టుకు పారిపోయి అక్కణ్నుంచి 1954లో సిరియాకు వచ్చి తలదాచుకున్నాడు. ఇజ్రాయేలుపై ఆగ్రహంతో వున్న సిరియా యితనికి డమాస్కస్‌లో మారుపేరుతో ఆశ్రయం కల్పించింది. ప్రస్తుత సిరియా అధ్యకక్షుడి తండ్రి, అప్పటి అధ్యకక్షుడు అయిన హఫీజ్‌ అసాద్‌ అతన్ని టెర్రరిజం, సెక్యూరిటీ సలహాదారుడిగా అతనికి ఉద్యోగం యిచ్చాడు. అదే సమయంలో ఫ్రాన్సులో బ్రన్నర్‌ యుద్ధనేరాలపై అతని గైరుహాజరీలోనే విచారణ జరిగి మరణశిక్ష విధించారు. కానీ అతను దొరకలేదు. అతని ఆచూకీని కనిపెట్టిన ఇజ్రాయేలు గూఢచారులు సిరియాలోకి చొరబడలేక ఉత్తరాల ద్వారా బాంబులు పంపించారు. ఇలా రెండుసార్లు జరిగింది. ఈ బాంబులు పేలడంతో అతనికి ఒక కన్ను, కొన్ని వేళ్లు పోయాయి తప్ప ప్రాణాపాయం జరగలేదు. 

అతని బాస్‌ ఐష్‌మన్‌ అర్జెంటీనాలో 1960లో యూదు గూఢచారులకు పట్టుబడ్డాడు. అతన్ని ఇజ్రాయేలు తీసుకెళ్లి బహిరంగంగా ఉరి తీశారు. అందువలన బ్రన్నర్‌ మరింత జాగ్రత్తగా వున్నాడు. ఇజ్రాయేలు గూఢచారులు ఎంత ప్రయత్నించినా దొరకలేదు. 2003లో డమాస్కస్‌లో ఒక హోటల్లో అతను ఆఖరిసారి కనబడ్డాడని గూఢచారుల వద్ద సమాచారం వుంది. ఆ తర్వాత 2009లో సిరియాలోనే చనిపోయాడని, జర్మన్‌ గూఢచారులు వైసెంథాల్‌ సెంటర్‌కు తెలియపరిచారు. పట్టుబడవలసిన యుద్ధనేరస్తుల  జాబితాలోంచి అతని పేరు కొట్టేయాలంటే అతని శవాన్ని బయటకు తీసి పరీక్షలు నిర్వహించి నిర్ధారించుకోవాలి. కానీ సిరియాలో అంతర్యుద్ధం వచ్చింది కాబట్టి అది వీలుపడడం లేదు. ఏది ఏమైనా అతను బతికి వుంటే 102 ఏళ్ల వయసుండాలి కాబట్టి, యిప్పటిదాకా బతికి వుండడం అసాధ్యం కాబట్టి జర్మన్‌ సమాచారాన్ని విశ్వసించి జాబితాలోంచి పేరు కొట్టేయడానికి సెంటర్‌ నిశ్చయించుకుంది. దీనితో యిక పట్టుకోవలసిన నాజీలెవరూ మిగలలేదు.

-ఎమ్బీయస్‌ ప్రసాద్

[email protected]