ఫార్మా సిటీ, ఫిల్మ్‌ సిటీ

ఫార్మాసిటీ, ఫిలిం సిటీలకై చెరో రెండువేల ఎకరాలు యిస్తానంటున్నారు కెసియార్‌. హైదరాబాదులో యిప్పటికే చాలా ఫార్మా కంపెనీలున్నాయి. పారిశ్రామిక వ్యర్థాలను తొలగించే విషయంలో అవి నియమాలు పాటించటం లేదని, కాలుష్యాన్ని పెంచుతున్నాయని ఆరోపణలు కూడా…

ఫార్మాసిటీ, ఫిలిం సిటీలకై చెరో రెండువేల ఎకరాలు యిస్తానంటున్నారు కెసియార్‌. హైదరాబాదులో యిప్పటికే చాలా ఫార్మా కంపెనీలున్నాయి. పారిశ్రామిక వ్యర్థాలను తొలగించే విషయంలో అవి నియమాలు పాటించటం లేదని, కాలుష్యాన్ని పెంచుతున్నాయని ఆరోపణలు కూడా వున్నాయి. ఫార్మా సిటీని ప్రత్యేకంగా ఔషధ కంపెనీల కోసమే కడుతున్నారు కాబట్టి కాలుష్యనివారణకు ఏర్పాట్లన్నీ చేసి, తమ ఫ్యాక్టరీలను అక్కడకు తరలించాలని సిటీలో వున్న సంస్థలకు చెప్తారో లేక కొత్తగా కంపెనీలు వస్తాయో తెలియదు. ఏది ఏమైనా కాలుష్యనివారణ అనేది ఖర్చుతో కూడుకున్న పని. ఆ ఖర్చులు భరించలేకనే కంపెనీలు చాటుమాటుగా తమ వ్యర్థాలను అక్కడా యిక్కడా పారేస్తూంటారు. ఫార్మాసిటీలో ఆ ఏర్పాట్ల  ఖర్చు ప్రభుత్వం భరించి దాన్ని భూమి ధరకు జోడిస్తే, అక్కడ స్థలం కొనడానికి పరిశ్రమలు వెనకాడతాయి. అక్కడకి మార్చేబదులు యిలాటి నిబంధనలు పెట్టని రాష్ట్రాలకు తరలివెళితే మంచిదనుకుంటాయి. ఒకవేళ పెట్టినా, పన్ను రాయితీలు యిచ్చేవైతే కొంతలో కొంత కలిసి వస్తుంది కదా అనుకుంటాయి. వీళ్లని ఆకర్షించడానికి ఆంధ్ర రాష్ట్రం ప్రయత్నిస్తోంది. సముద్రమార్గం ద్వారా ఎగుమతులు చేసుకోవడానికి అక్కడ సౌకర్యం మెరుగ్గా వుంది. విభజన సమయంలో పన్నుల విషయంలో, ప్రత్యేకహోదా విషయంలో ఆంధ్రకు తను యిచ్చిన హామీని కేంద్రం నిలబెట్టుకుంటే యీ పరిశ్రమలు అక్కడకు తరలి వెళ్లాలని చూస్తాయి. అప్పుడు ఫార్మా సిటీకి పెద్దగా డిమాండ్‌ వుండదు కానీ పర్యావరణ రక్షణ విషయంలో తెలంగాణ లాభపడుతుంది. 

ఇక ఫిల్మ్‌ సిటీకి రెండువేల ఎకరాలు ఎందుకిస్తున్నారో తెలియటం లేదు. సినిమా పరిశ్రమ కూడా అడగనంత స్థలం అది. సినిమావాళ్లకు కావలసినది ఔట్‌డోర్‌ షూటింగు జరుపుకునేందుకు అనుమతులు, రాయితీలు, సినిమాలు విడుదల చేసుకునేందుకు హాళ్లు, వినోదపు పన్ను తగ్గించడాలు. స్టూడియోలకు స్థలాల గురించి ఎవరూ అడగటం లేదు. ఎందుకంటే నగరంలో వున్న స్టూడియోలకే పూర్తిగా పని లేదు. అన్ని రకాల హంగులతో రామోజీ ఫిల్మ్‌ సిటీ వుంది కానీ దానికీ పూర్తి బిజినెస్‌ లేదు. దానికి కొద్ది దూరంలోనే కొత్త ఫిల్మ్‌సిటీ కడతామంటున్నారు. ఇప్పుడు సినిమా నిర్మాణంలో చాలా టెక్నిక్కులు వచ్చేశాయి. కెమెరాల సైజు తగ్గిపోయింది. మామూలు యిళ్లల్లోనే సినిమాలు తీసేస్తున్నారు. జూబిలీ హిల్స్‌లో పెరడు బాగా వున్న బంగళా ఓ నెల్లాళ్లు అద్దెకు తీసుకుంటే చాలు, మొత్తం సినిమా అక్కడే లాగించేయవచ్చు. రెండుగదుల ఫ్లాటుంటే, ఆడియో రికార్డింగు స్టూడియో, గ్రాఫిక్స్‌ స్టూడియో పెట్టేయవచ్చు. పార్కుల్లో టీవీ సీరియల్స్‌, షార్ట్‌ ఫిలిమ్స్‌ తీసేస్తున్నారు. బజెట్‌ సినిమాలన్నీ యిలాగే తయారవుతుంటే, పెద్ద హీరోల సినిమాలు విదేశాల్లో తీస్తున్నారు. స్టూడియో అద్దెల కంటె విదేశీవిమానయానం చౌకగా వుంది. చాలా దేశాల్లో షూటింగు అనుమతుల గోల తక్కువ. తెల్లతోలు అమ్మాయిలు పుష్కలంగా దొరుకుతారు. ఈ పరిస్థితుల్లో స్టూడియోకు వచ్చే నిర్మాతలు ఎందరు? అందుకే అనేక స్టూడియోలు నష్టాల్లో నడుస్తున్నాయి. వాటిని కమ్మర్షియల్‌ కాంప్లెక్సులుగా మారుద్దామని చూస్తున్నారు. ఇప్పుడు యీ ఫిల్మ్‌ సిటీలో ఎవరైనా స్టూడియోలు కడతారా అన్నది సందేహమే. 

కొత్త రాష్ట్రంలో కళలకు ఆదరణ ఏ స్థాయిలో సాగుతుందో కూడా తెలియటం లేదు. హైదరాబాదులోని ఇందిరా పార్కు ఎదుట వున్న ఎన్టీయార్‌ స్టేడియంలో కళాభవన్‌ కడతామని కెసియార్‌ ప్రకటించారు. ఎన్టీయార్‌ పేరు తీసేయడం తప్ప దీనిలో మరో లక్ష్యం కనబడటం లేదు. రవీంద్రభారతి వెనక వున్న కళాభవనే కళ తప్పింది. విభజన తర్వాత అసలు రవీంద్రభారతి, త్యాగరాయగానసభలే వారాంతాల్లో కూడా ఖాళీగా వుంటున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలు నీరసించాయి. వాటిని పెళ్లిళ్లకు, పుట్టినరోజు పండగలకు అద్దెకు తిప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పుడు రూ. 11 కోట్లతో కళాభవన్‌ కడితే ఆదరణ వుంటుందా? 2000 ఎకరాల ఫిల్మ్‌ సిటీని ఎలా నింపుతారు? సినిమావాళ్లకు యిళ్లు కట్టుకోవడానికి స్థలం యిస్తాం అంటే రాష్ట్రానికి ఆదాయం రాదు కదా. గతంలో కొండల్లో, బండల్లో యిచ్చిన స్థలాలు తీసుకుని యిళ్లు కట్టుకున్నాం, విమర్శల పాలయ్యాం, యిప్పుడు కొత్త చోట స్థలం తీసుకుని వివాదాల్లో యిరుక్కోవడం దేనికి అనుకుంటారు చిత్రప్రముఖులు. అధికారంలోకి రాగానే పద్మాలయా, అన్నపూర్ణా స్టూడియోల పనిపడతాం, స్టూడియో పేరు చెప్పి స్థలం చౌకగా పొంది కమ్మర్షియల్‌ కాంప్లెక్సులు కట్టిన రాఘవేంద్రరావు వంటి వాళ్లను దండిస్తాం అంటూ వచ్చిన తెరాస యిప్పుడు ఫిల్మ్‌ సిటీలో వాళ్లకే స్థలాలు యిస్తుందా? ఈ ఫార్మా సిటీ, ఫిలిం సిటీలపై ప్రభుత్వ ప్రణాళిక ఏమిటో వెల్లడిస్తే యిలాటి సందేహాలకు సమాధానం లభిస్తుంది. 

ఎమ్బీయస్‌ ప్రసాద్

[email protected]