జగన్ ప్రభుత్వానికి సొంత పార్టీ మనిషి తలనొప్పిగా తయారయ్యారు. ఏరికోరి నియమించుకున్న విక్టర్ ప్రసాద్ నిజాయతీగా పని చేయడం అధికార పార్టీకి గిట్టడం లేదు. ఎస్సీ కమిషన్ చైర్మన్‌గా విక్టర్ ప్రసాద్‌ను రాత్రికి రాత్రే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నియమించిన సంగతి తెలిసిందే. ఎస్సీ కమిషన్ చైర్మన్‌గా విక్టర్ ప్రసాద్‌ను నియమించాలని జగన్ నిర్ణయించుకున్న విషయం తెలిసి పార్టీలోని పలువురు దళిత నాయకులు అభ్యంతరం చెప్పారు.
అయితే తన నిర్ణయాన్నే తప్పు పట్టేంత పెద్దవాళ్లా మీరు అనే ధోరణితో జగన్…. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆర్డర్స్ ఇప్పించారు. దళిత సమస్యలపై విక్టర్ ప్రసాద్ సుదీర్ఘ కాలంగా పని చేస్తున్నారు. సామాన్యుడు. తన జాతి కోసం పని చేయాలనే తపన ఉన్న నాయకుడు. అన్నిటికి మించి పార్టీలో సీనియర్ నాయకుడు. దీంతో జగన్ సామాన్యుడిని అందలం ఎక్కించాలనే తపనతో విక్టర్ ప్రసాద్‌కు కీలకమైన ఎస్సీ కమిషన్ చైర్మన్ బాధ్యతలు అప్పగించారు.
దళితులపై దాడులకు పాల్పడిన నిందితులు ఎంతటి వారైనా విక్టర్ ప్రసాద్ చర్యలు తీసుకోడానికి వెనుకాడడం లేదు. ముఖ్యంగా పార్టీలు, రాజకీయాలకు అతీతంగా నిందితులపై చర్యలు తీసుకోవాలని పోలీస్ ఉన్నతాధికారులను విక్టర్ ప్రసాద్ ఆదేశిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిందితుల్లో ఎక్కువగా అధికార పార్టీ నేతలు, మద్దతుదారులు ఉండడం, సొంత పార్టీ వాళ్లపై కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని పోలీస్ ఉన్నతాధికారులపై విక్టర్ ప్రసాద్ ఒత్తిడి చేయడం అధికార పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారింది.
విక్టర్ ప్రసాద్ వ్యవహార శైలిపై ఇటు ఉన్నతాధికారులు, అటు వైసీపీ నాయకుల నుంచి పార్టీ, ప్రభుత్వ పెద్దలకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లినట్టు సమాచారం. రాజకీయంగా ఇబ్బందులు తలెత్తకుండా మహిళా కమిషన్‌లా జాగ్రత్తగా పట్టువిడుపులతో వ్యవహరించాలని సూచించినా విక్టర్ ప్రసాద్ వినిపించుకోలేదని సమాచారం. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లా పిఠాపురం మండలంలోని మల్లాం గ్రామంలో దళితులపై దాడిని ఆయన సీరియస్‌గా తీసుకున్నారు.
ఆ గ్రామానికి వెళ్లిన ఆయన నిందితులను కాపాడేలా వ్యవహరిస్తున్నారని పోలీస్ అధికారులపై ప్రజల సమక్షంలోనే ఆగ్రహం వ్యక్తం చేయడంతో మరోసారి విక్టర్ ప్రసాద్ వ్యవహారం చర్చకు వచ్చింది. దళితులపై దాడికి పాల్పడిన ఎంపీటీసీ సభ్యులతో పాటు మరో 22 మందిపై చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. అంతేకాదు, శుక్రవారం సాయంత్రం లోపు నిందితులపై కేసు నమోదు చేసి, ఎఫ్ఐఆర్ కాపీలను ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు మెయిల్ చేయాలని ఆదేశించారు.
ఎస్సీ కాలనీకి భారీగా వచ్చి దాడి చేస్తే పోలీసులు తప్పుగా కేసు నమోదు చేశారని ఆగ్రహించడం ద్వారా ప్రతిపక్షాలకు ఆయుధం ఇచ్చినట్టైంది. 22 మందిపై ఫిర్యాదు చేస్తే కేవలం ఆరుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులపై ఆయన మండిపడ్డారు. ఉద్యోగం చేయాలని లేదా? అని పిఠాపురం రూరల్ ఎస్ఐని విక్టర్ ప్రసాద్ నిలదీశారు. ఎస్సీ కమిషన్ చైర్మన్ మాటలకు నొచ్చుకున్న కాకినాడ డీఎస్పీ భీమారావు జోక్యం చేసుకుంటూ ప్రజల మధ్య మందలిస్తూ చులకన చేయొద్దని కోరారు.
ఏవైనా కేసుకు సంబంధించిన విషయాలు వుంటే చెప్పాలన్నారు. ఈ నేపథ్యంలో విక్టర్ ప్రసాద్‌పై ప్రభుత్వానికి ఉన్నతాధికారులు ఫిర్యాదు చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. చెబితే వినడు, తనకు తానుగా తెలుసుకోని విక్టర్ ప్రసాద్‌ను ఏం చేయాలో వైసీపీ ప్రభుత్వానికి దిక్కుతోచడం లేదన్నది వాస్తవం.