హైకోర్టు వెంటపడితే.. పనులు జరుగుతాయా?

ఒక ఊర్లో ఒక సుబ్బారావు ఉన్నాడు. సదరు సుబ్బారావు కొడుకు ఒక బాగా సంపన్నురాలైన అమ్మాయిని ప్రేమించాడు. పెళ్లికి ఆ అమ్మాయి ఓకే అన్నది గానీ.. మీ ఇంట్లో ఏసీ లేకపోతే నేను ఉండలేను…

ఒక ఊర్లో ఒక సుబ్బారావు ఉన్నాడు. సదరు సుబ్బారావు కొడుకు ఒక బాగా సంపన్నురాలైన అమ్మాయిని ప్రేమించాడు. పెళ్లికి ఆ అమ్మాయి ఓకే అన్నది గానీ.. మీ ఇంట్లో ఏసీ లేకపోతే నేను ఉండలేను అని కండిషన్ పెట్టింది. పాపం సుబ్బారావు ఒప్పుకున్నాడు. ఏసీ పెట్టిస్తాను అని మాటఇచ్చి, కొడుకు పెళ్లి చేశాడు. 

ఇంట్లో ఏసీ ఇంకా పెట్టలేదు.. కోడలు, ఉక్కపోతతో చాలా సతమతం అయిపోతోంది. ఈలోగా ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి. ఏసీ ఇంకా పెట్టనేలేదు.. మిగిలిన కుటుంబ సభ్యులు తాగునీటికి, తినే తిండికి కూడా దిక్కులేక హైరానా పడుతున్నారు. సుబ్బారావు ఉన్న కొద్ది డబ్బులతో వారికి తిండి, నీళ్లు ఏర్పాటు చేస్తున్నాడు. 

సదరు కోడలు తీర్పులు చెప్పే రాజుగారి దగ్గరకు వెళ్లింది. మామ మాట తప్పాడు అని చెప్పింది. ఒప్పందం నిజమే గనుక.. ఆమె కరెక్టని రాజుగారు చెప్పాడు. గంటలోగా ఏసీ పెట్టించితీరాల్సిందే అని రాజుగారు హెచ్చరించారు. సుబ్బరావు దగ్గర డబ్బుల్లేవు.. కొద్ది డబ్బులు వస్తోంటే.. మిగిలిన ఫ్యామిలీ తిండికోసం ఖర్చు పెడుతున్నాడు. ఏసీ పెట్టించడం కుదర్లేదు. కోడలు మళ్లీ రాజుగారి వద్దకు వెళ్లింది. ఆయనకు కోపం వచ్చింది. ‘ఖబడ్దార్.. మా మాటను ధిక్కరిస్తావా.. ఇతర ఖర్చులు మాత్రం బాగానే పెడుతున్నావ్.. మా ఆదేశం ప్రకారం ఏసీ  పెట్టడానికి మాత్రం డబ్బుల్లేవా..? సంజాయిషీ చెప్పాల్సిందే’ అంటూ గుడ్లురిమారు. 

పాపం సుబ్బారావు ఏం చేయాలి? సుబ్బారావు దగ్గర డబ్బుల్లేకపోతే రాజుగారు ఏం చేస్తారు?

ఇది కథ. ఏపీలో ప్రస్తుతం రాజకీయం కూడా ఈ కథ మాదిరిగానే ఉంది. అమరావతిలో మూడు నెలలు, ఆరునెలల్లోగా పనులు పూర్తిచేసేయాలని కోర్టు ఆదేశాలు ఇచ్చేసింది. కార్యాలయాలు ఏవీ అమరావతి ప్రాంతంనుంచి తరలించడానికి వీల్లేదని హుకుం జారీచేసింది. 

అయితే అమరావతిలో నిర్మాణాలు ఇంకా పూర్తి చేయలేదంటూ రైతులు మళ్లీ కోర్టుకు వెళ్లారు. కోర్టు ధిక్కరణ కేసు వేశారు. నిర్మాణ పనులు ప్రారంభించమంటే చేయలేదనేది పిటిషన్ సారాంశం. ఈ విషయంలో సంజాయిషీ చెప్పాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

ప్రభుత్వం పరిస్థితి పైన చెప్పుకున్న సుబ్బారావు మాదిరిగా ఉంది. రాష్ట్రం ఆర్థిక పరిస్థితి మొత్తం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికే కుదేలైపోయి ఉంది. కష్టమ్మీద వనరులను సమీకరించుకుంటూ పేదల అభ్యున్నతికి, సంక్షేమానికి ఖర్చు పెడుతున్నారు. మధ్యలో అమరావతి నగరం కడతారా లేదా అంటూ హూంకరించినంత మాత్రాన పనులు ఎలా జరుగుతాయి? 

వనరులు లేనప్పుడు ఎవరు మాత్రం ఏం చేయగలరు? వనరుల విషయంలో దావా వేసిన రైతులు గానీ, ఇతరులు గానీ ఎలాంటి పరిష్కారాలు సూచించగలరు. సలహాలు చెప్పగలరు? నిధుల విషయంలో సూచనచేయలేని వారు.. ఖర్చు పెట్టి తీరాల్సిందే అని చెప్పడం ఎలా సబబు అనిపించుకుంటుంది? ఇవన్నీ కూడా ప్రశ్నలే. అయినా ప్రస్తుతానికి ఈ కోర్టు ధిక్కరణ వ్యాజ్యం జులై 12 నాటికి వాయిదా వేసింది. ఈ రెండు నెలల వ్యవధిలో ఏమైనా జరగవచ్చు కూడా.