తన భార్యను ఏదో అన్నారని గుక్క పెట్టి ఏడ్చిన చంద్రబాబుకు, ప్రత్యర్థి మాతృమూర్తిని గౌరవించాలన్న ఇంగితం ఏమైందని వైసీపీ ప్రశ్నిస్తోంది. ఏ మాత్రం సమయం, సందర్భం లేకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తల్లి ప్రస్తావన తేవడంపై రాజకీయ విశ్లేషకులు, నెటిజన్లు తప్పు పడుతున్నారు. జగన్ తల్లి ప్రస్తావన తెచ్చిన చంద్రబాబుపై సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు తెర లేచింది.
విశాఖ జిల్లా భీమిలి మండలం తాళ్లవలసలో ‘బాదుడేబాదుడు’ లో చంద్రబాబు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ ‘మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్నాయి. మొన్న రేపల్లెలో, నిన్న విజయనగరంలో, అంతకు ముందు విజయవాడ ఆస్పత్రిలో.. ఇన్ని జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు చర్యలు చేపట్టలేకపోతోందో అర్థం కావడం లేదు. తాగిన మైకంలో అత్యాచారం చేశారంటూ హోం మంత్రి మాట్లాడడం దారుణం. తప్పు తల్లులదైతే జగన్మోహన్‌రెడ్డి తల్లిది తప్పు కాదా’ అని చంద్రబాబు నిలదీశారు. జగన్ తల్లిది తప్పు కాదా అని చంద్రబాబు ప్రశ్నించడంపై నెటిజన్లు సెటైర్స్‌తో విరుచుకు పడుతున్నారు.
ఔను జగన్ తల్లిది ముమ్మాటికీ తప్పే. విజయుడిని కన్న మాతృమూర్తి విజయమ్మది తప్పే. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని గొప్పలు చెప్పుకునే చంద్రబాబును ఘోరాతి ఘోరంగా మట్టి కరిపించే కొడుకున్న కన్న విజయమ్మది తప్పే. ఎన్నికల్లో గెలవలేని అసమర్థుడిని కనకపోవడం విజయమ్మది ముమ్మాటికీ తప్పే. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేని, దొడ్డిదారిలో మంత్రి అయిన అసమర్థుడికి జన్మ ఇవ్వకపోవడం విజయమ్మ చేసిన తప్పే.
పరాయి వాళ్లు పెట్టిన పార్టీని లాక్కునే దొంగను కనకపోవడం విజయమ్మది తప్పే. తిన్నింటి వాసాలను లెక్క పెట్టి, ఆదరించిన మామకే వెన్నుపోటు పొడిచే వ్యక్తిత్వం కలిగిన కొడుకుని కనకపోవడం విజయమ్మది తప్పే. తండ్రిపై రక్తం పంచుకు పుట్టిన బిడ్డల్నే తిరుగుబాటు చేసే కుట్రపూరిత మనస్తత్వం కలిగిన కుమారుడికి జన్మనివ్వకపోవడం విజయమ్మ చేసిన నేరమే. తోడల్లుడిని, బామ్మర్దిని కరివేపాకులా వాడుకునే బుద్ధి కలిగిన కుమారుడికి జన్మనివ్వకపోవడం విజయమ్మది తప్పే. పార్టీని సొంతంగా స్థాపించి, వేలాది కిలోమీటర్లు పాదయాత్ర చేసి, విశేష ప్రజాదరణ చూరగొన్న కొడుకును కన్న విజయమ్మది తప్పు కాకుండా మరేమవుతుంది?
గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో అసెంబ్లీ, లోక్‌సభ సీట్లను గెలుపొందేంతగా ప్రజాభిమానాన్ని చూరగొన్న మాతృమూర్తి విజయమ్మది తప్పు అంటే అది చాలా చిన్న మాటే అవుతుంది. ఒక్కడిగా ఎదుర్కోవడం సాధ్యం కాదని, అంతా కట్ట కట్టుకుని వెళితే తప్ప ఓడించడం సాధ్యం కానంత బలమైన కొడుకుని కన్న విజయమ్మది తప్పు కాకుండా మరేమవుతుంది? ప్రత్యర్థులు సైతం ఇలాంటి కొడుకు మాకుంటే ఎంత బాగుండో అనే ఆలోచన కలిగేంత పరాక్రమవంతుడ్ని కన్న విజయమ్మది తప్పు కాకుండా ఏమవుతుంది.
పాలనలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టి, ప్రత్యర్థులకు భవిష్యత్ లేకుండా చేస్తారనే వణుకు పుట్టించిన ధీరుడిని, విజయుడిని కన్న విజయమ్మది ముమ్మాటికీ తప్పు అని చెప్పక తప్పదు.
సొదుం రమణ