నటీనటుల పోరు… జనాలకు ఉచిత వినోదం!

పేరుకు తమిళులే కానీ.. వాళ్లలో ఎవరూ తెలుగు వాళ్లకు కొత్త వాళ్లు కాదు. డబ్బింగ్ సినిమాలతో.. అనేక స్ర్టైట్ తెలుగు సినిమాలతో వీరు తెలుగు వాళ్లకు సుపరిచయస్తులే. ఇలాంటి తమిళనటుల మధ్య ఇప్పుడు ఆసక్తికరమైన…

పేరుకు తమిళులే కానీ.. వాళ్లలో ఎవరూ తెలుగు వాళ్లకు కొత్త వాళ్లు కాదు. డబ్బింగ్ సినిమాలతో.. అనేక స్ర్టైట్ తెలుగు సినిమాలతో వీరు తెలుగు వాళ్లకు సుపరిచయస్తులే. ఇలాంటి తమిళనటుల మధ్య ఇప్పుడు ఆసక్తికరమైన పోరు సాగుతోంది. నడిగర్ సంఘం ఎన్నికల్లో తమిళ నటీనటులు అమితుమి తేల్చుకోవడానికి సిద్ధం అవుతున్నారు. ప్రధానంగా రెండు వర్గాలుగా విడిపోయి వారిలో  వారు పోరాడుతున్నారు. మీడియాకు ఎక్కడి సవాళ్లూ, ప్రతిసవాళ్లు చేసుకొంటున్నారు. తాము మంచి వాళ్లు అంటే తామే మంచి వాళ్లు అని చెప్పుకొంటున్నారు. 

పాత, కొత్త విషయాలను  తవ్వుకొంటూ.. తమిళ నటీనటులకు తాము ఎన్నెన్ని సేవలు చేశామో వివరించుకుంటున్నారు. ఇక్కడ రెండు వర్గాల్లో ఒకదానికి సీనియర్ నటుడు శరత్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తుండగా, మరో వర్గానికి విశాల్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఒకరు వెటరన్ మరొకరు యువకుడు. దీంతో ఈ రెండు వర్గాల మధ్య పోరాటం ఆసక్తికరంగా మారింది. ఈ పోరాటంలో ఇరు వర్గాల వైపునా ప్రముఖ నటీనటులు ఉండటం వీరి పోరాటాన్ని మరింత ఆసక్తికరంగా మారుస్తోంది. వీరిలో శరత్ కుమార్ ప్రస్తుత నడిగర్ సంఘం అధ్యక్షుడిగా ఉన్నాడు. విశాల్ ఆ స్థానాన్ని దక్కించుకోవడం కోసం పోటీపడుతున్నాడు.

ఇప్పుడు తమిళనటులు మీడియాకు ఎక్కి ఒకరినొకరు విమర్శించుకొంటుండటమే ఆసక్తికరమైన అంశం. సాధారణంగా అంతా ఒకటిగా కనిపించే వాళ్లంతా ఇప్పుడు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితం తెలుగు నాట మా అధ్యక్షపీఠం ఎన్నికల కోసం జరిగిన పోరాటంలో నటీనటులు ఒకర్నొకరు విమర్శించుకున్న తీరును గుర్తు చేస్తున్నారు తమిళనటీనటులు. ఇక్కడ మురళీమోహన్ బ్యాచ్ తరపున జయసుధ, మరో వర్గంగా రాజేంద్ర ప్రసాద్ లు బరిలోకి దిగడం… ఎన్నడూ లేనంత స్థాయిలో మా అధ్యక్ష పీఠానికి  ఎన్నికలు ఉత్కంఠభరితంగా సాగాయి. ప్రత్యేకించి ఒక వర్గానికి ధనబలమున్న మురళీమోహన్ అండదండలు ఉండటం.. నటీనటులు ఒకొర్నొకరు విమర్శించుకోవడాలు మా ఎన్నికల్లో హైలెట్ అయ్యాయి. 

చివరకు ఆ ఎన్నికల్లో రాజేంద్ర ప్రసాద్ వర్గం విజయం సాధించడం చివరి హైలెట్ అయ్యింది.  విజయం ఖాయమనుకున్న మురళీ మోహన్ వర్గం మొహమాడ్చుకోవాల్సి వచ్చింది. మా ఎన్నికలు అప్పట్లో సామాన్య జనాలకు ఎంతో వినోదాన్ని ఇచ్చాయి. తమకు తెరపై పరిచితులైన స్టార్టు అలాంటి ఎన్నికల్లో తలపడటం.. వారందరూ ఒకర్నొకరు విమర్శించుకోవడాన్ని సామాన్యులు ఎంజాయ్ చేశారు. తమకు ఏ మాత్రం సబంధం లేని ఎన్నికలే అయినా… సామాన్యులు కూడా ఆ ఎన్నికల తీరును ఆసక్తిగా గమనించారు. ఆ ఎన్నికల్లో మురళీమోహన్ ప్యానల్ ఓడిపోవడాన్ని, రాజేంద్రుడి విజయాన్ని కూడా ఆస్వాధించడాన్ని మరవలేం.

మరి ఇప్పుడు తమిళ నటీనటుల మధ్య పోటీ కూడా ఇంతే ఆసక్తికరంగా ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా నడిగర్ సంఘంపై తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాడు శరత్ కుమార్. మూడేళ్ల పదవీ కాలంతో ఆయన వరసగా టర్మ్‌ల కొద్దీ ఈ పదవిని చేపడుతూ వస్తున్నాడు. అంతే కాదు… చాలా కాలం నుంచి నడిగర్ సంఘం విషయంలో శరత్ కుమార్ సంబంధీకుల ఆధిపత్యమే ఉండటం విశేషం. అదెంతగానంటే… శరత్ కుమార్ భార్య రాధిక తండ్రి ఎమ్.ఆర్. రాధా ఈ సంఘం ఆవిర్భావ సమయంలో కీలక పాత్ర పోషించారు. రాధా తనయుడు రాధా రవి నడిగర్ సంఘం సెక్రటరీగా చాలా కాలం వ్యవహరిస్తున్నాడు. 

ఇక శరత్ కుమార్ వరసగా అధ్యక్ష పోస్టును అలంకరిస్తున్నాడు. 1952లో ఏర్పాటైన నడిగర్ సంఘాన్ని అధికారికంగా సౌతిండియన్ ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంటారు. దీని ఏర్పాటు విషయంలో తమిళ లెజెండరీ హీరోలతో పాటు ఎన్టీఆర్ కూడా కీలక పాత్ర పోషించారు. అప్పటికి తెలుగు సినిమా ఇంకా మద్రాస్ వేదికగానే ఉండటంతో తెలుగు నటుల ప్రమేయం ఉండింది. నటీనటుల సంఘానికి సౌతిండియన్ ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనే పేరు రావడానికి కూడా అదే కారణం. అయితే తెలుగు సినిమా పూర్తిగా హైదాబాద్ వచ్చేయడంతో దాంట్లో తెలుగువాళ్ల ప్రమేయం లేకుండా పోయింది. పేరు మాత్రం అలాగే ఉండిపోయింది. 

నడిగర్ సంఘానికి సంబంధించి అనేక  వివాదాలున్నాయి. తమిళనాడులో ఇది కేవలం సినిమా వాళ్లకు సంబంధించిన సంఘంగా కాకుండా.. వివిధ వ్యవహారాల్లో వేలు పెడుతూ ఉంటుంది. పక్క రాష్ట్రాలతో తమిళనాడుకు విబేధాలు వచ్చిన సమయంలోనూ… ఈ సంఘం స్పందించింది. అయితే.. రాష్ర్టం తరపున పోరాడే వీళ్లకు అంతర్గతంగా మాత్రం యూనిటీ లేదు. సంఘం అధ్యక్ష స్థానం విషయంలో అనేక సార్లు బహిరంగ విమర్శలకు వీళ్లు వెనుకాడలేదు. ఇప్పుడు జరుగుతున్నట్టుగానే ఎన్నో సార్లు జరిగింది. నడిగర్ సంఘం ప్రెసిడెంట్ గా విజయ్ కాంత్ ఉండటంపై ఆ మధ్య విమర్శలు వచ్చాయి. 

అప్పటికి విజయ్ కాంత్  కొత్తగా రాజకీయ పారీ పెట్టుకున్న నేపథ్యంలో ఆయనకు నడిగర్ సంఘానికి అధ్యక్షుడిగా ఉండే అరత లేదని.. రాజకీయాల్లోకి వెళ్లిన వ్యక్తికి ఆ పదవిలో ఉండే అరత లేదని విమర్శలు వచ్చాయి. తెలుగునాట మురళీమోహన్ వంటి వ్యక్తి తెలుగుదేశంలో క్రియాశీలకంగా ఉంటూ కూడా మా అధ్యక్ష పదవిలో ఉన్నా.. తమిళనాడులో మాత్రం అలాంటి ఆటలు చెల్లలేదు. స్టార్ హీరో అయినా విజయ్ కాంత్ తన పదవిని నిలుపులేకపోయాడు.  ఆయన రాజీనామా చేయడంతో తాత్కాలికంగా ఎస్వీ శేఖర్‌ను సంఘానికి అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికలతో శరత్ కుమార్ అధ్యాయం మొదలైంది. అయితే శరత్ కుమార్ కూడా రాజకీయ నాయకుడే!

ఈయనకూ ఒక పార్టీ ఉంది. ప్రస్తుతం శరత్ ఎమ్మెల్యే హోదాలో కూడా ఉన్నాడు! అయితే… ఆయన మాత్రం సంఘం అధ్యక్ష పదవిలో దర్జాగా కొనసాగుతున్నాడు. విజయ్ కాంత్‌కు అయితే ఒక న్యాయం.. శరత్ కుమార్ మాత్రం ప్రత్యేకమా? అనే విమర్శలు వస్తున్నాయి. అయితే అదే విజయ్ కాంత్ ఇప్పుడు తమకు మద్దతు పలుకుతున్నాడని శరత్ కుమార్ వర్గం ప్రకటించుకొంటోంది. 

ఎవరు ఏ వైపున ఉన్నారు?

శరత్ కుమార్ వర్గం… 

తమిళ చిత్ర పరిశ్రమ రెండుగా చీలింది. శరత్ కుమార్ ఆధ్వర్యంలోని వర్గానికి వెటరన్ యాక్టర్ , డైరెక్టర్ భాగ్యరాజ్ ఆయన భార్య పూర్ణిమ భాగ్యారాజ్‌లు మద్దతు పలుకుతున్నారు. అలాగే శింబు ఈ వర్గంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. వీరితో పాటు మరో సీనియర్ నటుడు విజయ్ కుమార్ ఈ వర్గంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. నడియగర్ సంఘం సెక్రటరీ రాధారవి కూడా ఈ గ్రూప్ కు బాహాటంగా మద్దతును ఇస్తున్నాడు. తమకు రజనీకాంత్ మద్దతు కూడా ఉందని ఈ గ్రూప్ చెబుతోంది. ఇప్పటికే రాధిక, శరత్ కుమార్ లు పలు సార్లు సూపర్ స్టార్ ను కలిసి వచ్చారు. తమకు మద్దతు పలకాలని వీరు కోరినట్టుగా తెలుస్తోంది. ఇక తమకు మద్దతు పలకడని అర్థం అయ్యాకా.. ఈ జంట కమల్ హాసన్ పై దుమ్మెత్తపోయడానికి వీరు వెనుకాడలేదు. కమల్‌కు తామెంతో సాయం చేశాం కానీ.. కమల్ మాత్రం తమకు ఇప్పుడు సాయం చేయడం లేదంటూ వారు ధ్వజమెత్తారు. 

విశాల్ వర్గం…

ఈ వర్గంలో సీనియర్ యాక్టర్లకు కొదవలేదు. నాజర్ క్రియాశీల పాత్ర పోషిస్తుండగా, కమల్ హాసన్ ఈ వర్గానికి మద్దతు పలికాడు. కుష్భూ తదిరులు కూడా ఈ వర్గంలో ఉన్నారు. కొత్త వాళ్లకు ఛాన్స్ ఇవ్వాలనేది ఈ వర్గం వాదన. అలాగే నటుడు కార్తీ ఈ వర్గం తరపున తిరుగుతున్నాడు. కార్తీ ఈ వర్గంలో ఉన్నాడంటే సూర్య మద్దతు కూడా విశాల్ గ్రూప్ కు ఉన్నట్టే. 

ఎగ్జిట్ పోల్స్ లో విశాల్ దే విజయం…

ఒక ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ వారు నిర్వహించిన ప్రీపోల్ సర్వేలో విశాల్ వర్గం పై చేయి సాధించే అవకాశం ఉందని తేల్చింది. భారీ తేడాతో విశాల్ ప్యానల్ గెలుస్తుందని ఈ సర్వే అభిప్రాయపడింది. ఈ నెల 18 వ తేదీన నడిగర్ సంఘం ఎన్నికలు జరగనున్నాయి. మరి ఈ ఎన్నికల్లో ఏ వర్గం విజయం సాధిస్తుందో.. ఎవరు సత్తా చాటతారో చూడాలి. ఇరువర్గాలూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో.. వెటరన్ గెలుస్తాడో, యువకుడు సత్తా చాటతాడో వేచి చూడాలి.