ఎమ్మెల్యే కోటాలో నిర్వహించే ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు అధికార పార్టీ వైసీపీ తన అభ్యర్థులను ప్రకటించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఖరారు చేసిన అభ్యర్థుల వివరాలను ఆ పార్టీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కాసేపటి క్రితం ప్రకటించారు. వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల వివరాలిలా ఉన్నాయి.
బల్లి కల్యాణచక్రవర్తి, చల్లా భగీరథరెడ్డి, దువ్వాడ శ్రీనివాస్, మాజీ మంత్రి సి.రామచంద్రయ్య, అహ్మద్ ఇక్బాల్, కరీమున్నాసా అభ్యర్థిత్వాలను సీఎం ఖరారు చేసినట్టు సజ్జల తెలిపారు. ఇటీవల మృతి చెందిన తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కుమారుడే బల్లి కల్యాణచక్రవర్తి.
అలాగే ఇటీవల మృతి చెందిన ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి తనయుడు భగీరథరెడ్డి, శ్రీకాకుళం జిల్లా టెక్కలి వైసీపీ ఇన్చార్జ్ దువ్వాడ శ్రీనివాస్ తాజాగా అవకాశాన్ని దక్కించుకున్నారు. ఇక సీ.రామచంద్రయ్య విషయానికి వస్తే, సీఎం సొంత జిల్లా కడపకు చెందిన సీనియర్ నేత.
హిందూపురం వైసీపీ ఇన్చార్జ్ అహ్మద్ ఇక్బాల్ సీనియర్ ఐపీఎస్ అధికారి కూడా. కరీమున్నాసాది విజయవాడ. ఈ ఆరుగురిలో ఇద్దరు మైనార్టీలకు ఇవ్వడం గమనార్హం. మహ్మద్ ఇక్బాల్ వరుసగా రెండోసారి ఎమ్మెల్సీ పదవిని దక్కించుకున్నారు.
ఇదిలా ఉండగా వచ్చే నెల 29వ తేదీతో నలుగురు ఎమ్మెల్సీల పదవీ కాలం ముగియనుంది. అలాగే రాజ్యసభ పదవిని దక్కించుకున్న పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజీనామాతో పాటు చల్లా రామకృష్ణారెడ్డి ఆకస్మిక మృతితో మరో రెండు స్థానాలకు ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో మొత్తం ఆరు స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల షెడ్యూల్ ప్రకటించింది. ఈ నెల 25 అంటే నేటి నుంచి నామినేషన్ల స్వీకరిస్తారు.
మార్చి 4 వరకు నామినేషన్ల గడువు ఉంది. మార్చి 5న నామినేషన్ల పరిశీలన, 8వ తేదీ ఉపసంహరణ గడువు విధించారు. మార్చి 15న ఉదయం 9 గంటల నుంచి 4 వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ స్టార్ట్ చేస్తారు.