న్యాయస్థానాన్ని ఎవరైనా ఆశ్రయించొచ్చు. ఇందులో తప్పులేదు. ముఖ్యంగా గొంతులేని వారి గొంతుకగా న్యాయస్థానాన్ని పిలుచుకుంటారు. పాలకులు, ధనవంతులు, సమాజంలో వివిధ రకాల పలుకుబడి ఉన్న వారు తమ హక్కులను కాల రాస్తున్నప్పుడు పేదలు, అణగారిన వర్గాల వారు తమ ఏకైక దిక్కుగా న్యాయస్థానాలను మాత్రమే నమ్ముతారు. అంటే నిస్సహాయులు, అభాగ్యులు తమ చిట్ట చివరి ప్రయత్నంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారు.
కానీ తెలుగు సమాజంలో రాజకీయంగా పేరున్న జేసీ బ్రదర్స్‌లో ఒకరైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి నేడు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం ఆశ్చర్యంగా ఉంది. అలాగని న్యాయస్థానంలో పిటిషన్ వేయడాన్ని ఎవరూ తప్పు పట్టలేరు.
ఆ అవసరం కూడా ఎవరికీ లేదు. అయితే న్యాయస్థానాన్ని ఆశ్రయించడం అంటే తన అసమర్థత, చేతకాని తనాన్ని బలమైన నేతగా గుర్తింపు పొందిన జేసీ ప్రభాకర్‌రెడ్డి తనకు తానుగా చెప్పుకున్నట్టుగా ఉందనే ఆవేదన ఆయన వర్గీయుల్లో కనిపిస్తోంది.
తాడిపత్రి మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి అనుమతించాలని కోరుతూ ప్రభాకర్‌రెడ్డితో పాటు మరో నలుగురు ఈ రోజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గతంలో నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకున్నారని పిటిషన్లో పేర్కొన్నారు.
నామినేషన్ పత్రాలను చింపేశారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఇంత బతుకు బతికి ఇంటెనకాల చచ్చినట్టు …తాడిపత్రిలో రాజకీయంగా ఓ వెలుగు వెలిగిన జేసీ ప్రభాకర్‌రెడ్డి అబద్ధానికైనా నామినేషన్ వేయలేకపోయామని చెప్పడం అవమానంగా ఉందని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
జేసీ బ్రదర్స్‌కు ఇటీవల చంద్రబాబు బుద్ధులు బాగా ఒంటబట్టాయని వారు వ్యంగ్యంగా అంటున్నారు. నామినేషన్ కూడా వేయలేనంత అథమస్థాయికి జేసీ దిగజారారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక రాజకీయాల్లో ఉండడం దేనికని నిలదీస్తున్నారు. ఇలాంటి చేష్టలతో జేసీ బ్రదర్స్ ప్రజల్లో మరింత చులకన అవుతారని ఆయన అనుచరులే చెబుతుండడం గమనార్హం.