చంద్రబాబు.. మతిచలించి మాట్లాడుతున్నారా?

ప్రజా సంక్షేమానికి ఒకరూపాయి కూడా ఇవ్వకూడదని అనుకుంటున్నాడా? రాష్ట్రాన్ని తాను సర్వనాశనం చేసి అప్పగిస్తే.. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా.. నిరాటంకంగా అన్ని సంక్షేమ పథకాలూ అమలవుతుండడం చూసి ఓర్వలేకపోతున్నాడా? అప్పోసొప్పో చేసి పథకాలు…

ప్రజా సంక్షేమానికి ఒకరూపాయి కూడా ఇవ్వకూడదని అనుకుంటున్నాడా? రాష్ట్రాన్ని తాను సర్వనాశనం చేసి అప్పగిస్తే.. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా.. నిరాటంకంగా అన్ని సంక్షేమ పథకాలూ అమలవుతుండడం చూసి ఓర్వలేకపోతున్నాడా? అప్పోసొప్పో చేసి పథకాలు అన్నీ సజావుగా చేస్తూపోతే.. జగన్మోహన్ రెడ్డి.. ఎప్పటికీ ప్రజల గుండెల్లో తిష్ట వేసుకుని ఉండిపోతాడని కంగారు పడుతున్నాడా? మన ఊహకు అందని ఇతర టెన్షన్లతో సతమతం అయిపోతున్నాడా? ఏమో తెలియదు గానీ.. చంద్రబాబునాయుడు మాత్రం.. జగన్మోహన్ రెడ్డి గురించి.. పాలన గురించి.. మతి చలించిన వారిలాగా అర్థం పర్థంలేని మాటలు మాట్లాడుతున్నారు. 

అభూత కల్పనలు, అబద్ధాలతో జగన్ ప్రభుత్వం మీద విషయం చల్లడం మాత్రమే కాదు.. ప్రభుత్వ నిర్వహణలో సంస్కరణల దిశగా సాగే ప్రయత్నాలను కూడా భూతద్దంలోంచి చూపిస్తూ అవాకులూ చెవాకులూ పేలుతున్నారు. 

విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. తన తొలి ప్రభుత్వం అవసాన దశకు వచ్చిన సమయంలో… ప్రధాని నరేంద్రమోడీ మీద విషం కక్కుతూ రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబునాయుడు ధర్మపోరాట దీక్షలు నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు కూడా అదే తరహాలో.. తన రాజకీయ జీవితమే అవసానదశకు వచ్చిన తరుణంలో.. జగన్ మీద విషం కక్కడానికి, తద్వారా మరో పరాభవాన్ని మూటగట్టుకోవడానికి ఆయన ‘బాదుడే బాదుడు’ పేరుతో మరో ప్రహసనప్రాయమైన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 

ఇందులో భాగంగా చంద్రబాబునాయుడు విశాఖలో కార్యకర్తలతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పుల గురించి.. నానా మాటలూ అన్నారు. ఈ మూడేళ్లలో ఇప్పటికే 8లక్షల కోట్ల అప్పులు చేశారని, రాబోయే రెండేళ్లలో మరో మూడు లక్షల కోట్లు అప్పులు చేయబోతున్నారని సెలవిచ్చారు. ఒకవైపు అప్పుల గురించి అబద్ధాలు ప్రచారంలో పెడుతూ.. ప్రభుత్వం సంక్షేమ పథకాల విషయంలో తీసుకువస్తున్న సంస్కరణల మీద విషం కక్కడం ఇంకో దారుణం. 

300 యూనిట్లు దాటిన వారికి పథకాల విషయంలో ప్రభుత్వం ఒక జాగ్రత్త పాటిస్తోంది. ఇది చంద్రబాబునాయుడుకు మహాపరాధంగా కనిపిస్తోంది. విద్యుత్తు రంగం మీద తనకున్న జ్ఞానం ప్రపంచంలో ఎవ్వరికీ ఉండదని చెప్పుకునే ఈ మాజీ సీఎంకు 300 యూనిట్లు విద్యుత్తు ఎవ్వరికి అవుతుందో తెలియదా? ఎగువమధ్యతరగతికి కూడా సాధారణ వినియోగంలో ఈ మేరకు విద్యుత్తు కాలదు. అంత సంపన్నులకు పథకాలు ఎందుకు? అనే విచక్షణ ఆయనకు లోపించింది. 

అదే సమయంలో చంద్రబాబు మద్యం విక్రయాల ద్వారా పేదలను దోచుకుంటున్నారని కూడా అంటున్నారు. నిజంగా చంద్రబాబుకు మళ్లీ అధికారంలోకి రావాలనే ఉద్దేశం ఉంటే గనుక.. ఇప్పుడు ఏయే విమర్శలనైతే జగన్ మీద చేస్తున్నారో.. అవేవీ తాను అధికారంలోకి వస్తే ఉండవని.. 300 యూనిట్లు కాదు కదా.. 500 యూనిట్లు కాలినా కూడా అమ్మఒడి, తెల్ల రేషన్ కార్డులు సమస్తంగా ఇస్తాం అని ప్రకటించవచ్చు కదా.. అనేది ప్రజల సందేహం. 

ప్రజలకు దక్కే మేలును దారితప్పించి.. కోతలు పెట్టడంలో అందరికీ మార్గదర్శి వంటి కుయుక్తుల చంద్రబాబు.. జగన్ సంస్కరణల్ని మాత్రం తప్పుపట్టడం మతిచలించిన మాటలు కాక మరేమిటి?