విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ బాట నుంచి ప్రభుత్వ రంగంలోనే కొనసాగేలా కాపాడాలని ఉక్కు కార్మిక సంఘాలు చంద్రబాబును తాజాగా మరోమారు కోరాయి. అంతే కాదు మొండి పట్టుదలకు పోతున్న కేంద్రం మెడలు వంచైనా ఉక్కుని నిలబట్టాలని కూడా కోరాయి. ఈ మధ్య జరిగిన విశాఖ ఉక్కు కర్మాగారం ఎన్నికల్లో గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ గెలిచింది.
దాంతో ఈ సంఘం ప్రతినిధులతో పాటు ఉక్కు ఉద్యమ ప్రతినిధులు విశాఖ టూర్లో ఉన్న చంద్రబాబును కలసి అఖిలపక్షంగా ఏర్పడి కేంద్రం వద్ద పోరాడాలని, ఇందుకు చంద్రబాబు చొరవ తీసుకోవాలని కోరాయి.
దీని మీద చంద్రబాబు మాట్లాడుతూ తాను ఉక్కు కార్మికుల ఆందోళనలో ప్రత్యక్షంగా పాలుపంచుకుంటాను అని చెప్పారు. అదే టైమ్ లో తమ ఎంపీల చేత పార్లమెంట్ లో ఉక్కు సమస్యను ప్రస్థావించేలా చూస్తామని హామీ ఇచ్చినట్లుగా కార్మిక సంఘాల ప్రతినిధులు చెప్పాయి.
ఇవన్నీ పక్కన పెడితే కేంద్రం మెడలు వంచమని ఉక్కు కార్మిక సంఘాలు అయితే బాబును గట్టిగా కోరాయి. మరి ఎప్పటి మాదిరిగానే తమ ఎంపీలతో సభలో ఈ అంశాన్ని ప్రస్థావించి ఊరుకుంటే ఏమి లాభం అని అంటున్నారు. అలాగే బాబు లాంటి వారు గల్లీలో ఆందోళన చేసేకన్నా ఢిల్లీలో చేయడంతో పాటు నేరుగా ప్రధానిని కలసి ఈ అంశాన్ని ప్రస్థావించడం చేస్తేనే ఎంతో కొంత మేలు జరుగుతుంది అని ఉద్యమకారులు అంటున్నారు.
మొత్తానికి కేంద్రం మెడలు వంచడం అంత ఈజీ కాదు, టీడీపీ అధినాయకత్వం అయితే తప్పు అంతా వైసీపీదే అన్నట్లుగా మాట్లాడుతోంది. కార్మిక లోకం అయితే కేంద్రం మీద ద పోరాడు బాబూ అని కోరుతోంది.