శుక్రవారం నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటిలో అశోకవనంలో అర్జునకళ్యాణం, జయమ్మ పంచాయితీ కొత్త కథలతో పూర్తిగా నెటివిటిని ప్రతిబింబించేలా వున్నాయి. ట్రైలర్స్ చూస్తే బాగా వుంటాయనే నమ్మకంతో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తున్నాయి.
“అశోకవనంలో” సినిమా చుట్టూ, హీరో విష్వక్సేన్ చుట్టూ తిరిగిన వివాదాల్నీ పక్కన పెట్టి ఆలోచిస్తే బలమైన కథతో పాటు, సున్నిత హాస్యం, భావోద్వేగాలు ఉన్నట్టు కనిపిస్తోంది. ట్రైలర్‌లో పదేపదే స్క్రిప్ట్ అని వినిపించడం చూస్తే స్క్రిప్ట్‌ని బలంగానే రాసుకున్నట్టున్నారు.
మనకి అర్థమయ్యే కథ ఏమంటే సూర్యాపేటకు చెందిన హీరోకి ఎంత కాలానికీ పెళ్లి కాదు. పెళ్లి కోసం తహతహలాడిన కుర్రాడికి గోదారి ప్రాంతపు అమ్మాయితో కుదిరింది. కులం కూడా ఒకటే కాదు. బస్సులో అందరూ వచ్చారు. వియ్యాలవారి మర్యాదలు, చర్చలు అన్నీ అయిపోయాయి. అమ్మాయి బాంబు పేల్చింది. పెళ్లి ఇష్టం లేదని చెప్పింది. తర్వాత ఏం జరిగింది? బహుశా ఇక్కడి నుంచి సెకెండాఫ్. ఇక్కడ స్క్రిప్ట్ నిజంగా వుంటే హిట్.
ఇక జయమ్మ పంచాయితీ. ఇది One woman show.అంతా సుమ భుజాల మీదే నడిచినట్టుంది. ఆమెకో కూతురు. భర్తకు ఏదో జబ్బు. కూతురు ప్రేమలో పడినట్టుంది. బహుశా అదే పంచాయితీ ఏమో, ఇంకేదైనా వుందేమో తెలియదు.
అందమైన ఉత్తరాంధ్ర యాస, పల్లెటూరు, పోలీస్‌స్టేషన్, ఊరి పెద్దలు, నక్సలైట్లు అందరూ కలిసి జయమ్మని నిలబెడితే సంతోషమే. మరిన్ని కొత్త కథలు వస్తాయి.
భళా తందనాన అని శ్రీవిష్ణు సినిమా కూడా ఉంది. ట్రైలర్ చూస్తే ఇన్వెస్టిగేషన్ జర్నలిజం, హవాలా, ఒక క్రూరమైన విలన్ కనిపిస్తున్నారు. శ్రీవిష్ణు మంచి నటుడు. ఆయన కూడా రివాల్వర్‌తో కాలుస్తూ యాక్షన్ హీరో అవతారం ఎత్తాడు. కథలో ఏమైనా కొత్తదనం ఉందో లేదో చూడాలి.
ఇక వర్మ “మా ఇష్టం”. అది సినిమా అంటే జనం ఒప్పుకోరు. కాదంటే వర్మ ఒప్పుకోడు. ట్రైలర్ చూస్తే బ్రా, బికినీ, స్విమ్మింగ్ సూట్. Promoలా ఉంది. పాత సినిమాలకి కొత్త అతుకులు వేయడం వర్మ ప్రత్యేకత.
జీఆర్ మహర్షి