ఫ్రీగా భారీ పబ్లిసిటీ ఎలా పొందాలో అందగత్తెలను చూసి నేర్చుకోవాలేమో! ఇందుకు పూనమ్ కౌర్ ఎపిసోడే నిదర్శనం. అసలే డిజిటల్ మీడియా యుగం. కాలానుగుణంగా కుర్రకారు ఆలోచనా ధోరణులేంటో తెలుసుకోలేని స్థితిలో పూనమ్ కౌర్ ఉందనుకోవాలా? చిన్నారులతో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తే ఏమవుతుందో తెలియని అమాయక అందగత్తె పూనమ్‌కౌర్ అనుకోవాలా?
‘హ్యాపీనెస్’ అని క్యాప్షన్ ఇచ్చి, పిల్లలతో ఉన్న ఫొటోను షేర్ చేస్తే… సోషల్ మీడియా నుంచి రావాల్సిన రియాక్షనే వచ్చింది. ఇక దానిపై పూనమ్ బాధ పడడంలో అర్థం ఏముంది? ఈ ఫొటోపై నెటిజన్లు తమదైన సృజనాత్మక స్పందనను వెల్లడించారు.
ఎక్కువ మంది నెటిజన్లు పూనమ్‌కు పెళ్లైందని, ఆమె పిల్లలే అని కామెంట్స్ పెట్టారు. మరికొందరు మాత్రం ఆ పిల్లలు ఎవరని ఆరా తీశారు. ఈ కామెంట్స్‌పై పూనమ్‌కౌర్ ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం.
‘నన్ను ఇంతకాలం ఇబ్బంది పెట్టింది, నా పరువు మర్యాదలకు భంగం కలిగించింది ఇక చాలు. నేను షేర్ చేసిన ఫొటోలో ఉన్న చిన్నారులు నాకెంతో ఇష్టమైన స్నేహితుల పిల్లలు. థ్యాంక్యూ సోషల్ మీడియా. నన్ను కాస్త ఊపిరి తీసుకోనివ్వండి’ అని ట్వీట్ చేశారు.
పబ్లిక్‌లో పిల్లలతో ఉన్న ఫొటోను పెట్టినప్పుడు, తాను కోరుకున్న కామెంట్స్ వస్తాయని ఆశించడమే తప్పు. నెటిజన్ల కామెంట్స్ తర్వాత… నాకెంతో ఇష్టమైన స్నేహితుల పిల్లలని వివరణ ఇవ్వడం అంతా పబ్లిసిటీ స్టంట్‌లో భాగమనే విమర్శలకు పూనమ్ దగ్గర సమాధానం ఉందా?