గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎంపీపీ ఎన్నికలపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) వ్యూహం సత్ఫలితాన్ని ఇచ్చింది. ఎట్టకేలకు తమ పార్టీ అభ్యర్థి దానబోయిన సంతోష రూపవాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా ఎమ్మెల్యే చక్రం తిప్పారు. ఎంపీపీ అభ్యర్థిత్వం బీసీకి రిజర్వ్ అయ్యింది. అయితే ఎంపీపీ పదవిని దక్కించుకోడానికి ఏ పార్టీకి పరిస్థితులు అనుకూలించలేదు. పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకోవడంలో ఆర్కే సక్సెస్ అయ్యారు.
దుగ్గిరాల మండలంలో మొత్తం 18 స్థానాలకు గాను 9 చోట్ల టీడీపీ, ఒక చోట జనసేన, అలాగే అధికార వైసీపీ 8 చోట్ల గెలుపొందాయి. ఎంపీపీ స్థానాన్ని బీసీ మహిళకు కేటాయించారు. ఎంపీపీని దక్కించుకోవాలంటే 10 స్థానాలతో పాటు రిజర్వ్ అయిన సామాజిక వర్గానికి చెందిన ఎంపీటీసీ ఉండాలి. వివిధ కారణాలతో ఇప్పటికే రెండుసార్లు ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది.
ముచ్చటగా మూడోసారి దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక ఉత్కంఠకు తెరలేచింది. ఇక్కడ టీడీపీ-జనసేన కలిసినప్పటికీ దురదృష్టం వెంటాడింది. వైసీపీకి తగిన బలం లేకపోయినప్పటికీ అదృష్టం తలుపు తట్టింది. ఇదే సందర్భంలో వైసీపీ బీసీ ప్రజాప్రతినిధి పద్మావతి అదృశ్యం తీవ్ర చర్చనీయాంశమైంది. పద్మావతి అదృశ్యం వెనుక ఎమ్మెల్యే ఆళ్ల హస్తం ఉందని ఆమె కుమారుడు ఆరోపించారు.
ఈ నేపథ్యంలో అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఎన్నికలో వైసీపీ అభ్యర్థి సంతోష రూపవాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీడీపీ నుంచి బీసీ మహిళ ఎంపీటీసీగా లేకపోవడం, అలాగే మూడోసారి కోరం లేకపోయినా, ప్రతిపాదకులు ఉంటే చాలని నిబంధనల నేపథ్యంలో తమ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రకటించడం విశేషం.
తమ అభ్యర్థి పద్మావతిని టీడీపీ ప్రలోభాలకు గురి చేసేందుకు టీడీపీ ప్రయత్నించిందని ఆళ్ల ఆరోపించడం గమనార్హం.