రాష్ట్రంలో అరాచకాలు జరిగిపోతున్నాయని గగ్గోలు పెడుతోంది ఎల్లో మీడియా. పరీక్ష కేంద్రాల నుంచి ప్రశ్నాపత్రాలు లీక్ అవుతున్నాయని నానా యాగీ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో అత్యాచారాలు పెరిగిపోతున్నాయని గోల చేస్తోంది. ఇంతకీ ప్రశ్నాపత్రాలు లీక్ చేస్తోంది ఎవరు? అత్యాచారాలకు బాధ్యులు ఎవరు? ఈ విషయాల్ని మాత్రం ఎల్లో మీడియా చెప్పదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెబుతున్నారు.
విద్యాదీవెన పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తు తీరు చూసి చంద్రబాబు కుళ్లిపోతున్నారని.. ఎల్లో మీడియా తట్టుకోలేకపోతోందని ఆరోపించారు జగన్. ఆ కడుపు మంటలో కుతంత్రాలు చేస్తున్నారని, స్వయంగా బాబు హయాంలో మంత్రిగా చేసిన నారాయణ ఈ లీకులకు మూలకారణమని ప్రకటించారు సీఎం.
“చంద్రబాబు హయాంలో మంత్రిగా పని చేసిన వ్యక్తి స్కూల్స్ నుంచి, వాళ్లే ఫొటోలు తీసి, వాట్సాప్ ద్వారా లీక్ చేయిస్తున్నారు. ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ లీకేజీ చేసింది ఎవరో తెలుసా? 2 నారాయణ స్కూల్స్, 3 చైతన్య స్కూల్స్ లో ఈ లీకేలు జరిగాయి. చంద్రబాబు హయాంలో మంత్రిగా పనిచేసిన నారాయణ, తన స్కూల్స్ లో ప్రశ్నాపత్రాల్ని బయటకు తీసి, వాట్సాప్ లో ఫొటోలు తీసి, లీక్ చేసి, వ్యవస్థను నాశనం చేస్తున్నారు. వాళ్లే నాశనం చేస్తారు, వాళ్లే ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తారు.”
ఇలా క్వశ్చన్ పేపర్ లీకేజీ వెనక ఎవరున్నారనే విషయాన్ని జగన్ బయటపెట్టారు. మరోవైపు రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న అత్యాచార ఘటనలపై కూడా జగన్ స్పందించారు. టీడీపీ జనాలే అకృత్యాలకు పాల్పడి, రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టిస్తున్నారని ఆరోపించారు.
“విజయవాడలో అత్యాచారం అంటూ యాగీ చేశారు. గుంటూరు, విశాఖలో ఇంకేదో జరిగిపోయిందంటూ చాలా యాగీ చేశారు. ఇక్కడే మీరంతా ఆలోచన చేయాలి. దాడి అంటూ గగ్గోలు పెడుతున్నారు కానీ, ఆ దాడి చేసింది, అత్యాచారం చేసింది ఎవరనే విషయాన్ని మాత్రం ఈనాడు రాయదు. ఆంద్రజ్యోతి చెప్పదు, టీవీ5 చూపించదు. కారణం ఏంటంటే.. ఈ 3 ఘటనల్లో నిందితులు టీడీపీ వాళ్లే. ఇలాంటి దారుణమైన పరిస్థితి ఉంది. వీళ్లే చేస్తారు, వీళ్లే యాగీ చేస్తారు.”
యాక్షన్ చేసేది టీడీపీ వాళ్లేనని, ఘోరం జరిగిపోయిందంటూ గోల చేసేది కూడా వాళ్లేనని అన్నారు ముఖ్యమంత్రి. ఎల్లోమీడియాతో కలిసి చంద్రబాబు సిండికేట్ అయ్యారని… ఎలాగైనా మళ్లీ అధికారంలోకి రావాలని పన్నాగాలు పన్నుతున్నారని ఆరోపించారు.
“ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు.. ఈ నలుగురు కలిసి ఓ సిండికేట్. ఇదంతా దొంగల ముఠా. మనం ఏదైనా మంచి చేస్తే వీళ్లకు కడుపుమంట. జీర్ణించుకోలేరు. ఆ కడుపుమంటతో వీళ్లు వక్రీకరణలు చేస్తారు, అబద్ధాలు చెప్తారు. ఈ నలుగురు కలిసి ఒకే అబద్ధాన్ని వంద సార్లు చెప్పించే చెప్పి, నిజమంటూ ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల వరకు ఎన్నో మాటలు చెబుతారు. ఎన్నికల తర్వాత చేతలు గడప కూడా దాటవు. ఎన్నికల వరకే మేనిఫెస్టో. ఆ తర్వాత మేనిఫెస్టో చెత్తబుట్టలోకి పోతుంది. వాళ్ల వెబ్ సైట్ లో కూడా దొరకదు. పేదలు, బీసీలు, ఎస్సీలు, మైనార్టీల పట్ల ఎలాంటి ప్రేమ చూపలేదు. పైపెచ్చు వాడుకున్నారు. ఆ పరిస్థితులు మార్చేశాం. ఒక్క బటన్ తో పేదల కళ్లలో వెలుగునింపాం. దీంతో చంద్రబాబుతో పాటు ఆంధ్రజ్యోతి, టీవీ5, ఈనాడుకు కడుపుమంట, బీపీ పెరిగిపోతోంది.”
మూడేళ్లుగా సీఎం జగన్ పెద్దగా మీడియా ముందుకు రాలేదు. సంక్షేమ పథకాల అమలు కోసం బహిరంగ సభల్లో పాల్గొన్నా ఆయన కేవలం ఆయా పథకాల గురించే మాట్లాడేవారు కానీ, రాజకీయాల జోలికి వెళ్లలేదు. కానీ ఇటీవల మంత్రి వర్గ విస్తరణ తర్వాత ఆయనలో కొత్త జగన్ ని చూస్తున్నారంతా. వైసీపీ లేజిస్లేటివ్ పార్టీ మీటింగ్ లో తొలిసారిగా ఆయన ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేశారు. రెండేళ్లు టైమ్ ఉంది, జనంలోకి వెళ్లండి, ప్రతిపక్షంతోపాటు ప్రతిపక్షానికి కొమ్ముకాస్తున్న పత్రికలను ధీటుగా ఎదుర్కోండి అని చెప్పారు.
ఆ తర్వాత ప్రతిపక్షాలపై స్వయంగా జగన్ కూడా మాటల తూటాలు పేల్చుతున్నారు. ఇందులో భాగంగా ఈరోజు కూడా చంద్రబాబుకు మరోసారి చాకిరేవు పెట్టారు.