ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు విరుచుకుపడడంపై అదే జిల్లాకు చెందిన మంత్రి ధర్మాన ప్రసాదరావు విరుచుకుపడ్డారు. సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు లూజ్ టాక్ చేయటంపై ఆయన ఆగ్రహించారు.
శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఏపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. కరోనా కంటే జగన్ ప్రమాదకారి అన్నారు. చెత్తపై పన్ను విధిస్తున్న చెత్త ప్రభుత్వం ఇది అని ఘాటుగా విమర్శించారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబుకు మంత్రి ధర్మాన ప్రసాదరావు కౌంటర్ ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వం కంటే తమ ప్రభుత్వం మెరుగైన పాలన అందిస్తోందన్నారు. కరోనా కష్టకాలంలో సమర్థవంతమైన పాలన అందించామని గొప్పగా చెప్పుకున్నారు. రాష్ట్రంలో ఒక్క పౌరుడు కూడా వైద్యం అందక ఇబ్బంది పడలేదన్నారు. ఆకలితో అలమటించలేదన్నారు.
చంద్రబాబు తమ ప్రభుత్వాన్ని చెత్త ప్రభుత్వం అని ఎలా అనగలిగారని ధ్వజమెత్తారు. సంస్కరణల్లో భాగంగా చెత్త పన్ను వేశామని మంత్రి చెప్పుకొచ్చారు. టీడీపీ ప్రభుత్వంలో బ్రోకర్లు రాజ్యమేలేవారని మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు.
గత ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీలు ఎలా వ్యవహరించాయో ప్రజలకు తెలుసన్నారు. సీనియర్ నాయకుడైన చంద్రబాబు లూజ్ టాక్ చేయటం భావ్యం కాదని హితవు చెప్పారు. మిగతా రాష్ట్రాల్లో ఏపీ కంటే ధరలు తక్కువగా ఉన్నాయా అని ప్రశ్నించారు.