జగన్ ఒక్క ఛాన్స్ అనగానే అందరూ మాయలో పడిపోయారంటూ చంద్రబాబు విమర్శించారు. ఈ ఒక్క డైలాగ్ తో జనాలంతా పగలబడి నవ్వుకున్నారు. బాబుకు ఇలా అర్థమైందేంటంటూ గుసగుసలాడుకున్నారు.
నిజానికి 2019లో జనాలు జగన్ మాయలో పడలేదు. చంద్రబాబు భ్రమల నుంచి బయటపడ్డారు. ఎన్నికలు జరిగి మూడేళ్లవుతున్నా ఈ విషయాన్ని చంద్రబాబు ఇంకా గుర్తించకపోవడం విశేషం. ఈ నిజాన్ని చంద్రబాబు ఎంత తొందరగా గ్రహిస్తే, ఆయన పొలిటికల్ కెరీర్ కు అంత మంచిది.
ఒక్క ఛాన్స్ పవన్ కూడా అడిగారు కదా..
2019 ఎన్నికల్లో జగన్ తనకి ఓటేస్తే ఏపీ భవిష్యత్తును మార్చి చూపిస్తానన్నారు. ఆ మేరకు నవరత్నాల్ని ప్రకటించారు. పవన్ కూడా అదే రీతిలో ప్రచారం చేశారు. తనకి ఓటేస్తే పాతికేళ్ల భవిష్యత్ ఇస్తానన్నారు. కానీ జనం జగన్ నే నమ్మారు. అంటే ఇక్కడ ఛాన్స్ ఎవరు అడిగారని కాదు, అడిగిన వారి సామర్థ్యం ఏంటనేది ప్రజలు గమనించారు. జగన్ కి పట్టం కట్టారు.
2014లో బాబు వస్తే జాబు వస్తుందనేది టీడీపీ స్లోగన్. 2019 నాటికి మళ్లీ బాబే రావాలంటూ ప్రజల వద్దకు వెళ్లారు. కానీ జనం అప్పటి వరకూ బాబు చేసిన మోసాన్ని గ్రహించారు. 2014లో బాబు వచ్చారు కానీ జాబు రాలేదు, బాబు వచ్చారు కానీ రాజధాని పూర్తి కాలేదు, బాబు వచ్చారు కానీ ప్రాజెక్ట్ లు పూర్తి కాలేదు, బాబు వచ్చారు కానీ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడలేదు.
అందుకే ఒక్క ఛాన్స్ అని జగన్ అడిగినా.. ఇక బాబు బాధ భరించలేమంటూ ప్రజలంతా ఏకపక్షంగా ఆయనకి మద్దతిచ్చారు. బాబుని 23 వద్ద ఆపేశారు.
జనం అంత అమాయకులా..?
ఏపీ లోని జనం మరీ అంత అమాయకులేం కాదు. ఒక్క ఛాన్స్ అని ఎవరు అడిగితే వారికి ఛాన్స్ లిస్తూ కూర్చోరు. వైఎస్ఆర్ ఆశయాలను సాధిస్తాడు, ఆయన అడుగు జాడల్లో నడుస్తాడన్న భరోసాతోనే జగన్ కి ఛాన్స్ ఇచ్చారు. మూడేళ్లలోనే ఆయన అంచనాలను మించేలా పని చేశారు. ఇక ఒక్క ఛాన్స్ అనే అవసరం జగన్ కి లేదు. జనమే ఆయన పనితీరు చూస్తున్నారు.. మళ్లీ నువ్వే రావాలి అని కోరుకుంటున్నారు.
కానీ చంద్రబాబు మాత్రం తనకిచ్చిన అవకాశాన్ని చేజేతులా నాశనం చేసుకున్నారు. విశేషం ఏంటంటే.. ఇంకా చంద్రబాబు ఆ విషయాన్ని అర్థం చేసుకోలేదు. తన తప్పు తెలుసుకోవట్లేదు. అది తెలుసుకోలేనంతకాలం, బాబులో పశ్చాత్తాపం రానంతకాలం.. 23 అనే అంకె బాబును వదలదు.