తాము చదువుకుంటున్నప్పుడు వైఎస్ జగన్‌లాంటి ముఖ్యమంత్రి లేరని మంత్రి ఆర్కే రోజా ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఆయన నాయకత్వంలోని కేబినెట్‌లో పనిచేసే అదృష్టం దక్కిందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. విద్యాదీవెన లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చే కార్యక్రమాన్ని తిరుపతిలో గురువారం నిర్వహించారు. సీఎం జగన్ ముఖ్య అతిథిగా హాజరైన కార్యక్రమంలో రోజా తన సహజ శైలిలో దూకుడు ప్రదర్శించారు.
అన్నం పెట్టిన జగనన్న, ఆసరా ఇచ్చిన జగనన్న, చదువు అందించిన జగనన్న, ఆనందం పంచిన జగనన్న, అన్నదాతలకు అండగా ఉన్న జగనన్న.. ఈ ప్రశంసలేవీ చంద్రబాబుకు సహించడం లేదన్నారు. కరువుకు ప్యాంట్ షర్ట్ వేస్తే చంద్రబాబు అవుతారని వ్యంగ్యంగా అన్నారు. ఇవాళ సిగ్గులేకుండా బాదుడే బాదుడు అంటూ టీడీపీ కార్యక్రమం మొదలుపెట్టిందని రోజా విరుచుకుపడ్డారు. మరోవైపు సీఎం జగన్ పేదలకు పెద్ద దిక్కుగా ఉంటున్నారన్నారు.
వయసు తేడా లేకుండా.. కుల, వర్గాలకు అతీతంగా సంక్షేమ ఫలాలు అందిస్తున్నారని ప్రశంసలతో ముంచెత్తారు. పెద్ద చదువులంటే కేవలం ఆర్థికంగా పెద్దవాళ్లు మాత్రమే అభ్యసించడం కాదన్నారు. అర్హతున్న ప్రతి ఒక్కరూ ఉన్నత విద్య చదువుకునేందుకు జగన్ పెద్ద మనసుతో అండగా నిలిచారన్నారు. మనసున్న జగనన్నకు విద్యార్థుల తరపున పాదాభివందనాలని రోజా అన్నారు.
ఏ రాష్ట్రంలో లేని అద్భుతమైన పథకం విద్యాదీవెన అని అన్నారు. పేదోడంటే చంద్రబాబుకు అస్సలు నచ్చదన్నారు. అందుకే అన్నిరకాలుగా నరకయాతన పెట్టాడన్నారు. ఇప్పటి విద్యార్థుల అదృష్టం.. జగనన్న ముఖ్యమంత్రిగా ఉండడం అన్నారు. ఈ రోజు సిగ్గు లేకుండా టీడీపీ బాదుడే బాదుడు కార్యక్రమాన్ని పెట్టిందని మండిపడ్డారు. ఇలాగే పిచ్చి చేష్టలు చేస్తే 2024లో బాదుడే బాదుడంటూ 23 కూడా దక్కవని రోజా హెచ్చరించారు. చంద్రబాబు, లోకేశ్‌లను కూడా ఇంటికి పంపిస్తారని రోజా హెచ్చరించారు.
చంద్రబాబు సీఎం అయితే కరువు, వరదలు తప్ప ఏనాడైనా వర్షాలు వచ్చాయా? అని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో ప్రజలకు సంక్షేమ పథకాలు వచ్చాయా? డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు అసలు, వడ్డీతో సహా వచ్చిందా? పేదవాళ్లకు ఇళ్లు, ఇళ్ల పట్టాలు వచ్చాయా? అంటే ఏవీ రాలేదని రోజా విరుచుకుపడ్డారు.