ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల మౌలిక సమస్యలను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడంలేదనిపిస్తోంది. ఎన్నికల్లో, ఆ తరువాతా తాను ఇచ్చిన హామీలను అమలు చేయలేని ముఖ్యమంత్రి ప్రజలను వాటి గురించి ఆలోచించనీయకుండా వారిని, రాజకీయాలను, పరిపాలనను ‘రాజధాని నగర నిర్మాణం’ చుట్టూ తిప్పుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. వాస్తవం కూడా అలాగే ఉంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజధాని నగర నిర్మాణం మీద చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. రాజధాని నిర్మాణం ప్రధాన సమస్యే. కాదనేందుకు వీలు లేదు. కాని రాష్ర్టంలో ఇదొక్కటే అతి పెద్ద సమస్య అయినట్లుగా బాబు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఆయన విదేశీ మోజు, కార్పొరేట్ల ప్రయోజనాల కోసం పడుతున్న తాపత్రయం ఎలా ఉందో అర్థమవుతోంది. నిర్మాణ రంగ నిపుణులు, ప్రముఖ ఇంజినీర్లు, కొందరు విశ్లేషకులు ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. రాజధాని నగరం నిర్మించడం మనవల్ల కాదా? నిపుణులైన ఇంజినీర్లు, కృషి చేసే అధికారులు మన దగ్గర లేరా? నిర్మాణ సంస్థలు లేవా? అంతరిక్షంలో విజయాలు సాధిస్తున్న మనం ఓ నగరం నిర్మించలేమా? నిజానికి ఇది కష్టమైన పని కాదు. కాని చంద్రబాబు తానో స్వర్గం సృష్టించబోతున్నాననే భావన కలిగిస్తున్నారు.
అప్పుడు జలయజ్ఞం…ఇప్పుడు రాజధాని యజ్ఞం
వైఎస్‌ఆర్ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం కోసం ‘జలయజ్ఞం’ చేస్తే, ఇప్పుడు చంద్రబాబు ‘రాజధాని యజ్ఞం’ చేస్తున్నారు. తెలుగులో అనేక పాజిటివ్ పదాలు మీడియాలో నెగెటివ్‌గా రూపాంతరం చెందాయి. ఆ కోవలోనే యజ్ఞం అనే మాట కూడా చేరింది. యజ్ఞం అంటే మంచిని కాంక్షిస్తూ చేసే కార్యక్రమం. కాని ఇప్పుడు డబ్బు దుర్వినియోగం, ప్రజాధనం దోపిడీ అనే అర్థంలో వాడుతున్నారు. ఇప్పుడు రాజధాని యజ్ఞం కూడా అలాంటిదే. హైదరాబాద్ బాబులాంటిదో, వాషింగ్టన్ తాతలాంటిదో రాజధాని నిర్మిస్తానని చంద్రబాబు ఊదరగొడుతున్నారు. కాని అందుకోసం లక్షలాది మంది రైతులు తమ భూములను పణంగా పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అవి పనికిమాలిన భూములైతే కథ ఇంత దూరం సాగేది కాదు. కాని అవి ఏడాదికి మూడు పంటలు పండే బంగారం వంటి భూములు. రైతుల జీవితాలకు భరోసా ఇస్తున్న భూములు. ఇవాళ ఎకరం కోటి రూపాయలకో, కోటిన్నరకో ప్రభుత్వం కొనుగోలు చేయొచ్చు. కాని రైతుకు భూమి ఇచ్చినంత భరోసా కరెన్సీ నోట్లు ఇవ్వవు. సొంతంగా వ్యవసాయం చేసుకుంటూ రైతుగా గర్వంగా బతికిన వ్యక్తులు తరువాత కార్పొరేట్ల దగ్గర కార్మికులుగా బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు రాజధానిగా ఎంపిక చేసిన ప్రాంతం నగరం నిర్మితమయ్యాక స్వర్గధామం అవుతుందని, ప్రజలు బ్రహ్మాండంగా బతుకుతారని పాలకులు చెబుతున్నారు. ఓ పక్క రైతులకు డబ్బు పరంగా, ఇతరత్రా అనేక ఆశలు కల్పిస్తూనే భూములు ఇస్తే సరేసరి, ఇవ్వకుంటే గుంజకుంటామన్న ధోరణితో వ్యవహరిస్తున్నారు. తాము ఎంపిక చేసిన ప్రాంతంలో రాజధాని నిర్మాణం ప్రజలకు మహత్తర అవకాశమని ప్రజలు చెబుతుండటంతో రైతులు డోలాయమాన స్థితిలో ఉన్నారు.
రాజధాని సింగపూర్‌కు…పోర్టులు జపాన్‌కు
ఒకప్పుడు బ్రిటిషర్లు, డచ్చి, పోర్చుగీసు, ఫ్రెంచి వ్యాపారులు ఇండియాకు వచ్చి, రాజులను ఆశ్రయించి, అనుమతులు అడిగి వ్యాపారాలు చేసుకున్నారు. ఏకులాగా వచ్చినవారు మేకుగా మారారు. ఇప్పుడు పరిస్థితి రివర్స్ అయింది. మన పాలకులు విదేశాలకు వెళ్లి ‘మా దేశంలో పెట్టుబడులు ప్రవహింపచేయండి’ అని బతిమాలుకుంటున్నారు. ‘మీరు ఏమాత్రం ఆలస్యం చేసినా అవకాశం కోల్పోతారు’ అని కూడా చెబుతున్నారు. చంద్రబాబుది కూడా ఇదే వైఖరి. ఇప్పడు విదేశీ పెట్టుబడిదారులు రాజ్యాలను ఆక్రమించుకోకపోవచ్చేమోగాని ప్రభుత్వాల నుంచి చౌకగా విలువైన భూములను కాజేస్తున్నారు. అనేక షరతులు పెట్టి భారీగా రాయితీలు పొందుతున్నారు. వారి వల్ల మన ప్రజలకు కలిగే ప్రయోజనం తక్కువగా ఉండి వారు పొందే ప్రయోజనం ఎక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో జరగబోయేది కూడా ఇదే. రాజధాని నిర్మాణాన్ని ఇప్పటికే సింగపూర్‌కు కట్టబెట్టేశారు. సింగపూర్ వాణిజ్య శాఖ మంత్రి డిసెంబరు న రాష్ట్రానికి వస్తున్నారు. ఆయనతో రాజధాని నిర్మాణం గురించి బాబు చర్చిస్తారు. ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని నిర్మాణంపై శివరామకృష్ణన్ కమిటీ మంచి సూచనలు చేసిందని విశ్లేషకులు కొందరు చెబుతున్నారు. కాని బాబు ఆ కమిటీ సిఫార్సులను అసలు పట్టించుకోలేదు. కొందరు కార్పొరేట్లతో, మంత్రులతో కలిసి తానో కమిటీ వేశారు. దాన్ని దేశంలోని కొన్ని రాజధానుల పరిశీలనకు, విదేశీ రాజధానుల అధ్యయనానికి పంపారు.తాను స్వయంగా సింగపూర్, జపాన్ వెళ్లొచ్చారు. ఏ దేశానికి వెళితే ఆ దేశంలో ఆంధ్రప్రదేశ్‌ను తయారుచేస్తానని చెబుతున్నారు. ఆయా దేశాల్లో తనకు నచ్చిన ప్రతి నిర్మాణాన్ని, వ్యవస్థను ఆంధ్రలో అమలు చేస్తానని చెబుతున్నారు. వెంటనే ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటున్నారు.ఏ దేశానికి వెళితే ఆ దేశ ప్రభుత్వాన్ని, అక్కడి బడా కంపెనీలను రాజధాని నిర్మాణంలో పాలుపంచుకొమ్మని కోరుతున్నారు.
రాజధాని నిర్మాణానికి ఓ పక్క సింగపూర్‌తో ఒప్పందాలు కుదుర్చుకుంటూనే జపాన్ కూడా పాలు పంచుకుంటుందని చెబుతున్నారు. రెండు దేశాల వారు కలిసి ఏం చేస్తారో అర్థం కాకుండా ఉంది. అయితే చంద్రబాబు చెబుతున్నదాన్నిబట్టి రాజధాని నిర్మాణం దాదాపుగా సింగపూర్ చూసుకుంటుంది. దీంతో పాటు 13 స్మార్ట్ నగరాలను కూడా అదే నిర్మిస్తుండవచ్చు. మొన్నీమధ్య జపాన్ వెళ్లినప్పుడు అక్కడి వారితో ‘మీరు మేం కలిస్తే అద్భుతాలు సృష్టించవచ్చు’ అని చెప్పిన బాబు వారికి ప్రధానంగా నౌకాశ్రయాల నిర్మాణం, నిర్వహణ బాధ్యతలు అప్పగించబోతున్నారు. ప్రధానంగా విశాఖపట్నం, కృష్ణపట్నం నౌకాశ్రయాలను లాజిస్టిక్ హబ్‌లుగా తీర్చిదిద్దే బాధ్యతను జపాన్‌కు అప్పగిస్తామని బాబు చెబుతున్నారు. ఇవి కాకుండా మరో మూడు పోర్టులను కూడా ఈ దేశానికే అప్పగించబోతున్నారు.
తలచినది జరగడమే ప్రధానం…!
చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజధానిపై అనేక ఊహలు రేపి, అనేక ప్రాంతాల ప్రతిపాదనలు ముందుకు తెచ్చి చివరకు కృష్ణా, గుంటూరు జిల్లాలపై దృష్టి కేంద్రీకరించారు. ఈ ప్రాంతంలో నీరు, రోడ్డు, రైలు మార్గాల కనెక్టివిటీ, ఎయిర్‌పోర్టు, ప్రకృతి అందచందాలు, వాస్తు….మొదలైనవి అనుకూల అంశాలు కావొచ్చేమోగాని రాజధాని నిర్మాణానికి 30 వేల ఎకరాల భూమి అవసరమా? అని అనేకమంది ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ భూమి ఉన్నచోట రాజధాని కట్టకుండా, మంచి పంటలు పండే భూములను సేకరించడం లేదా సమీకరించడం ఎంతవరకు సమంజసమని నిలదీస్తున్నారు. ప్రపంచంలో గొప్ప రాజధానులుగా పేరుపొందిన నగరాలేవీ ఇంత విస్తీర్ణంలో లేవని కూడా చెబుతున్నారు. అయినప్పటికీ బాబు తనకు తోచిందే చేస్తున్నారు. చంద్రబాబుకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు పూర్తి మద్దతు ఇస్తున్నారు. కేంద్రం నుంచి ఎంతమేరకు డబ్బు ఇస్తారో ఆయన చెప్పడంలేదుగాని రాజధాని నిర్మాణం విషయంలో బాబు నిర్ణయాలకు మద్దతు ఇస్తున్నారు. ‘మీరు రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వకపోతే ఈ సువర్ణావకాశం నూజివీడుకో, దొనకొండకో పోతుంది. మీ ఇష్టం’ అని వెంకయ్యనాయుడు తుళ్లూరు రైతులతో చెప్పారు. ఇక చంద్రబాబు ‘వాస్తు ప్రకారమే తుళ్లూరు ప్రాంతాన్ని రాజధాని ప్రాంతంగా నిర్ణయించాం. ఆరు నూరైనా ఈ నిర్ణయం మారదు’ అని స్పష్టం చేశారు. స్థానిక రైతుల నుంచి భూములను నయానో భయానో సేకరిస్తున్న బాబు ఆర్థిక, ఇతర దీర్ఘకాలిక ప్రయోజనాలను మాత్రం విదేశీ గుత్త పెట్టుబడీదారి సంస్థలకు కట్టబెడుతున్నారు. అడవుల్లో రాజధాని నిర్మించలేమన్న బాబు రాజధాని అంటే కేవలం ప్రభుత్వ భవనాల సముదాయం కాదని, అక్కడ విసృ్తతమైన ప్రజాజీవితం ఉండాలని, సామాజిక, ఆర్థిక కార్యకలాపాలు కొనసాగాలని అన్నారు. రాజధానిలో తక్కువలో తక్కువ పాతిక లక్షల జనాభా ఉండితీరాలని చెప్పారు.
కేంద్రం నుంచి ఎంత వస్తుంది?
రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఎంత డబ్బు ఇస్తుందో ఇప్పటివరకు తెలియదు. స్వర్గధామం వంటి రాజధాని నగర నిర్మాణానికి లక్షల కోట్లు కావాల్సివుంటుంది. కాని కేంద్రం కొన్ని వందల కోట్లయినా ఇస్తుందా? అనేది అనుమానంగా ఉంది. తుపాను బీభత్సాన్ని చూడటానికి విశాఖ వచ్చిన ప్రధాని మోడీ అప్పటికప్పుడు వెయ్యి కోట్ల సాయం ప్రకటించగానే ఆయన పెద్ద మనసును అందరూ ప్రశంసించారు. కాని ఇప్పటివరకూ అతి కష్టం మీద నాలుగొందల కోట్లు వచ్చాయని సమాచారం. రాష్ర్ట ప్రభుత్వం గట్టిగా పైరవీ చేస్తే మరో మూడొందల కోట్లు రావొచ్చని అంటున్నారు. తుపాను సాయం పరిస్థితే ఇలా ఉంటే రాజధాని నిర్మాణానికి లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా? రాష్ట్రానికి ‘ప్రత్యేక హోదా’ కల్పించి ఇతోధిక సాయం చేస్తామని చెప్పిన కేంద్ర పాలకులు ఇప్పుడు రూటు మార్చి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామంటున్నారు. ‘పేరు మారిందంతే..చేసే సాయం అదే’ అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. రాజధాని నిర్మాణానికి ఆర్థిక వనరులు చేతిలో లేకపోయినా బాబు మాత్రం విదేశాలు చుట్టేసి ఒప్పందాల మీద ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. రాజధాని నిర్మాణ మాస్టర్ ప్లాన్ తయారీకే సింగపూర్ 1200 కోట్లు డిమాండ్ చేసింది. ఈ లెక్కన రాజధాని నిర్మాణానికి ఎంత ఖర్చవుతుందో ఊహకు అందడంలేదు. సింగపూర్‌గాని, జపాన్‌గాని ఆ మాటకొస్తే ఏ విదేశమైనా తమ లాభాలు చూసుకోకుండా పనిచేయవు కదా…! సింగపూర్ ఇప్పటికే విధించిన అనేక షరతులు చూసి మన అధికారులు నివ్వెరపోతున్నారట…! రాజధాని నిర్మాణం కోసం ఆ దేశం 43 శాతం పెట్టుబడి పెడితే ఆంధ్ర ప్రభుత్వం 57 శాతం పెడుతుందట…! తాము పెట్టే పెట్టుబడులపై రిటర్స్న్ ఎలా వస్తాయో స్పష్టం చేయాలని సింగపూర్ ప్రశ్నించింది.
బలహీన జపాన్‌తో ఒప్పందాలు
ప్రస్తుతం జపాన్ ఆర్థిక వ్యవస్థ బాగా బలహీనపడిందని నిపుణులు, విశ్లేషకులు చెబుతున్నారు. ఒకప్పుడు అది అమెరికా తరువాత అంత బలంగా ఉండేది. కాని ఇప్పుడు దానికి అంత సీన్ లేదట…! జపాన్ స్థానాన్ని చైనా ఆక్రమించింది. ఈ దేశం ప్రస్తుతం తనకు ఎక్కడ ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయా అని గాలిస్తోంది. శ్రామిక శక్తి చౌకగా లభించే దేశాలో పరిశ్రమలు పెట్టి లాభాలు ఆర్జించే ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ఇండియాపై కన్నేసింది. ఇప్పుడు చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌ను అప్పగిస్తాం రమ్మంటున్నారు. బాబు ప్రశంసించి ఒప్పందాలు కుదుర్చుకున్న ‘సుమితోమో’ మరికొన్ని సంస్థలు పనికిమాలినవిగా, ప్రమాణాలు లేనివిగా ప్రపంచ ప్రఖ్యాత రేటింగ్ ఏజెన్సీలైన స్టాండర్డ్ అండ్ పూర్, మూడీలాంటవి తేల్చాయట. వీటిని మోసకారి సంస్థలుగా ముద్ర వేసి బ్లాక్‌లిస్టులో పెట్టారట. ఇలాంటి సంస్థలతో ఒప్పందాలు ఎంతవరకు ప్రయోజనమో చంద్రబాబు ఆలోచించాలి. మొత్తం మీద బాబు విదేశీ మోజు ఆంధ్రప్రదేశ్‌ను పాల ముంచుతుందో, నీట ముంచుతుందో చూడాలి..!
ఎం.నాగేందర్