పేరు : రైతు
దరఖాస్తు చేయు ఉద్యోగం : రుణ విముక్తుడు.
ముద్దు పేర్లు : ‘అన్నదాత’, ‘దేశానికి వెన్నెముక’
‘విద్యార్హతలు : నాకు చదువు ఎవరు నేర్పారు కనుక ? ముందు జాగ్రత్త చర్యగా నన్ను నిరక్షరాస్యుడిగా వుంచేశారు. చదువే వస్తే, ఆత్మహత్య చేసుకున్నప్పుడెల్లా, కారణాలను పేర్కొంటూ, ‘సూసైడ్ నోట్’ పెట్టి చస్తానని ఈ వ్యవస్థకు భయం.
ఈ వారం గ్రేట్ ఆంధ్ర ఈ- పేపర్ కోసం క్లిక్ చేయండి
గుర్తింపు చిహ్నాలు :
- ఒకటి: ఎక్కడ క్యూ వుంటుందో అక్కడ నేను నిలబడి వుంటాను. సాధారణంగా దేశంలో క్యూలు ఎక్కడ వుంటాయి? విత్తన, ఎరువుల పంపిణీ కేంద్రాల దగ్గరే కదా! ఆ తర్వాత పోలింగ్ బూత్‌ల దగ్గర. చావకుండా బతికి వుంటే, హామీలను నమ్మి ఆ క్యూలో కూడా నిలబడతాను.
- రెండు: మన దేశంలో తప్పు చెయ్యని నేతా, అప్పు చెయ్యని రైతూ దొరకటం కష్టం. కాబట్టి ‘ఇచ్చట రుణములు ఇవ్వబడును’ అన్న బోర్డు వున్న ప్రతి చోటా నేనుంటాను.
సిధ్ధాంతం : అందరూ ‘కష్టే ఫలి’ అనుకుంటారు. కానీ నేను ‘నష్టే’ ఫలి అని అనుకుంటాను. అందుకే నష్టం వస్తుందని తెలిసి కూడా వ్యవసాయం చేస్తాను.
వృత్తి : ఆత్మహత్య చేసుకోవటం. ( వేనకు వేలు ఇలా చనిపోతున్నా, మా వృత్తిని ఏ సర్కారూ గుర్తించక పోవటం విచారకరం. )
ఈ వారం గ్రేట్ ఆంధ్ర ఈ- పేపర్ కోసం క్లిక్ చేయండి
హాబీలు :
- పెళ్ళాం మెడలో పుస్తెలు వెయ్యటం, తీయటం.( అమ్మటమో, తాకట్టు పెట్టటమో ఏదో ఒకటి చెయ్యాలి కదా. లేకుంటే వ్యవసాయం చెయ్యగలమా?)
- పండగలకీ, పబ్బాలకీ అందరూ ‘మందు’ తాగుతుంటే, మేము ‘పురుగు మందు’ తాగుతాం.
అనుభవం : తల్లికి తిండి పెట్టని వాడు, పినతల్లికి చీర పెడతానన్నాడట! రైతులం సర్కారుకి పినతల్లుల్లాంటి వాళ్ళం. ఏం చెప్పినా నమ్ముతాం. వ్యవసాయాన్ని ‘సాఫీ’గా చేసుకోనివ్వని సర్కారు, రుణాలు ‘మాఫీ’ చేస్తుందంటే నమ్ముతాం. కానీ మెల్ల మెల్లగా అర్థమవుతోంది. సర్కారు మా రుణాల్ని కాదు, మమ్మల్నే మాఫీ చేస్తోంది.
మిత్రులు : చేనేత కార్మికులూ, ఇతర చేతి వృత్తుల వారు. చావుదగ్గర తోడు వుండే వాళ్ళకన్నా నిజమైన మిత్రులెవరు? కాకుంటే ఆత్మహత్య చేసుకోవటంలో ఎవరి పద్ధతులు వారికున్నాయి. వారు తాము నేసిన వస్త్రంతోనే ఉరి వేసుకుంటే, మేము కొనుక్కున్న పురుగుమందుతోనే ప్రాణం తీసుకుంటాం.
ఈ వారం గ్రేట్ ఆంధ్ర ఈ- పేపర్ కోసం క్లిక్ చేయండి
శత్రువులు : మా పేరు చెప్పి వోట్లేరుకునే అన్ని పార్టీల వారు. (పాలక పక్షంగా వుంటే, పోయిన వాడు రైతు కాదంటారు; ప్రతి పక్షంలో వుంటే పోయిన ప్రతీవాడూ రైతే అంటారు. అంతే తేడా.)
మిత్రశత్రువులు : దేశంలోని కార్పోరేట్ సంస్థలు. మేం వ్యవసాయం మానుకుంటే, తాము చెయ్యవచ్చనే ఆశతో, మాకు వ్యతిరేక విధానాలను ఆయా ప్రభుత్వాలతో చేయిస్తూ వుంటారు.
వేదాంతం : ఇప్పుడు చాలా మంది నగరాల్లో చదువుకునే వారు, ‘వరి మొక్క’ ఎలా వుంటుందని అడుగుతారు; రేపు ‘రైతు’ ఎలా వుంటాడని అడుగుతారు.
జీవిత ధ్యేయం : మళ్లీ రైతుగానే పుట్టాలని.. కానీ ఈ దేశంలో కాదు.
–సతీష్ చందర్