ఎమ్బీయస్‌: ఆంధ్రులకు మసి పులమడం అన్యాయం- 2

'సాక్ష్యాధారాలన్నీ కోర్టుకు సమర్పించినపుడు లేని యీ ఆడియో రికార్డింగు ఎక్కడిది?' అని పరకాల ప్రభాకర్‌ ప్రశ్నించారు. 'సాక్ష్యాలన్నీ సమర్పించేశాం, యికపై ఏం దొరికినా సమర్పించం' అని పోలీసులు కోర్టుకి ఎప్పుడైనా చెప్తారా? కొత్త సాక్ష్యాలు…

'సాక్ష్యాధారాలన్నీ కోర్టుకు సమర్పించినపుడు లేని యీ ఆడియో రికార్డింగు ఎక్కడిది?' అని పరకాల ప్రభాకర్‌ ప్రశ్నించారు. 'సాక్ష్యాలన్నీ సమర్పించేశాం, యికపై ఏం దొరికినా సమర్పించం' అని పోలీసులు కోర్టుకి ఎప్పుడైనా చెప్తారా? కొత్త సాక్ష్యాలు చేతికి వస్తూ వుంటే టైమ్‌ బార్‌డ్‌ అనుకుంటూ వాటిని గాలికి వదిలేస్తారా? జగన్‌ కేసుల్లో ఎవరైనా ముద్దాయి ఎప్రూవర్‌గా మారి కొత్త సాక్ష్యాలు పట్టుకుని వస్తే అవి తీసుకోం అంటారా పోలీసులు? కొత్త కోణం దొరికితే కొత్త సాక్షులను చివరి నిమిషంలో కూడా ప్రవేశ పెడుతూ వుంటారు ప్రాసిక్యూషన్‌ లాయరూ, డిఫెన్సు లాయరూ. జడ్జి అనుమతిస్తూంటాడు కూడా. ఆడియో అప్పుడు లేకపోవచ్చు, తర్వాత చేతికి చిక్కవచ్చు. 'ఈ టేపులు ఎక్కడనుంచి వచ్చాయో చెప్పాలి' అని అడిగారు పరకాల. అది కోర్టు వాళ్లు ఎలాగూ అడుగుతారు. అవి ఎంతవరకు నమ్మవచ్చు అని అడుగుతారు. అందుకే ఫోరెన్సిల్‌ లాబ్‌కు పంపించి, వారు నిజమైనవే అని సర్టిఫై చేశాకనే ఆడియో, వీడియోలు సాక్ష్యాలుగా చూపుతాం అని ఎసిబి అంటోంది. లాబ్‌కు పంపింది కూడా.

తమకు వ్యతిరేకంగా పత్రికల్లో ఏదైనా కథనం రాగానే 'ఈ సమాచారం మీకు ఎక్కణ్నుంచి వచ్చిందో చెప్పండి' అని నాయకులు మీడియాపై ఒత్తిడి తెస్తారు. వినోద్‌ మెహతా ఆత్మకథలో అలాటి ఉదంతాలు చాలా కనబడ్డాయి. 'మా సోర్స్‌ మేం చెప్పం, ఎక్కణ్నుంచి వచ్చిందో మేం చెప్పం. అది అబద్ధమైతే ఖండించండి' అని ఎడిటర్లు మొండికేస్తారు. ఖండిస్తే తమ కథనాన్ని సమర్థించుకుంటూ విలేకరి యింకా కొన్ని విషయాలు బయటపెట్టవచ్చన్న భయంతో నాయకులు యింకేమీ అనలేక కక్షసాధింపు చర్యలు చేపడతారు. 'మమ్మల్ని అబాసుపాలు చేయడానికి, మా స్థయిర్యాన్ని దెబ్బ తీయడానికి తెచ్చారా?' అనే మాట పరకాల అనకుండా వుండాల్సింది. అవి బయటకు రావడం వలన తాము అబాసుపాలు అయ్యామని ఒప్పుకున్న ధ్వని అందులో వుంది. రేవంత్‌ వెళ్లలేదు, డబ్బు ఆఫర్‌ చేయలేదు అని అనకుండా, ఆ టేపుల్లో వాయిస్‌ చంద్రబాబుది కాదు అనకుండా 'అసలీ సాక్ష్యాలు ఎలా సంపాదించారో చెప్పండి, ట్యాపింగ్‌ చేశా?' అని అడగడంలోనే నేరం ఒప్పుకున్నట్లు అనిపిస్తోంది.

ట్యాపింగ్‌ చేయడం నేరం అని చెప్పుకోవడమే తప్ప దానికై శిక్ష పడిన సందర్భాలు నాకు గుర్తు రావటం లేదు. రామకృష్ణ హెగడే కర్ణాటక ముఖ్యమంత్రిగా వుండే రోజుల్లో చాలా పేరు తెచ్చుకున్నారు. ప్రధానమంత్రి కావడానికి అర్హత వున్న నాయకుల్లో ఒకరు అని కూడా మీడియా రాసేది. అంతలో ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణల్లో చిక్కుకున్నారు. దానివలన రాజకీయంగా వివాదం చెలరేగింది తప్ప, ఆయనకు శిక్ష ఏమీ పడలేదు. ఇప్పుడు కెసియార్‌ స్వయంగా ట్యాపింగ్‌కు ఆదేశించారు అని నిరూపించడం కష్టం. హోం మంత్రో, లేక సంబంధిత పోలీసు విభాగాధిపతో ఆదేశించారని విచారణలో తేలిందనుకోండి. వారి చేత రాజీనామా చేయించడమో, సస్పెండ్‌ చేయడమో, శాఖ మార్చడమో చేసి సరిపెడతారు. అంత కంటె ముందు ట్యాపింగ్‌ జరిగిందని నిరూపించాలి. బాబు, సహచరులు 120 మంది ఫోన్లపై ట్యాపింగ్‌ జరిగిందని ఆరోపిస్తున్నారు. రేవంత్‌ వ్యవహారం బయటకు వచ్చిన వారం రోజుల్లోనే యీ విషయం ఎలా పసిగట్టారో నాకు అర్థం కావటం లేదు. ఫలానా ఫలానా వారి ఫోన్లపై నిఘా వేయండి అని పోలీసు శాఖ కమ్యూనికేషన్స్‌ శాఖను కోరుతుందని, వారు అనుమతిస్తేనే అది సాధ్యపడుతుందని గతంలో చదివాను. పోలీసు శాఖ పంపిన జాబితా బాబు సహచరుల చేతికి చిక్కిందా!? అదే చేత చిక్కి వుంటే తమ అనుకూల మీడియాలో లీక్‌ చేయకుండా వుంటారా!?  కేంద్రానికి ఫిర్యాదు చేయడంతో ఎందుకు సరిపెడుతున్నారు? ఆ ఫిర్యాదులో యీ 120 అంకె రాయలేదేం? 'ఏపి సిఎంతో పాటు, రాష్ట్రమంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులను లక్ష్యంగా చేసుకుని చట్టవిరుద్ధంగా ఫోన్ల ట్యాపింగ్‌ చేశారు' అని జనరల్‌గా రాశారేం? 120 అంకెకు ఆధారాలు దొరకలేదా? 

కేంద్రం యిప్పటికే శాఖాంతర్గత విచారణకు ఆదేశించింది. అది సరిపోదు, అత్యున్నత స్థాయి విచారణ జరిపించాలని బాబు లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం అనధికారికంగా అత్యాధునిక ట్యాపింగ్‌ యంత్రాలను సమకూర్చుకుందని, ట్యాపింగ్‌ యంత్రాలను చట్టవిరుద్ధంగా సమకూర్చుకున్న ఒక ప్రయివేటు డిటెక్టివ్‌ సంస్థకు ఫోన్‌ ట్యాపింగ్‌ పనిని తెలంగాణ ప్రభుత్వం ఔట్‌సోర్సింగ్‌కు యిచ్చిందని బాబు ఆరోపించారు. ఇందులో రెండు అంశాలున్నాయి. ఒకటి – ప్రభుత్వమే అత్యాధునిక ట్యాపింగ్‌ యంత్రాలను సమకూర్చు కుందంటున్నారు. రాష్ట్రంలో ఉగ్రవాద చర్యలను అరికట్టడానికి యివి అవసరం అని చెప్పి అధికారికంగానే సమకూర్చుకోవచ్చు. అనధికారికంగా ఆ పని చేయడం దేనికి? అవి తన దగ్గర పెట్టుకుని పైన చెప్పినవారందరి ఫోన్లూ ట్యాప్‌ చేస్తూండగా లేనిది, యీ సెబాస్టియన్‌ వ్యవహారంలో మాత్రం ప్రయివేటు డిటెక్టివ్‌కు ఫోన్‌ ట్యాపింగ్‌ పని అప్పగించడం దేనికి? అలా అప్పగించేటప్పుడు తన వద్దనున్న అత్యాధునిక యంత్రాలనే వాడుకోమనకుండా అది ట్యాపింగ్‌ యంత్రాలను అక్రమంగా సమకూర్చుకుందా లేదో చూసుకుని అప్పుడు అప్పగించడం దేనికి? ఏదైనా ప్రయివేటు డిటెక్టివ్‌ సంస్థ చట్టవిరుద్ధంగా ఆధునిక యంత్రాలను సమకూర్చుకుని చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేస్తూ వుంటే, దానిపై టిడిపి నాయకుడెవరైనా పోలీసులకు ఫిర్యాదు చేసేయవచ్చు కదా! పక్క రాష్ట్రపు ముఖ్యమంత్రి వెళ్లి ఏకంగా ప్రధానమంత్రికి ఫిర్యాదు చేయాలా? ఎందుకలా? ఆధారాలు లేవా? ఇవన్నీ వినికిడి కబుర్లేనా? ఆధారాలు కనిపెట్టే పని కూడా బాబు మోదీకి అప్పగించి వచ్చారా? సెబాస్టియన్‌ ఫోన్‌ను మే 25 నుంచి ఫోన్‌ చేశారని విశ్వసనీయ సమాచారం వుందని, ఆయన ఉగ్రవాది కాదని, తీవ్రవాది కాదని బాబు వాపోయారు. తన ఫోన్‌ ట్యాప్‌ అయినందుకు సెబాస్టియన్‌కు ఏ చింతా లేనట్టుంది. చేస్తే గీస్తే ఆయన చేయాలి ఫిర్యాదు! కానీ బాబు ఫీలవుతున్నారు. ఎందుకు? 

ట్యాపింగ్‌/ హ్యాకింగ్‌ నిరూపించడం ఎంత కష్టమో తెలిపే వుదంతం యివాళ్టి పేపర్లో వచ్చింది. అమెరికన్‌ విజిల్‌ బ్లోవర్‌ ఎడ్వర్డ్‌ స్నోడెన్‌ అమెరికన్‌ ప్రభుత్వపు నేషనల్‌ సెక్యూరిటీ ఏజన్సీ (ఎన్‌ఎస్‌ఏ) జర్మన్‌ ఛాన్సెలర్‌ ఏంజిలా మెర్కెల్‌ సెల్‌ఫోన్‌ను హ్యేక్‌ చేసిందని   2013 అక్టోబరులో వెల్లడించాడు. వెంటనే దాన్ని వైట్‌ హౌస్‌ ఖండించింది. కానీ ఆ ఖండన నిర్ద్వంద్వంగా లేకపోవడంతో రకరకాల అనుమానాలకు తావిచ్చింది. ఏంజిలా ఒబామాకు ఫోన్‌ చేసి స్నేహితుల మధ్య యిలాటి గూఢచర్యం సవ్యంగా లేదంది. హ్యేకింగ్‌ను నిరూపించే బాధ్యతను జర్మన్‌ ప్రభుత్వం తమ చీఫ్‌ ఫెడరల్‌ ప్రాసిక్యూటర్‌కు అప్పగించింది. ఆయన 2014 జూన్‌లో హ్యేకింగ్‌ జరిగిందనడానికి తగినంత సాక్ష్యం వుందని ప్రకటించాడు. పరిశోధన కొనసాగింది. చివరకు 2014 డిసెంబరులో 'కేసు పెట్టడానికి చాలినంత సాక్ష్యం దొరకటం లేదు. నేరపరిశోధన చురుగ్గా సాగటం లేదు' అని ప్రకటించాడు. చివరకు నిన్న అమెరికన్‌ ప్రభుత్వంపై జర్మన్‌ ప్రభుత్వం తన ఆరోపణలను విరమిస్తూ ప్రకటన చేసింది. సాక్ష్యాలకు దొరకనంత నేర్పుగా అమెరికన్‌ ప్రభుత్వం గూఢచర్యం చేసిందని అనుకుందామనుకున్నా, జర్మన్‌వారి సాంకేతిక పరిజ్ఞానం కూడా తక్కువ కాదు. పట్టుకుందామని వాళ్లూ గట్టిగానే ప్రయత్నించి వుంటారు. చివరకు ఏమీ దొరకలేదు. మరి రేవంత్‌ కేసులో ట్యాపింగ్‌ కూడా ఎలా నిరూపిత మవుతుందో వేచి చూడాలి. నిరూపించడం కష్టమనే భావనతోనే చంద్రబాబు 'అత్యాధునిక పరికరాలతో..' అనే మాట వాడారా? అలాటప్పుడు సాక్ష్యం దొరక్కపోయినా ఆరోపణ మాత్రం మిగులుతుంది. నమ్మినవాళ్లు నమ్ముతారు. (సశేషం) 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జూన్‌ 2015)

[email protected]

Click Here For Archives