ఎమ్బీయస్‌: జానపద చిత్రాలు- 21

కోటలోనే వున్నా ప్రతాపుడు చింతాక్రాంతుడై వున్నాడు. రాజుగారికి సన్నిహితంగా మెలిగిన కంచుకిని ఓ సారి తోటలోకి పిలిపించి 'ఎవరిపై అనుమానం వుంది?' అని అడిగాడు. రాజుల కొలువు అంటే కత్తిమీద సామే! అతనికి నిజం…

కోటలోనే వున్నా ప్రతాపుడు చింతాక్రాంతుడై వున్నాడు. రాజుగారికి సన్నిహితంగా మెలిగిన కంచుకిని ఓ సారి తోటలోకి పిలిపించి 'ఎవరిపై అనుమానం వుంది?' అని అడిగాడు. రాజుల కొలువు అంటే కత్తిమీద సామే! అతనికి నిజం తెలిసినా చెపితే మా చిన్నాన్నను అంటావా? అని ప్రాణాలు తీయించవచ్చు. అందుకని 'పైవారు బాధ్యులు కారు' అని హింట్‌ యిచ్చి వదిలేశాడు. ఇంతలో పొదల చాటున వున్న ప్రచండుడి అనుచరుడు యువరాజుపై కత్తి విసిరాడు. అతన్ని కాపాడడానికి కంచుకి అడ్డం వచ్చి తన ప్రాణాలు పోగొట్టుకున్నాడు. వెంటనే యువరాజు బొడ్లోంచి మరో కత్తి లాగి పొదలోని వాడి మీద విసిరేశాడు. దెబ్బకి అతను నేలకూలాడు. ఎవరాని చూస్తే అతను మహారాజు ఆంతరంగికుల్లో ఒకడు. యువరాజుకి మతిపోయింది. 'ఏమిటిది?' అన్నాడు. 'ఉప్పు తిని ద్రోహం చేశాను. మీ చిన్నాన్న ప్రచండులవారే యివన్నీ చేయిస్తున్నారు' అని చెప్పి చచ్చిపోయాడు. 

ఇక అక్కణ్నుంచి ప్రతాపుడు చరచరా అంత:పురానికి వెళ్లి గోడకున్న కత్తి లాగాడు. చిన్నాన్నను మట్టుపెట్టడానికి బయలుదేరాడు. కన్నాంబ వచ్చి ఏమిటంది. అన్నిటికీ చిన్నాన్నే కారణంట, అతన్ని కత్తికెర చేసి పితృఋణం తీర్చుకుంటాను అన్నాడు యితను. ఆమె నిదానించమంది. అతను వినలేదు. 'వెళ్లు, అగ్నిలో ఉరికే శలభాన్ని ఎవరాపగలరు?' అంది. అతను నివ్వెరపోయాడు. భర్త హత్యకు ప్రతీకారం తీర్చుకోవడానికి కొడుకు వెళుతుంటే యిలాగేనా ఆశీర్వదించడం? అని నిలదీశాడు. అప్పుడు ఆమె వివరించింది – 'ఇప్పుడు నాకు అర్థమౌతోంది ప్రచండుడి కుట్ర. నీ తండ్రి అనుచరులందరినీ మట్టుపెట్టి ఆ అకృత్యాలన్నీ నీ పేరుగా జరిపించాడు. నువ్వు ప్రజలకు విరోధివి. ఇంటా, బయటా శత్రువులు. ఆవేశానికి లోను కాకుండా నీ కర్తవ్యం నిర్వహించు' అని హితబోధ చేసింది. 

ఇక్కడ యువరాజుకంటె రాజమాతకే ఎక్కువ ఆలోచనాశక్తి వున్నట్టు మనకు బోధపడుతుంది. మర్నాడు ప్రతాపుడు అలంకరించుకుని కోట బయటకు వెళ్లబోయాడు. ద్వారపాలకుడు ఆపేశాడు. 'నువ్వెడివిరా నన్ను ఆపడానికి' అంటూ అరిచాడు యితను. ప్రచండుడు ప్రత్యక్షమయ్యాడు. 'నీ రక్షణ కోసమే నాయనా, యిది' అన్నాడు మెత్తని పులిలా. 'నువ్వూ నీ రక్షణానూ, నీ సంగతి తెలుసులే' అన్నట్టు ఒళ్లు మరిచి తిట్టబోయేడు ప్రతాపుడు. అప్పుడే వెనక్కాల, పక్కనా సైనికులు కత్తులు ఒరలోంచి లాగి రెడీగా వున్నారు. ప్రచండుడు ఊ అంటే పైన బడి బంధించేయడానికి.  ఆ సమయంలో రాజమాత ప్రత్యక్షమైంది. కొడుకుని తిట్టింది. 'మనసు చెదిరి వున్నాడు నాయనా, అతని మాటలు పట్టించుకోవద్దు' అని మరిదిని బతిమాలుకుంది. ఇదే నాకు ఈ సినిమాలో నచ్చే అంశం. హీరో శక్తిమంతుడయితే చాలు, అన్నీ చక్కబడతాయి అని చూపించదీ సినిమా. శక్తి, యుక్తి వున్నా సమయం కోసం ఆగాలి. అవతలివాడు ఎప్పటినుండో ప్లాను వేసుకుని వున్నాడు. ఓర్పు వహిస్తూ అంతశ్శత్రువును తుదముట్టించాలి. చాలా కష్టమైన కార్యం. అది ఎలా సాధించబడింది అని తెలుసుకోవాలన్న ఉత్సుకత రేకెత్తిస్తుంది. ఈ పరిస్థితుల్లో కన్నాంబ కొడుకుని లోపలికి తీసుకెళ్లి కొడుకుని మందలించింది. 'అనుకోకుండా ప్రచండుడు మంచే చేశాడు. నువ్వీ వేషంలో వెళితే ప్రమాదం కూడా. ప్రజలంతా నీపై పగ బట్టి వున్నారు. మారు వేషంలో సొరంగమార్గాన వెళ్లు' అంటూ అంతపురంనుండి బయటకు వెళ్లే ఓ మార్గం చూపించింది. 'కష్టకాలంలో అంత:పుర స్త్రీలు తప్పించుకునేందుకు తవ్విన సొరంగం యిది. ఊరి బయట విఘ్నేశ్వరాలయానికి చేరుస్తుంది. ప్రచండుడికి కూడా ఈ రహస్యం తెలియదు' అని చూపిస్తుంది. అప్పుడు కన్నాంబ యిష్టసఖి ఒకర్తె మాత్రం పక్కన వుంటుంది. ఆమె చూడడం సినిమా చివర్లో ఉపకరిస్తుంది.

కన్నాంబ గెస్‌ చేసినది కరక్టే. ప్రచండుడు మూకుమ్మడిగా ఖైదులో పడేయించి రోజుకి కొంతమంది చొప్పున బాణాలకు ఎరచేసి చంపేస్తున్నాడు. చంపేసేముందు 'యువరాజు ప్రతాపుడి ఆజ్ఞ ప్రకారం' అని సైనికుల చేత చదివిస్తున్నాడు. అలా చనిపోయినవారిలో రాజసులోచన అన్నగారు కూడా వున్నాడు. అతని శవం మీదనే ఆమె ప్రమాణం చేసింది – 'ఈ ప్రతాపుడిని చంపి తీరతాను' అని. ఆమెలాగానే ఆత్మీయులు పోగొట్టుకున్న రాజనాల, శివరావు, యింకా కొందరు వున్నారు. వాళ్లందరూ కలిసి విప్లవసంఘంగా ఏర్పడ్డారు. రాజుగారి ఖజానా కొల్లగొట్టారు. కొంతమంది పట్టుబడ్డారు. మర్నాడు వారిని ఉరితీయబోతున్నారు. వెళ్లి ఒక్కుమ్మడిగా పడి పోట్లాడదామా అంటే కావలసినంతమంది ప్రజలు వారి పక్షాన లేరు. 

అందువల్ల ఉపాయంతోనే పట్టుకోవాలి అనుకుని వాళ్లంతా డాన్సు పార్టీ కింద వెళ్లారు. జైలు కాపలా వాళ్ల దగ్గర కెళ్లి 'ఏటి ఒడ్డున మా ఊరు' అని పాట పాడి వాళ్లని రంజింపజేసి, వాళ్లు ఈ ఉషారులో వుండగా జైలు తాళంచెవులు కొట్టేసి వాళ్ల వాళ్లని విడిపించేసుకున్నారు. సంగతి గుర్తించి వాళ్లు వెంటపడ్డారు. రాజసులోచన వెంట కొంతమంది సైనికులు పడ్డారు. వారి బారినుండి ఆమె తప్పించుకుంటూ పరిగెత్తుకుని వచ్చింది. అక్కడ సామాన్య పౌరుడి వేషంలో ప్రతాపుడు కూచుని వున్నాడు. ఈమెను రక్షించాడు. వాళ్లు వెళ్లిపోయాక 'ప్రమీలా' అని పలకరించాడు. ఆమె తెల్లబోతే 'ఆ రోజు నన్ను కాపాడావుగా' అని గుర్తు చేశాడు. 'మీ అన్న యింటికి వస్తాను పద' అన్నాడు. 'ఇంకెక్కడి అన్న! ఆ ప్రతాపుడు పొట్టన పెట్టుకున్నాడు. విచారణైనా లేకుండా చంపేశాడు. ఆ ప్రతాపుణ్ని చంపందే నేను వదలను' అంది ప్రమీల. ఇతను గతుక్కుమన్నాడు. తనే ప్రతాపుడని తెలిస్తే ఏమంటుందో అనుకుని తన పేరు పరదేశి అని చెప్పాడు. తన తండ్రిది, పాత మహారాజుగారిది ఒకటే ప్రాణమనీ, ఆయన్ని చంపేశారు కాబట్టి విప్లవ వీరులకోసం వెతుకుతూ రాజధానికి వచ్చానని, అంతకంటె తన వివరాలు అడగవద్దనీ అన్నాడు. ఆమె విప్లవసంఘానికి పరిచయం చేస్తానంది. తెల్లవారబోతూండడంతో అతను వెళ్లి వస్తానని వచ్చేశాడు. తెల్లవారేసరికి మళ్లీ తన అంత:పురంలో వుండాలిగా.(సశేషం) 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (సెప్టెంబరు 2015)

[email protected]

Click Here For Archives