పోల్‌వాల్ట్ క్రీడ‌లో ప్రావీణ్యం ఉంటేనే…శ్రీ‌వారి ద‌ర్శ‌నం జంగ‌న్నా!

టీటీడీ నూత‌న పాల‌క మండ‌లి కూర్పుపై విస్తృత‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. ఎన్నిక‌ల ముంగిట కావ‌డంతో సామాజిక స‌మీక‌ర‌ణ‌ల‌కు పెద్ద‌పీట వేయాల‌ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ యోచిస్తున్న‌ట్టు స‌మాచారం. ఈ నేప‌థ్యంలో ఎమ్మెల్సీ, బీసీ నాయ‌కుడు…

టీటీడీ నూత‌న పాల‌క మండ‌లి కూర్పుపై విస్తృత‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. ఎన్నిక‌ల ముంగిట కావ‌డంతో సామాజిక స‌మీక‌ర‌ణ‌ల‌కు పెద్ద‌పీట వేయాల‌ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ యోచిస్తున్న‌ట్టు స‌మాచారం. ఈ నేప‌థ్యంలో ఎమ్మెల్సీ, బీసీ నాయ‌కుడు జంగా కృష్ణ‌మూర్తికి చైర్మ‌న్ ప‌ద‌వి ఖ‌రారైంద‌ని స‌మాచారం. నాలుగేళ్ల పాటు త‌న చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డికి అత్యున్న‌త ఆధ్యాత్రిక క్షేత్రమైన తిరుమ‌ల పాల‌క మండ‌లి అధ్య‌క్ష ప‌ద‌వి ఇచ్చి, ఎన్నిక‌ల్లో రాజ‌కీయ ల‌బ్ధి కోసం ఆరు నెల‌ల కాలానికి జ‌గ‌న్ బీసీ జ‌పం చేస్తున్నార‌నే విమ‌ర్శ ప్ర‌తిప‌క్షాల నుంచి వ‌స్తోంది.

ఈ నేప‌థ్యంలో జంగా కృష్ణ‌మూర్తికి టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌వి ఖ‌రారైంద‌నే స‌మాచారంతో ఆయ‌న అనుచ‌రులు ఖుషీగా ఉన్నారు. నిజానికి టీటీడీ లాంటి ప్ర‌తిష్టాత్మ‌క బోర్డులో చైర్మ‌న్‌గా, స‌భ్యుడిగా ఒక్క‌రోజు ఉన్నా చాల‌ని భావించే వాళ్లు ఎంతో మంది ఉన్నారు. అలాంటిది క‌నీసం ఆరు నెల‌లైనా ఆ ప‌ద‌వి ద‌క్క‌డం సంతోషించాల్సిన విష‌యమే. మ‌ళ్లీ జ‌గ‌న్ ప్ర‌భుత్వ‌మే వ‌స్తే జంగాను కొన‌సాగించొచ్చు.

జంగా కృష్ణ‌మూర్తికి చైర్మ‌న్ ప‌ద‌వి ద‌క్కినంత మాత్రాన తిరుమ‌ల వెళ్లి ఆయ‌న చేసేదేమీ లేద‌నే వాద‌న వుంది. ఎందుకంటే నాలుగేళ్ల‌లో వైవీ సుబ్బారెడ్డి చేసిందేమీ లేద‌క్క‌డ‌. అంతా తానై ధ‌ర్మారెడ్డి న‌డిపించారు. వైవీ సుబ్బారెడ్డైనా, రేపు వ‌చ్చే జంగా కృష్ణ‌మూర్తి అయినా నిమిత్త మాత్రులే.

జంగా కృష్ణ‌మూర్తి, ఆయ‌న అనుచ‌రులు రేపు శ్రీ‌వారిని ద‌ర్శించుకోవాలంటే ముందుగా పోల్‌వాల్ట్ క్రీడ‌లో ప్రావీణ్యం సంపాదించుకుని రావాల‌ని వైసీపీ నేత‌లు చెబుతున్నారు. ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్ విభాగంలో పోల్‌వాల్ట్ క్రీడ‌కు ప్రాధాన్యం వుంది. పొడ‌వైన క‌ర్ర‌ను ఉప‌యోగించి ఎక్కువ ఎత్తులో అమ‌ర్చిన అడ్డు కర్ర మీదుగా అవ‌త‌లి వైపు జంప్ చేయ‌డ‌మే పోల్ వాల్ట్ క్రీడ ప్ర‌త్యేక‌త‌. తిరుమ‌ల‌లో శ్రీ‌వారిని ద‌ర్శించుకోవాలంటే జంగా, ఆయ‌న అనుచ‌రులు ధ‌ర్మారెడ్డి అనే అడ్డు క‌ర్ర మీదుగా అంద‌నంతగా పైకి జంప్ చేయాల్సి వుంటుంది.  

ఎందుకంటే టీటీడీలో ధ‌ర్మారెడ్డి అంత శ‌క్తిమంతుడైన అధికారి. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్ట‌దంటారు. కానీ తిరుమ‌ల‌లో ధ‌ర్మారెడ్డి ఆజ్ఞ లేనిదే చైర్మ‌న్ అయినా, ఆయ‌న అనుచ‌రులైనా శ్రీ‌వారిని ద‌ర్శించుకోవ‌డం అసాధ్యమ‌ని అధికార పార్టీ నేత‌లు అంటున్న మాట‌. జంగా కృష్ణ‌మూర్తికి చైర్మ‌న్ ప‌ద‌వి ద‌క్కి, తిరుమ‌ల వెళ్లి ఆ సీటులో కుదురుకునే స‌రికే పుణ్య‌కాలం కాస్త క‌రిగిపోతుంది. 

ధ‌ర్మారెడ్డిని త‌ట్టుకుని తాను అనుకున్న‌ట్టు ద‌ర్శ‌నాలు ఇవ్వ‌డం చైర్మ‌న్ చేతిలో వుండ‌ద‌ని ప‌లువురు చెబుతున్నారు. జంగ‌న్నా… జ‌గ‌న‌న్న‌ను ప్ర‌స‌న్నం చేసుకుని చైర్మ‌న్ ప‌దవి ద‌క్కించుకున్నంత సులువు కాదు, ధ‌ర్మ‌న్న‌ను దాటుకుని శ్రీనివాసుని ద‌ర్శ‌నం చేసుకోవ‌డం అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

పి.ఝాన్సీ