ఎమ్బీయస్‌ : ఎయిర్‌పోర్టుకు ఎన్టీయార్‌ పేరు – 2

ఎన్టీయార్‌ తెలుగువాళ్లకు తెచ్చిన గుర్తింపు గురించి వేరే ఎవరూ చెప్పనక్కరలేదు. ప్రతి తెలుగువాడికి తెలుసు. జాతీయస్థాయిలోనే కాదు, తెలంగాణలో కూడా తెలుగు వాడకాన్ని పెంచి, హైదరాబాదుకు తెలుగుతనాన్ని అద్దిన ఘనత ఎన్టీయార్‌దే. రాజకీయంగా చూస్తే…

ఎన్టీయార్‌ తెలుగువాళ్లకు తెచ్చిన గుర్తింపు గురించి వేరే ఎవరూ చెప్పనక్కరలేదు. ప్రతి తెలుగువాడికి తెలుసు. జాతీయస్థాయిలోనే కాదు, తెలంగాణలో కూడా తెలుగు వాడకాన్ని పెంచి, హైదరాబాదుకు తెలుగుతనాన్ని అద్దిన ఘనత ఎన్టీయార్‌దే. రాజకీయంగా చూస్తే ఎన్టీయార్‌ ప్రభావం కోస్తా, రాయలసీమ కంటె తెలంగాణపైనే ఎక్కువ. తెలంగాణలోని పటేల్‌, పట్వారీ వ్యవస్థ కోస్తా, సీమల్లోని మునసబు, కరణాల వ్యవస్థ కంటె లోపభూయిష్టమైనది. అది రద్దు చేసినది ఎన్టీయారే. టిడిపి ఆవిర్భావానికి పూర్వం తెలంగాణ నాయకుల లిస్టు చూస్తే రెడ్డి, వెలమ నాయకులే ఎక్కువ కనబడతారు. అధిక సంఖ్యలో బిసిల పక్షాన నాయకులు అతి తక్కువ. తమిళనాడులో డిఎంకె పార్టీ ప్రాభవాన్ని, ఉత్తరప్రదేశ్‌, బిహార్‌లో లోహియా వారసుల రాజకీయోన్నతిని గమనించిన టిడిపి వ్యూహకర్తలు ఆంధ్రలో బిసిలలో నాయకత్వం పెంపొందించి, వారిలో చొచ్చుకుపోయారు. మురళీధరరావు కమిషన్‌ రిపోర్టు అమలు వంటి అనేక బిసి-అనుకూల చర్యలు చేపట్టినది ఎన్టీయారే. వీటి ప్రభావం తెలంగాణలోనే ఎక్కువగా కనబడింది. 

ఈ వారం గ్రేట్ ఆంధ్ర ఈ- పేపర్ కోసం క్లిక్ చేయండి

విద్యావంతులను, యువకులను రాజకీయాల్లోకి తీసుకుని వచ్చి, వారికి డబ్బు లేకపోయినా తన గ్లామర్‌తో గెలిపించి, పదవులు అప్పగించినది ఎన్టీయారే. అలా పైకి వచ్చిన తెలంగాణ రాజకీయనాయకులు యీరోజు ఎన్టీయార్‌ను వ్యతిరేకిస్తున్నారంటే అంతకంటె కృతఘ్నత వుండదు. తెలంగాణ కాంగ్రెసు నాయకులు అభ్యంతర పెట్టారంటే అర్థం వుంది. కాంగ్రెసును తుదముట్టించడమే తన జీవితలక్ష్యంగా పనిచేసిన ఎన్టీయారంటే ఆ పార్టీకి మంట వుండడం సహజం. కానీ టిడిపి నుండి కాంగ్రెసులోకి వచ్చిన అనేకమంది నాయకులు ఎన్టీయార్‌ తమ నుండి ఏమీ ఆశించకుండా తమను నాయకులను చేశాడని గుర్తుకు తెచ్చుకుంటే మాత్రం వారి నోరు పెగలదు. కాంగ్రెసును ఓడించి అధికారంలోకి వచ్చిన తెరాసకు కాంగ్రెసు దిగ్గజాలైన ఇందిర, రాజీవ్‌లను గడగడలాడించిన ఎన్టీయారంటే గౌరవం వుండాలి. ఉంటే యాగీ చేయకూడదు.

ఎన్టీయార్‌ను నటుడిగా అభిమానించి, కొడుక్కి పేరు పెట్టుకున్న కెసియార్‌ రాజకీయాల్లో తనను పైకి తీసుకొచ్చారు కాబట్టి కృతజ్ఞతతో యీ పేరుకు అభ్యంతర పెట్టకూడదని నేననను. ఎన్టీయార్‌ పట్ల కృతఘ్నతను కెసియార్‌ ఎప్పుడో చాటుకున్నారు. 1996 సంఘటనల్లో బాబుకి కుడిభుజంగా పనిచేసి క్యాంపులు నడిపినది కెసియారే. వైస్రాయ్‌ హీరో కెసియారే అని ఎర్రబెల్లి చెపుతున్నారు కూడా. కెసియార్‌కు సమయానికి తగినట్లు రంగులు మార్చగలరు. ఆనాడు బాబు వెన్నుపోటుకు సహకరించి మంత్రి పదవి పొందారు. అది మళ్లీ రాకపోయేసరికి దెబ్బలాడి బయటకు వెళ్లారు. సోనియాను దేవత అన్నారు, దెయ్యమన్నారు. తెలంగాణ ప్రకటిస్తే పార్టీ విలీనం చేస్తామన్నారు, తనకు పదవి అక్కరలేదన్నారు, యిచ్చినట్టు ప్రకటన రాగానే వెళ్లి ఫ్యామిలీ ఫోటో దిగారు. ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి సోనియాకూ జెల్లకాయ కొట్టారు. కాంగ్రెసు పార్టీ నుంచి ఎమ్మేల్యేలను లాక్కుని పార్టీని దివాళా తీయిస్తున్నారు. కృతజ్ఞత, సెంటిమెంటు అనేవి ఆయనకున్నట్లు తోచదు. ఉద్యమసమయంలో వాటేసుకుని తిరిగిన కోదండరామ్‌కు ఆర్నెల్లుగా ఎపాయింట్‌మెంట్‌ యివ్వటం లేదట. జయశంకర్‌ చచ్చిపోయి బతికిపోయారు. కొండా లక్ష్మణ్‌ బాపూజీ పేరు ఏదో సంస్థకు పెడతానంటున్నారు. చచ్చిపోయినపుడు చూడ్డానికి రాలేదు. ఆయన్ను వదిలేద్దాం.

ఈ వారం గ్రేట్ ఆంధ్ర ఈ- పేపర్ కోసం క్లిక్ చేయండి

కేంద్రం మమ్మల్ని సంప్రదించకుండా చేసింది అని అభ్యంతర పెడుతున్నారు. నిజమే, అది మర్యాద కాదు. కానీ అడిగిందనుకోండి ఒప్పుకునేవారా? అప్పుడు మేం వద్దన్నా పెట్టింది అని గోల చేసేవారు. అది డబల్‌ అఫెన్స్‌ అయ్యేది. దీని విషయం అడిగితే కేంద్రం ఏమంటోంది? పాత పేరే మళ్లీ పెట్టాం, కొత్తగా పెట్టేమాటయితే అడిగేవాళ్లమేమో అంటోంది. రాష్ట్రప్రమేయం లేకుండా అలా మార్చేయవచ్చా? అంటే గతంలో వైయస్‌ చేసినదేమిటన్న ప్రశ్న వస్తుంది. కేంద్రంలో తనకు పరపతి వుంది కాబట్టి ఎన్టీయార్‌ పేరు తీయించేశాడు. ప్రజాభిప్రాయ సేకరణ చేశారా? అసెంబ్లీలో తీర్మానం ఏదైనా చేశారా? అప్పుడు సోనియాది పవర్‌ కాబట్టి మొగుడి పేరు పెట్టించింది. ఇప్పుడది పోయింది. వీళ్ల రాజ్యంలో వీళ్లకు కావలసిన పేర్లు పెడతారు. మళ్లీ సోనియా వస్తే యీ సారి వాళ్ల నాన్న పేరు పెట్టిస్తుంది. అప్పుడు మాత్రం మనని అడుగుతుందా? అసెంబ్లీ తీర్మానం ప్రకారం నడుచుకుంటుందా? విభజన వద్దు అని అసెంబ్లీ తీర్మానం చేసి పంపితే ఏం చేశారు? ముక్కు తుడుచుకుని పడేశారు. 

అసలు కేంద్రం అంటేనే అత్తగారి టైపు. దివిసీమ ఉప్పెన నాటి సంఘటనల గురించి ఆనాడు సహాయక కార్యక్రమాలు నిర్వహించిన విజయవాడ నాస్తికకేంద్రం నిర్వాహకుడు లవణం గారు గతవారం ఆంధ్రభూమిలో వ్యాసం రాశారు. రాష్ట్రంలో కాంగ్రెసు ప్రభుత్వం అంటే కేంద్రంలోని జనతా పార్టీకి ఖాతరు వుండేదు కాబట్టి ఉప్పెనలో చనిపోయిన 18 వేల మంది శవాలు తీసేయడంలో సైన్యం సహకారం కావాలని వెంగళరావు ప్రభుత్వం అర్థిస్తే అప్పటి రక్షణశాఖా మంత్రి (చివరి నిమిషందాకా కాంగ్రెసుతోనే ఊరేగిన జగ్‌జీవన్‌ రామ్‌) ఒప్పుకోలేదట. దాంతో సామాజిక సంస్థలే ఆ పని చేపట్టాయట. అప్పట్లో మన రాష్ట్రం సంయుక్తంగా, రాజకీయంగా బలంగా వుండేది. పార్లమెంటులో మన ఎంపీలు 41 మంది వుండేవారు. అయినా దిక్కు లేకపోతే యిప్పుడిక ఏముంటుంది? 

ఈ వారం గ్రేట్ ఆంధ్ర ఈ- పేపర్ కోసం క్లిక్ చేయండి

విభజన బిల్లులోనే అడుగడుగునా కేంద్రం జోక్యం కనబడింది. ముఖ్యంగా తెలంగాణ పాలన విషయంలో చాలాభాగం నిర్ణయాలు కేంద్రానివే. ఈసప్‌ కథల్లో ఒక గుఱ్ఱానికి, జింకతో కలహం వచ్చి, మనిషిని వచ్చి జింకను వేటాడమంటుంది. జింకంత వేగంగా నేను పరిగెట్టలేను కదా అంటే నా మీద ఎక్కి స్వారీ చేసి, వేటాడు అంటుంది గుఱ్ఱం. జింకను చంపాక మనిషి కిందకు దిగనంటాడు. ఆ విధంగా గుఱ్ఱం మనిషికి బానిసవుతుందని కథ. తెలంగాణ నాయకులు అదే చేశారు. ఆంధ్రతో కలహం పెట్టుకుని కేంద్రాన్ని నెత్తికి ఎక్కించుకున్నారు. ఎలా విభజించుకోవాలన్న దానిపై సాటి తెలుగువాళ్లయిన ఆంధ్రులతో కెసియార్‌ ఒక్కసారైనా కూర్చున్నారా? 'ఈళ్లతో నాకేటి పంచాయితీ? నేను ఢిల్లీలో లాబీయింగ్‌ చేసుకుంటా' అంటూ ఏళ్లతరబడి అక్కడే కూర్చున్నారు. వాళ్లని మేనేజ్‌ చేసి అనుకున్నది సాధించారు. ఇవాళ కేంద్రం ఎవరు? దానికి మాతో పనేముంది? అంటే కుదురుతుందా? ఉమ్మడి రాజధాని అని పెడితే ఏం చేసారు? దానిలో శాంతిభద్రతలు గవర్నరు చేతికి యిస్తూంటే అడ్డుకోగలిగారా? పోలవరం గ్రామాలు అప్పగిస్తే కాదనగలిగారా? నదీజలాలు, విద్యుత్‌ పంపిణీ అన్నీ కేంద్రం చేతిలోనే వున్నాయి కదా. ఎలాగోలా రాష్ట్రం వస్తే చాలని అన్నిటికీ తలూపారు. ఇప్పుడు నెత్తి కొట్టుకుని ప్రయోజనమేముంది? (సశేషం) 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (నవంబరు 2014)

[email protected]

Click Here For Part-1