దొందూ దొందే…

పదేళ్లగా యుపిఏ పాలన చవి చూసిన భారత యువత కాంగ్రెసు, దాని మిత్రపక్షాల తరహాతో విసిగిపోయారు. మార్పు కోరుకున్నారు. ఆ మార్పు నేను తెస్తాను, నీతివంతమైన పాలన అందించి దేశప్రతిష్ట నిలబెడతాను, మీ అందరినీ…

పదేళ్లగా యుపిఏ పాలన చవి చూసిన భారత యువత కాంగ్రెసు, దాని మిత్రపక్షాల తరహాతో విసిగిపోయారు. మార్పు కోరుకున్నారు. ఆ మార్పు నేను తెస్తాను, నీతివంతమైన పాలన అందించి దేశప్రతిష్ట నిలబెడతాను, మీ అందరినీ అభివృద్ధి పథంలో నడిపిస్తాను అంటూ మోదీ ముందుకు వచ్చారు. ప్రజల హృదయాలు గెలిచి భారీ మెజారిటీతో గెలిచారు. మోదీ రాగానే స్వచ్ఛరాజకీయాలు వెల్లివిరుస్తాయని ఎందరో ఆశపెట్టుకున్నారు. ఆయన కరడుకట్టిన రాజకీయవేత్త అని, అధికారం నిలుపుకోవడానికి ఎంతకైనా తెగిస్తారనే మాట విస్మరించారు. బిజెపి ప్రభుత్వం ఏర్పడింది. ఆర్థికవిధానాల్లో యుపిఏ బాటలోనే వెళుతోంది. ఆరెస్సెస్‌ నినదించే స్వదేశీ విధానం చేతల్లో కనబడటం లేదు. డిజ్‌యిన్వెస్ట్‌మెంట్‌ వంటి ప్రపంచబ్యాంకు పథకాలే మరింత ఉధృతంగా నడుస్తున్నాయి. బ్లాక్‌ మనీ దారుల పేర్ల వెల్లడి విషయంలో, దాన్ని వెనక్కి రప్పించే విషయంలో యుపిఏ చెప్పిన సాకులే మోదీ సర్కారు చెపుతోంది. యుపిఏ హయాంలో వెనకనుండి చక్రం తిప్పిన అంబానీ తరహా కార్పోరేట్లు యిప్పుడు బాహాటంగా చక్రం తిప్పుతున్నారు. ఇక రాజకీయాల్లో నీతి గురించి మాట్లాడుకోవాలంటే అధికారంలోకి వస్తూనే ఒకప్పుడు కాంగ్రెసును తప్పుపట్టిన పంథాలోనే తనకు నచ్చని గవర్నర్లను యింటికి పంపించింది. ఎందుకు వెళ్లాలని ప్రశ్నించిన వాళ్లను అవమానించింది. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలి కాబట్టి ముందుగానే తన పార్టీ నాయకుణ్ని అక్కడికి గవర్నరుగా పంపింది. ఎన్నికల తర్వాత కశ్మీరులో, ఢిల్లీలో మహారాష్ట్ర తంతే రిపీట్‌ చేసినా ఆశ్చర్యపడనక్కరలేదు. కాంగ్రెసు తరహాలోనే మిత్రపక్షాలను కట్టడి చేయడానికి చూస్తోంది. కేంద్ర కాబినెట్‌లో చేరమని శివసేనకు కబురు పెట్టి వాళ్ల కాండిడేట్‌ ఎయిర్‌పోర్టులో దిగుతూండగానే శివసేన నుంచి సురేశ్‌ ప్రభును అప్పటికప్పుడు పార్టీలోకి తీసుకుని అతనికి రైల్వే వంటి అతి ముఖ్యమైన శాఖ కట్టబెట్టింది. శివసేనకు దిమ్మ తిరిగిపోయింది. 

ఈ వారం గ్రేట్ ఆంధ్ర ఈ- పేపర్ కోసం క్లిక్ చేయండి

శివసేనతో యిలా ఆటలాడుకోవడానికి దన్ను యిస్తున్నది ఎన్‌సిపి. మహారాష్ట్రలో జరుగుతున్నది అచ్చమైన కాంగ్రెసు తరహా రాజకీయం. ఎన్నికలలో ఎన్‌సిపి అవినీతిని ఎండగట్టి, యిప్పుడు వారి మద్దతుతోనే బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అవినీతి విషయంలో రాజీ పడుతుందని ఎడ్యూరప్పను పార్టీలోకి చేర్చుకున్నపుడే తెలిసింది. ఇప్పుడు ఎన్‌సిపి నాయకులను ఎలాగోలా రక్షిస్తుందని వూహించవచ్చు. ఏ హామీ లేకుండా మద్దతు యిచ్చేరకం కాదు శరద్‌ పవార్‌. ఓటింగు జరిగితే తమ పార్టీ గైరు హాజరవుతామని శరద్‌ పవార్‌ ధీమా కల్పించినా వారి మద్దతు తీసుకున్నట్లు బాహాటంగా కనబడడం బిజెపికి యిష్టం లేదు. అందుకనే ఓటింగు లేకుండా మూజువాణీ ఓటుతో లాగించేశారు. దానికి ముందు డ్రామా సాగింది. తమకు కొందరు ఇండిపెండెంట్లు, బహుజన్‌ వికాస్‌ అఘాడీ, మహారాష్ట్ర నవనిర్మాణ్‌ సేన వంటి చిన్న పార్టీలు – మొత్తం 18 మంది ఎమ్మెల్యేలు మద్దతు యిస్తారని ఫడ్నవీస్‌ చెప్పుకున్నారు. అయితే వాళ్లెవరూ గవర్నరుకు ఆ మేరకు లేఖలు యివ్వలేదు.  శరద్‌ ఆఖరి క్షణంలో దగా చేసినా, వీళ్లు చేయిచ్చినా అభాసుపాలు కాక తప్పదు. అందుకని శివసేన, కాంగ్రెసు నుండి ఫిరాయించడానికి ఎవరైనా దొరుకుతారాని వెతక నారంభించారు. ఇది తెలిసి, ఆ పార్టీ నాయకులు భయపడ్డారు. స్పీకరు పదవికై తమ పార్టీ అభ్యర్థిని నిలబెడితే క్రాస్‌ ఓటింగు జరుగుతుందేమోనన్న సందేహంతో స్పీకరును ఏకగ్రీవంగా ఎన్నుకుందామంటూ తమ అభ్యర్థులను ఉపసంహరించుకున్నారు. 

దాంతో బిజెపికి చెందిన హరిభావు బాగ్డే స్పీకరుగా ఎన్నికయ్యారు. ఎజెండాలో తర్వాతి ఐటమ్‌ ప్రతిపక్ష నాయకుణ్ని ఎన్నుకోవడం. అయితే బాగ్డే క్రమం తప్పించి, విశ్వాసతీర్మానం చేపట్టాడు. ఇలా ఆర్డర్‌ మార్చడాన్ని శివసేన ప్రతిఘటిస్తూండగానే స్పీకరు పట్టించుకోకుండా ముందు కెళ్లిపోయాడు. బిజెపివాళ్లు 'ఏయ్‌' అని, శివసేన, కాంగ్రెసు వాళ్లు 'నే' అని అరవగానే 'ఏయ్స్‌ హేవ్‌ యిట్‌' అని ప్రకటించి స్పీకరు విశ్వాసప్రక్రియ ముగించేశాడు. ఫడ్నవీస్‌ ప్రతిపక్షంలో వుండగా ఏ వివాదం వచ్చినా ఓటింగుకోసం పట్టుబట్టేవాడు. అలాటివాడు ముఖ్యమంత్రిగా వుండగా మూజువాణీ ఓటుపై ఆధారపడతాడని వీళ్లెవరూ అనుకోలేదు. ఓటింగు జరిగేటప్పుడు తమ సభ్యులందరూ వుంటారా, జారుకుంటారా అని చూసుకునే హడావుడిలో వుండగానే స్పీకరు 'ప్రభుత్వానికి మెజారిటీ వుంది' అని ప్రకటించేశాడు.  శివసేన నాయకుడు ఏక్‌నాథ్‌ షిండేను ప్రతిపక్ష నాయకుడిగా ప్రకటించే సమయానికి శివసేన, కాంగ్రెస్‌ మేల్కొని గగ్గోలు పెట్టాయి – ప్రభుత్వం యింకా తన మెజారిటీ చూపించుకోవాల్సి వుంది అని. స్పీకరు పట్టించుకోలేదు. సభ వాయిదా వేసేశాడు. 

ఈ వారం గ్రేట్ ఆంధ్ర ఈ- పేపర్ కోసం క్లిక్ చేయండి

అత్యంత నీతిమంతుడు, పద్ధతి గల మనిషి అని పేరుపడి, పారదర్శకమైన పాలన అందిస్తానని ప్రతిన చేసిన ఫడ్నవీస్‌ పాలన మొదటి అడుగు యింత లక్షణంగా పడింది. భగ్గుమన్న కాంగ్రెసు వాళ్లు విధాన భవన్‌ మెట్లమీద నిరసనగా కూర్చున్నారు. శివసేనవాళ్లు గవర్నరు కారుకి అడ్డుపడ్డారు. కాస్సేపటికి కారుని పోనిచ్చారు. వాళ్ల కంటె వీరత్వం చూపించుకోవడానికి కాంగ్రెసు వాళ్లు గవర్నరు కారులోంచి దిగకుండా నిరోధించారు. గవర్నరు భద్రతా సిబ్బంది వాళ్లను వెనక్కి నెట్టేశారు. ఆ గలభాలో విద్యాసాగరరావు చేతికి గాయాలయ్యాయి. అదే అదనుగా గవర్నరు ప్రసంగం తర్వాత బిజెపి మంత్రి ప్రతిపాదన మేరకు స్పీకరు ఐదుగురు కాంగ్రెసు ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేశారు – ఏకంగా రెండేళ్లపాటు! అదే హరీశ్‌రావును వూరిస్తోంది. నీతిమంతులని చెప్పుకునే బిజెపి వాళ్లా పని చేసినపుడు మనం యీ టిడిపి వాళ్లను ఏళ్ల తరబడి సస్పెండ్‌ చేస్తే తప్పేముంది అని ఆయన భావన. అన్నాళ్ల సస్పెన్షన్‌ అంటే ఆ నియోజకవర్గ ప్రజలకు ప్రాతినిథ్యం లేకుండా ప్రభుత్వం వేసిన భారీ శిక్ష అన్నమాట. ఈ విషయంలో బిజెపి కాంగ్రెసును మించి పోయిందనే చెప్పాలి. 

ఎమ్బీయస్‌ ప్రసాద్

[email protected]