అనాధాంధ్రప్రదేశ్‌.!

పాత పేరుతో ఏర్పడ్డ కొత్త రాష్ట్రం.. అనాధాంధ్రప్రదేశ్‌కి ఆరు నెలలు.! అయినా అదే నిర్లక్ష్యం… Advertisement ఎన్నికలకు ముందు అరచేతిలో స్వర్గం చూపిన చంద్రబాబు, నరేంద్ర మోడీ.. ఇద్దరికీ వంత పాడిన పవన్‌కళ్యాణ్‌ 13…

పాత పేరుతో ఏర్పడ్డ కొత్త రాష్ట్రం..
అనాధాంధ్రప్రదేశ్‌కి ఆరు నెలలు.!
అయినా అదే నిర్లక్ష్యం…

ఎన్నికలకు ముందు అరచేతిలో స్వర్గం చూపిన చంద్రబాబు, నరేంద్ర మోడీ.. ఇద్దరికీ వంత పాడిన పవన్‌కళ్యాణ్‌

13 జిల్లాలు, జిల్లాకో ఎయిర్‌ పోర్ట్‌.. గ్రిడ్లు, గాడిద గుడ్లు… ఇది చంద్రబాబు మాయ మాటలు

బిడ్డకు పురుడు పోసి తల్లిని చంపేశారు.. ఆంధ్రప్రదేశ్‌ అనాధ కాదు, మేమున్నాం.. ఇవి ఎన్నికల కోసం మోడీ చెప్పిన మాటలు.. ఎన్నికలు దాటాక హామీల్ని తగలేసిన వైనం..

రైల్వే జోనూ లేదు.. ప్రత్యేక ప్యాకేజీ లేదు.. ప్రత్యేక హోదా ఊసే లేదు.. నిధులూ లేవు, భరోసా అసలే లేదు.. అడుగడుగున దగా.. దగా.. దగా.!

జూన్‌ 2.. ఉమ్మడి తెలుగు రాష్ట్రం విడిపోయిన రోజు. ఆ రోజుతోనే 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ అవతరించింది. ఓ వారం రోజులు లేటుగా ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు సర్కార్‌ కొలువుదీరింది. ఆర్నెళ్ళ వయసు దాటేస్తోంది 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌కి. అయినా ఆంధ్రప్రదేశ్‌కి ఇప్పటిదాకా రాజధాని లేదు. తాత్కాలిక రాజధానిగా మాత్రం విజయవాడ వార్తల్లోకెక్కింది అంతే. గుంటూరు జిల్లాలో రాజధాని నిర్మిస్తామంటూ ఓ ‘మ్యాప్‌’ని ముఖ్యమంత్రి చంద్రబాబు తెరపైకి తీసుకొచ్చారు. భూముల్ని సేకరించాలి, రాజధానిని నిర్మించాలి. దానికోసం వేల కోట్లు ఖర్చు చేయాలి. ఇది నెల రోజుల్లోనో, ఏడాదిలోనో పూర్తయ్యే ప్రక్రియ కానే కాదు. చిత్తశుద్ధితో పూర్తి చేస్తే, మళ్ళీ ఎన్నికల నాటికి రాజధాని అనేది అందుబాటులోకి వచ్చేందుకు అవకాశం వుంటుంది. అంత కష్టమైన రాజధాని నిర్మాణం విషయంలో ఎంత ఖచ్చితంగా, ఎంత చిత్తశుద్ధితో పాలకులు పనిచేయాల్సి వుంటుందో ఒక్కసారి ఊహించుకోండి.!

రాజధాని ఒక్కటే కాదు, సమస్యలు సవాలక్ష వున్నాయ్‌

ఒకప్పుడు హైద్రాబాద్‌, తెలుగు ప్రజలకు రాజధాని. శ్రీకాకుళం నుంచి చిత్తూరుదాకా.. 13 జిల్లాల నుంచి హైద్రాబాద్‌కి వెళ్ళి అక్కడే సెటిలైపోయారు చాలామంది. సొంతూళ్ళో ఆస్తులమ్ముకుని, హైద్రాబాద్‌లో వివిధ రంగాల్లో పెట్టుబడి.. అక్కడే స్థిరపడ్డారు. తద్వారా 13 జిల్లాల్లో అభివృద్ధి అనే మాటకు ఆస్కారమే లేకుండా పోయింది. చాలా గ్రామాలు మ్యాప్‌లోంచి చెరిగిపోయాయనడం అతిశయోక్తి కాదేమో.

ఈ వారం గ్రేట్ ఆంధ్ర ఈ- పేపర్ కోసం క్లిక్ చేయండి

అలాంటి 13 జిల్లాలు పాత పేరుతో కొత్త రాష్ట్రంగా ఏర్పడినప్పుడు, అక్కడి ఆర్థిక, సామాజిక పరిస్థితులు ఎలా వుంటాయో ఊహించుకోవడమే కష్టం. ఒకటా? రెండా? సవాలక్ష సమస్యలు. అన్నిటికీ పరిష్కారం చూపాల్సిన బాధ్యత అధికారంలో వున్నవారిపైనే వుంటుంది. విభజించినోళ్ళెలాగూ బాధ్యతారాహిత్యంతోనే ఆ పని చేశారు. ఆ మాటకొస్తే కక్షపూరితంగా వ్యవహరించారన్న ఆవేదన సీమాంధ్రుల్లో ఇప్పటికీ వ్యక్తమవుతోంది. అందుకే, విభజించిన పార్టీకి అడ్రస్‌ లేకుండా చేసేశారు తమ రాష్ట్రంలో. మరి ఇప్పుడు అధికారంలో వున్నవారు చేయాల్సిందేమిటి.? చేస్తున్నదేమిటి.? అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారు తప్ప, ఒక్క విషయంలోనూ వడివడిగా ముందడుగు పడటంలేదు. ప్రపంచ స్థాయి రాజధాని.. ప్రపంచ స్థాయి నగరాలు.. ప్రపంచం మెచ్చే పారిశ్రామిక విధానం.. ఇవీ కబుర్లు. కబుర్లు కాకులెత్తుకెళ్ళినట్టు తయారవుతోంది వ్యవహారం.

ఆర్నెళ్ళు సరిపోలేదా.?

ప్యాకేజీపై తేల్చడానికీ, ప్రత్యేక హోదాపై స్పష్టత ఇవ్వడానికీ కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్‌కి ఆర్నెళ్ళ కాలం సరిపోలేదంటే కాస్తంత ఆశ్చర్యం కలిగించకమానదు. వాస్తవానికి మన్మోహన్‌ సర్కార్‌, ప్రత్యేక ప్యాకేజీ.. ప్రత్యేక హోదాలపై కొంతమేర కసరత్తులు చేసిందట. అది ఎన్నికల్లో పబ్లిసిటీ కోసం కాంగ్రెస్‌ పార్టీకి ఉపయోగపడిందేమో.! విభజన చట్టంలో ప్రత్యేక ప్యాకేజీ, హోదా వంటి అంశాల్లేనప్పుడే చాలామందికి అనుమానమొచ్చింది.. రాజ్యసభ సాక్షిగా మన్మోహన్‌సింగ్‌ 13 జిల్లాల్లోని సీమాంధ్రుల్ని మభ్యపెట్టారని. అదే నిజమయ్యిందిప్పుడు. సీమాంధ్రులపై సవతి ప్రేమ.. అంటూ ఎన్నికల సమయంలో రాజకీయ ప్రసంగాలు చేసిన నరేంద్ర మోడీ, ప్రధాని అయ్యాక.. ప్యాకేజీ, ప్రత్యేక హోదాల గురించి మాత్రం పెదవి విప్పడంలేదు. ‘ప్యాకేజీ సంగతేం చేశారు.? ప్రత్యేక హోదా గురించి మాట్లాడరేం.? రాజధానికి నిధులు ఎప్పుడిస్తారు.?’ ఇలాంటి ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్‌ నుంచి కేంద్రం దృష్టికి వెళ్తున్నా, కేంద్రం నుంచి మౌనమే తప్ప, సమాధానం రావడంలేదు. వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్‌.. కొత్తగా సుజనా చౌదరి.. ఏపీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తోన్న కేంద్ర మంత్రులు. కానీ, ఈ ముగ్గురితో ఆంధ్రప్రదేశ్‌కి ఒరిగేదేమీ కన్పించడంలేదు.

ఆదాయం పెరిగింది కదా.!

ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితి మరీ అంత అధ్వాన్నంగా లేదు. విభజనతో ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక పరిస్థితిపై అనేక అనుమానాలు వ్యక్తమైనా, పరిస్థితి కాస్త బాగానే వుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌ని ఇలా అభివృద్ధి చేస్తా.. అని చెప్పడం వల్లనేనేమో.. రియల్‌ ఎస్టేట్‌ రంగం ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్‌లో విజృంభించింది. పారిశ్రామికవేత్తలూ ఆంధ్రప్రదేశ్‌ వైపు వడివడిగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతానికైతే మూమెంట్‌ కన్పిస్తోందిగానీ, కొత్తగా ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క పరిశ్రమ కూడా నెలకొనకపోవడం కాస్తంత ఇబ్బందికరమైన అంశం.

ఈ వారం గ్రేట్ ఆంధ్ర ఈ- పేపర్ కోసం క్లిక్ చేయండి

కారణమేదైనా, 13 జిల్లాల నుంచి రాష్ట్ర ఖజానాకు బాగానే ఆదాయం అందుతోంది. లోటు బడ్జెట్‌తో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడినా, అప్పటి లోటు తీవ్రత ఇప్పుడు లేదనే చెప్పాలి. ఇదే, ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా ఇచ్చే విషయమై కేంద్రం వెనుకడుగు వేయడానికి కారణమన్న ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే అంతకన్నా దారుణమైన విషయం ఇంకొకటుండదు. ఎందుకంటే, ఎంత ఆదాయం వచ్చినా, ఆంధ్రప్రదేశ్‌కి వున్న ఖర్చులు అన్నీ ఇన్నీ కావు. రాజధాని నిర్మాణం ఆంధ్రప్రదేశ్‌కి అత్యంత కష్టమైన వ్యవహారం.

ఉద్యోగ ఉపాధి అవకాశాలెక్కడ.?

ఆదాయం సంగతి అటుంచితే.. ఆంధ్రప్రదేశ్‌లోని యువత, ఉద్యోగ ఉపాధి అవకాశాల విషయమై తీవ్ర ఆందోళనతో వున్నారు. ‘మేం అధికారంలోకొస్తే ఇంటికో ఉద్యోగం..’ అని ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు హామీలు గుప్పించేశారు. పారిశ్రామికాభివృద్ధి జరిగితే తప్ప ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగేందుకు ఛాన్స్‌ లేదు. కానీ, పారిశ్రామికాభివృద్ధి జరగాలంటే, పాలకులు పారిశ్రామికవేత్తలకు భరోసా కల్పించాలి. కానీ, ఆ భరోసా మాటలకే తప్ప, చేతల్లో కన్పించని పరిస్థితి. కేంద్రం గనుక ప్రత్యేక ప్యాకేజీల్ని ప్రకటిస్తే, రాష్ట్ర ప్రభుత్వం ఇంకాస్త వెసులుబాట్లు కల్పిస్తే తప్ప పారిశ్రామికాభివృద్ధి ఆంధ్రప్రదేశ్‌లో సాధ్యం కాదు. కేంద్రమేమో.. ప్యాకేజీ, ప్రత్యేక హోదా అంటేనే ఆమడదూరం పారిపోతోన్న పరిస్థితి. దాంతో, అభివృద్ధి, ఉపాధి అవకాశాలన్నీ గాల్లో దీపంలా తయారయ్యాయి.

మేమున్నాం.. అన్నారు.. ఇప్పుడు మౌనం దాల్చుతున్నారు

‘సీమాంధ్రులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు.. మేం అధికారంలోకి వస్తున్నాం.. కాంగ్రెస్‌ అన్యాయం చేసిపోతోంది.. మేం న్యాయం చేస్తాం..’ అంటూ వెంకయ్యనాయుడు ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజన సమయంలో సీమాంధ్రుల్ని ఉద్దేశించి చాలా మాటలే చెప్పారు. కానీ, ఇచ్చిన మాటకు కట్టుబడి ఆంధ్రప్రదేశ్‌ని ఆదుకునే విషయంలో మాత్రం చిత్తశుద్ధి చూపలేకపోతున్నారాయన.

ఈ వారం గ్రేట్ ఆంధ్ర ఈ- పేపర్ కోసం క్లిక్ చేయండి

కేంద్ర మంత్రిగా, బీజేపీ సీనియర్‌ నేతగా, అధిష్టానంలో ఒకరిగా.. వెంకయ్యనాయుడికి ఢల్లీి వేదికగా మంచి పేరు, పలుకుబడి వున్నా.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా ఆయన ఏమీ చేయలేకపోతున్నారెందుకని.? ప్రధాని నరేంద్ర మోడీ హామీల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. విశాఖపట్నం మహా నగరాన్ని స్మార్ట్‌ సిటీగా చేస్తామని అమెరికాలో చెప్పారట. ఆ విషయాన్నే తుపాను బీభత్సంతో విశాఖ విలవిల్లాడినప్పుడు విశాఖ పర్యటనలోనూ సెలవిచ్చారాయన. ఏం లాభం.? తుపాను వచ్చింది, వెళ్ళింది.. తుపాను నష్టం అంచనా వేయడానికే తాపీగా కేంద్ర బృందాన్ని పంపిన ఘనత మోడీ సర్కార్‌ది. లక్ష కోట్లకుపైగానే నష్టం వాటిల్లింది హుద్‌హుద్‌ తుపాను కారణంగా ఆంధ్రప్రదేశ్‌కి. అందులో సగం కాదు కదా, పదో వంతు అయినా కేంద్రం ఇప్పటిదాకా సహాయం కింద అందించిందా? అంటే అదీ లేదు.

స్మార్ట్‌ సిటీలు, గ్రిడ్లు.. ఏంటీ కథ.?

ఆంధ్రప్రదేశ్‌లో పదమూడో, పధ్నాలుగో స్మార్ట్‌ సిటీలు కడ్తారట ముఖ్యమంత్రి చంద్రబాబు. హాస్యాస్పదం కాకపోతే, ఒక్క స్మార్ట్‌ సిటీ కట్టేందుకే ఐదేళ్ళ సమయం సరిపోదు.. అలాంటిది పధ్నాల్గు స్మార్ట్‌ సిటీలంటే ఆషామాషీ వ్యవహారమా.? ‘ది గ్రేట్‌ అడ్మినిస్ట్రేటర్‌’ అని తన గురించి తాను చెప్పుకునే చంద్రబాబు, వాస్తవాలు తెలియకుండానే, మాస్టర్‌ ప్లాన్స్‌ని ఎలా రూపొందించేస్తున్నారో ఎవరికీ అర్థం కాని ప్రశ్న. ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్‌ గాడిన పడేందుకు ఐదేళ్ళ సమయం సరిపోదేమో. అలాంటిది, స్మార్ట్‌ సిటీలనీ, ప్రపంచ స్థాయి రాజధాని అనీ, ఇంకోటనీ.. ఏ ఒక్కటీ లక్ష కోట్లకు తక్కువ కాకుండా పదో పాతికో ప్రాజెక్టుల్ని చంద్రబాబు ప్రకటించేయడం నవ్వు తెప్పించకుండా ఎలా వుంటుంది.? జిల్లాకి ఓ ఎయిర్‌ పోర్ట్‌ అని చంద్రబాబు అసెంబ్లీలో సెలవిచ్చారు. వున్న ఎయిర్‌ పోర్ట్‌ల్లో సౌకర్యాలను మెరుగుపర్చేందుకు ఈ ఆర్నెళ్ళలో చంద్రబాబు సర్కార్‌ తీసుకున్న చర్యలేమిటి.? అన్న ప్రశ్నకే ఆయన వద్ద సమాధానం లేని పరిస్థితి.

దెబ్బ మీద దెబ్బ.. ఇలాగైతే భవిష్యత్తు ఎలా.?

విభజనతో ఆంధ్రప్రదేశ్‌ తీవ్రంగా నష్టపోయింది. తుపాను దెబ్బకి ఇంకా తీవ్రంగా నష్టపోయింది. దెబ్బ మీద దెబ్బ అంటే ఇదే. ఆర్థిక రాజధానిగా ఎదుగుతుందనుకున్న విశాఖపట్నం, ఇప్పుడు ‘నన్నెవరు ఆదుకుంటారు.?’ అని బేలగా చూస్తోంది. విశాఖ ప్రజల ఉక్కు సంకల్పం కారణంగా విశాఖ త్వరగానే తేరుకున్నా, విశాఖకు జరిగిన నష్టం అంతా ఇంతా కాదు.

ఈ వారం గ్రేట్ ఆంధ్ర ఈ- పేపర్ కోసం క్లిక్ చేయండి

తుపాను అప్పటికప్పుడు సృష్టించిన బీభత్సం కంటే ఎక్కువగా, విశాఖ భవిష్యత్తు మీద దెబ్బ తగిలింది. ‘ఛలో విశాఖ..’ అంటూ ఉవ్విళ్ళూరిన కొందరు పారిశ్రామికవేత్తలు విశాఖ వైపు వెళ్ళే విషయమై కాస్త ఆలోచించారు హుద్‌హుద్‌ తుపాను తర్వాత. తుపాన్లు, భూకంపాలు అనేవి ప్రకృతి వైపరీత్యాలే అయినా, పారిశ్రామికవేత్తల మైండ్‌ సెట్‌పై మాత్రం అవి తీవ్రంగానే ప్రభావం చూపుతాయి. ఐటీ రంగంలో వెలిగిపోతుందనుకున్న విశాఖలో కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు ఏ సంస్థా ఇప్పుడూ ముందుకు రావడంలేదు. ఐటీలో విశాఖను అగ్రగామిగా చేస్తాం.. అని చెప్పిన చంద్రబాబు సర్కార్‌, హుద్‌హుద్‌ తుపాను తర్వాత ఐటీ రంగం తేరుకునేలా చేసేందుకు శరవేగంగా చర్యలు తీసుకుని వుంటే పరిస్థితి ఇంకోలా వుండేది. తుపాను దెబ్బకన్నా సర్కార్‌ నిర్లక్ష్యం విశాఖ ఇమేజ్‌ని చెడగొడ్తోందనేది చాలామంది ఆవేదన.

భరోసా కల్పించలేకపోతున్న ప్రభుత్వమిది..

రాజధాని కోసం రైతులు భూములిచ్చేయడానికి సిద్ధంగా వున్నారని చంద్రబాబు అండ్‌ టీమ్‌ గతంలో చెప్పింది. ‘ఎల్లో మీడియా’ కూడా ఆ దిశగానే ప్రచారం షురూ చేసింది. మొదట్లో అంతా సాఫ్ట్‌గానే కన్పించింది. రానురాను పరిస్థితులు మారిపోయాయి. రైతుల భయాల్ని పోగొట్టడంలో సర్కార్‌ విఫలమైంది. భూములిచ్చే విషయమై రైతులు ఎదురుతిరిగారు. ప్రస్తుతం రాజధాని ప్రతిపాదిత ప్రాంతాల్లో రైతులెవరూ భూములిచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయడంలేదంటే పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. ల్యాండ్‌ పూలింగ్‌కి సహకరిస్తే సరే సరి.. లేదంటే భూ సేకరణ చట్టం వుందిగా.. అన్నది చంద్రబాబు అండ్‌ టీమ్‌ వ్యూహం. భరోసా కల్పించి, ప్రజల్ని రాజధాని నిర్మాణంలో భాగస్వాముల్ని చేయాల్సిన సర్కార్‌, బలవంతంగా భూముల్ని సేకరించి, రాజధాని నిర్మించాలనుకుంటే.. అది అంత తేలిగ్గా అయ్యే వ్యవహారమే కాదు.

ప్రశ్నిస్తానన్న పవర్‌స్టార్‌ ఏడీ ఎక్కడా.?

నేను మద్దతిచ్చిన ప్రభుత్వమైనా సరే.. తప్పు చేస్తే ప్రశ్నిస్తా.. అని ఎన్నికల సమయంలో హడావిడి చేసిన జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌, రైతులు రోడ్డెక్కి మా జీవితాల్ని నాశనం చెయ్యొద్దు.. అని నెత్తీనోరూ బాదుకుంటున్నా.. ప్రశ్నించడానికి రావడంలేదాయె.  రాజధాని విషయంలో జరుగుతున్న గందరగోళం గురించే కాదు, కేంద్రం ఆంధ్రప్రదేశ్‌ని ఆదుకునే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా సీన్‌లో ఎక్కడా పవన్‌కళ్యాణ్‌ కన్పించడంలేదు. ‘ఎన్నికల ఎపిసోడ్‌ వరకే నా పాత్ర పరిమితం..’ అన్న చందాన పవన్‌ వ్యవహరిస్తారని అతని అభిమానులు సైతం ఊహించలేదు. తుపాను బాధితుల్ని పరామర్శించడం, బాధితుల కోసం సీఎం రిలీఫ్‌ ఫండ్‌కి ఆర్థిక సహాయం ప్రకటించడం వరకూ బాగానే వున్నా.. ఓ పార్టీకి అధినేతగా, ప్రజల్ని ఓట్లడిగిన రాజకీయ నాయకుడిగా.. ప్రజల పక్షాన నిలబడాల్సిన పవన్‌.. నాయకత్వ లక్షణాల్ని ప్రదర్శించకపోవడం శోచనీయం.

ఈ వారం గ్రేట్ ఆంధ్ర ఈ- పేపర్ కోసం క్లిక్ చేయండి

ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రి వున్నారు.. ఆదుకుంటానని చెప్పిన వ్యక్తి నరేంద్ర మోడీ భారతదేశానికి ప్రధానిగా వున్నారు.. ప్రజలకు కష్టమొస్తే ప్రభుత్వాల్ని ప్రశ్నిస్తా.. అని ఎన్నికల సమయంలో చంద్రబాబుకీ, మోడీకీ మద్దతుగా ప్రచారం చేస్తూ ప్రజలకు భరోసా ఇచ్చేలా ప్రసంగాలు చేసిన పవన్‌ కళ్యాణ్‌ ఎంచక్కా సినిమాల్లో వున్నారు. కానీ.. అందరూ కలిసి ఆంధ్రప్రదేశ్‌ని అనాధలా వదిలేశారు.. కాదంటారా.?

-సింధు