వెనకటికి ఓ పెద్దాయిన దగ్గరకి చెరువు తవ్విస్తున్నాం..డొనేషనివ్వండి అని వెళ్తే, బకెట్ నీళ్లు నా చందా అన్నాడట. అలాగ్గా వుంది సూపర్ స్టార్ మహేష్ బాబు, సూపర్ డైరక్టర్ త్రివిక్రమ్, హీరోయిన్ సమంత వ్యవహారం.
మేము సైతం కార్యక్రమానికి అందరు నటులు ఏదో ఒకటి చేయాలంటే, ఈ ముగ్గురు కలిసి ఏదో చేస్తున్నారని గుప్పుమంది. అబ్బో అత్తారింటికి దారేదిలో అహల్య ఎపిసోడ్ లా త్రివిక్రమ్ ఏదో విరగదీస్తారనుకుంటూ, ముగ్గరు కూర్చుని ముచ్చట్లు పెట్టుకుని, రికార్డు చేసి, ఇదే మా వంతు అని చూసి తరించమన్నారు.
ఈ వ్యవహారం ఇవ్వాళ కొత్తదా. సినిమా విడుదలైనపుడల్లా హీరోలు, హీరోయిన్లు, డైరక్టర్లు చానెళ్ల చుట్టూ తిరుగుతూ ముచ్చట్లు పెడుతూనే వున్నారు. ఇలాంటి వైనాలు చూసి చూసి బోరెత్తింది. అంతకు మించి ఏముంది ఇందులో.
వినోద కార్యక్రమం అన్నపుడు వినోదం పండించాలని, అరకొర తెలుగుమాటలు, అరకొర సమాధానాలు, ముసిముసినవ్వులు…ఏం చేస్తాం..మేం చేసింది చూడండి..మీరు ఆశించేది చేయలేం అనే స్థితికి చేరిపోయారు మన టాలీవుడ్ జనాలు.