అమ‌రావ‌తిపై హైకోర్టు మ‌రో ఆదేశం

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి అంశం టీవీ సీరియ‌ల్‌ను త‌ల‌పిస్తోంది. ఏపీలో మూడు ప్రాంతాలు స‌మానంగా అభివృద్ధి చెందాలంటూ జ‌గ‌న్ ప్ర‌భుత్వం మూడు రాజ‌ధానుల‌ను తెర‌పైకి తెచ్చింది. ఈ మేర‌కు చ‌ట్ట‌స‌భ‌ల్లో బిల్లుల‌ను కూడా చేసింది.…

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి అంశం టీవీ సీరియ‌ల్‌ను త‌ల‌పిస్తోంది. ఏపీలో మూడు ప్రాంతాలు స‌మానంగా అభివృద్ధి చెందాలంటూ జ‌గ‌న్ ప్ర‌భుత్వం మూడు రాజ‌ధానుల‌ను తెర‌పైకి తెచ్చింది. ఈ మేర‌కు చ‌ట్ట‌స‌భ‌ల్లో బిల్లుల‌ను కూడా చేసింది. ఇంత వ‌రకూ బాగుంది. అయితే ప్ర‌భుత్వం అనుకున్న‌దొక‌టైతే, హైకోర్టు ఆదేశాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. 

ఈ నేప‌థ్యంలో హైకోర్టు ఆదేశాల‌ను జ‌గ‌న్ ప్ర‌భుత్వం అమ‌లు చేయ‌కుండా కోర్టు ధిక్క‌ర‌ణ‌కు పాల్ప‌డుతోంద‌ని పిటిష‌న్ దాఖ‌లైంది. దీనిపై విచారించిన హైకోర్టు గురువారం మ‌రో ఆదేశం ఇవ్వ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. అస‌లేం జ‌రిగిందంటే…

ఏపీ ప్ర‌భుత్వం తీసుకొచ్చిన సీఆర్‌డీఏ ర‌ద్దు చ‌ట్టం, మూడు రాజ‌ధానుల బిల్లుల‌ను వ్య‌తిరేకిస్తూ హైకోర్టులో కొంద‌రు వ్యాజ్యాలు వేశారు. ఈ వ్యాజ్యాల‌పై హైకోర్టు తుది తీర్పు తీవ్ర సంచ‌ల‌నం రేకెత్తించింది. రాజ‌ధానిపై చ‌ట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేనే లేద‌ని హైకోర్టు కొట్టిప‌డేసింది. అస‌లు అధికారం లేన‌ప్పుడు కొత్త చ‌ట్టాలు ఎలా చేస్తార‌ని హైకోర్టు ప్రశ్నించింది. 

సీఆర్‌డీఏ చ‌ట్టం రద్దు కుద‌ర‌ద‌ని స్ప‌ష్టం చేసింది. అలాగే మూడు రాజ‌ధానుల బిల్లును కొట్టేసింది. మూడు నెల‌ల్లోపు అమ‌రావ‌తిని రాజ‌ధానిగా అభివృద్ధి చేసి వాటాదార్ల‌కు ప్లాట్లు ఇవ్వాల‌ని పేర్కొంది. అలాగే ఆరు నెల‌ల్లోపు  ప్లాట్లకు మౌలిక స‌దుపాయాలు క‌ల్పించాల‌ని, మాస్ట‌ర్‌ప్లాన్‌లో ఉన్న‌ది ఉన్న‌ట్టు చేయాల‌ని హైకోర్టు ఆదేశించింది. ఇందుకు సంబంధించి ప్ర‌తినెలా ప్రోగ్రెస్ రిపోర్ట్ త‌మ‌కు ఇవ్వాల‌ని ధ‌ర్మాస‌నం ఆదేశించింది.

అయితే హైకోర్టు ఆదేశాలు అమ‌లు చేయాలంటే ల‌క్ష‌లాది కోట్ల డ‌బ్బు అవ‌స‌ర‌మ‌ని, ఆచ‌ర‌ణ సాధ్యం కాద‌ని ఇటీవ‌ల హైకోర్టులో ప్ర‌భుత్వం అఫిడ‌విట్ దాఖ‌లు చేసింది. ఈ అఫిడ‌విట్‌లో అనేక కీల‌క అంశాల‌ను పొందుప‌రిచారు. ఈ నేప‌థ్యంలో ఏపీ ప్ర‌భుత్వం హైకోర్టు ఆదేశాల‌ను అమ‌లు చేయ‌కుండా కోర్టు ధిక్క‌ర‌ణ‌కు పాల్ప‌డుతోంద‌ని పిటిష‌న్ వేశారు. ఈ పిటిష‌న్‌పై విచారించిన హైకోర్టు ధ‌ర్మాస‌నం ఇవాళ కీల‌క ఆదేశాలు జారీ చేసింది.

అమ‌రావ‌తిపై స్టేట‌స్ రిపోర్ట్ ఇవ్వాల‌ని హైకోర్టు ఆదేశించింది. త‌దుప‌రి విచార‌ణ‌ను జూలై 12కి వాయిదా వేసింది. దీంతో  హైకోర్టు తుది తీర్పు మొద‌లుకుని ఇప్ప‌టి వ‌ర‌కు అమ‌రావ‌తిలో ప్ర‌భుత్వం ఏం చేసింద‌నే అంశంపై నివేదిక ఇవ్వాల్సి వుంటుంది. ఇటీవ‌ల అమ‌రావ‌తిలో నిర్మాణాల‌పై ప్ర‌భుత్వం దృష్టి పెట్టిన‌ట్టు వార్త‌లొచ్చాయి. అయితే ప్ర‌భుత్వం చేప‌ట్టాల‌నుకుంటున్న అభివృద్ధి ప‌నులు ఏఏ శాఖ‌ల‌కు సంబంధించిన‌వో హైకోర్టుకు నివేదించే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది.