పవన్ కల్యాణ్ జనసేన అధ్యక్షుడు. కేఏ పాల్ ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు. ఇద్దరికీ రెండు తెలుగు రాష్ట్రాల అసెంబ్లీలలో ఎంట్రీ లేదు. పవన్ పార్టీ తరపున ఒకే ఒక్క ఎమ్మెల్యే గెలిచినా ఆయన ఇప్పుడు పార్టీలో లేరు.
సో.. రెండు పార్టీల స్కోరు జీరో. మరి ఈ ఇద్దరిలో మేధావి ఎవరు? తెలంగాణలో రైతుల్ని పరామర్శిస్తానని వచ్చి, టీఆర్ఎస్ అభిమానులతో దెబ్బలు తిని అక్కడ నేనున్నానంటూ జనాలకి ఓ మెసేజ్ పంపిస్తున్న పాల్ మేధావా..? లేక అన్నీ అయిపోయిన తర్వాత తన కాల్షీట్లు ఖాళీ చూసుకుని వచ్చి జనంతో సీఎం సీఎం అనిపించుకుని సంతోషిస్తున్న పవన్ మేధావా..?
నిజంగా పాల్ చెప్పినట్టు.. ప్రజాశాంతి పార్టీతో పవన్ చేయి కలిపితే సరిపోయేదేమో.. పాల్ స్ట్రాటజీలు మామూలుగా లేవు, పవన్ కి అవి ఏమైనా కాస్త హెల్ప్ అయ్యేవేమో..?
రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన కంటే కేఏ పాల్ తెలంగాణ పరామర్శ యాత్ర ఈమధ్య బాగా హైలెట్ అయింది. అసలీ పాల్ ఎవరు, తెలంగాణ వాసులపై ఆయనకి ఎందుకంత ప్రేమ.. అనే విషయాలన్నీ చర్చకు వచ్చాయి. పాల్ ని తెలివి తక్కువగా అంచనా వేసినవారంతా ఆయనకు వచ్చిన ప్రమోషన్ చూసి షాకవుతున్నారు.
చంద్రబాబుకైనా చెప్పుకోడానికి మూడు ఛానెల్స్ ఉన్నాయి కానీ, పాల్ నేరుగా ఎవరికీ డబ్బులిచ్చేంత సీన్ లేదు. మీడియాని మేనేజ్ చేసేంత అవకాశం లేదు. అయినా పాల్ అక్కడ టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారారు. రైతుల కోసం తనపై దాడి జరిగినా వెనకాడనంటూ సీన్ రక్తి కట్టించారు.
పవన్ కల్యాణ్ కనీసం ఆ స్థాయిలో అయినా జనం కోసం నిలబడ్డారా. పాల్ పై కనీసం అక్కడ కొద్దో గొప్పో సింపతీ వచ్చింది. ఇక్కడ పవన్ పై అది కూడా లేదు. పైగా సీఎం సీఎం అంటూ అభిమానుల రొదే కానీ, ఫలితం లేదు. జనసేనతో అగ్రిమెంట్ కుదుర్చుకున్న ఓ ఛానెల్ పదే పదే పవన్ మీటింగుల్ని చూపిస్తుంది కానీ, మిగతా వారు అస్సలు పట్టించుకోరు.
రాజకీయం చేస్తే సీరియస్ గా చేయాలి, సిన్సియర్ గా చేయాలి. ఈ రెండూ పవన్ కల్యాణ్ లో లేవు కాబట్టి జనం ఆయన్ను లైట్ తీసుకుంటున్నారు. ఎక్కడుంటాడో, ఏం చేస్తుంటాడో తెలియని పాల్ పదే పదే మీడియా ముందుకొచ్చి.. జాతీయ, అంతర్జాతీయ విషయాలపై అనర్గళంగా మాట్లాడతారు, అది కామెడీనే అయినా ఆయన ప్రయత్నం ఆయనది.
పవన్ ని కూడా అలా చేయాలని చెప్పలేం కానీ.. నిత్యం జనంలో ఉంటేనే ఏదైనా ఫలితం ఉంటుంది కదా. ఆ విషయంలో కనీసం కేఏ పాల్ నుంచైనా పవన్ ఎంతో కొంత నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో పవన్ కంటే పాలే మేధావి అని చెప్పక తప్పదు.